జిల్లాకు చేరిన తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:41 AM
ప్రభుత్వాసుపత్రిలో ప్రసవించిన తల్లి, నవజాత శిశువును క్షేమంగా ఇంటికి చేర్చడానికి అత్యాధునిక సదుపాయాలు ఉన్న తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు జిల్లాలోకి అందుబాటులోకి వచ్చాయి.
అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు
భీమవరం టౌన్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి):ప్రభుత్వాసుపత్రిలో ప్రసవించిన తల్లి, నవజాత శిశువును క్షేమంగా ఇంటికి చేర్చడానికి అత్యాధునిక సదుపాయాలు ఉన్న తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు జిల్లాలోకి అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం నరసారావుపేటలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి 300 వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. అందులో జిల్లాకు 14 వాహనాలు రావలసి ఉండగా ప్రస్తుతం పది వాహనాలు చేరుకున్నాయి. త్వరలో మిగిలినవి రానున్నాయి. ప్రస్తుత వాహనంలో అత్యధునిక సదుపాయాలను కల్పించారు. ఆరు ఎయిర్ బ్యాగ్స్‌తోపాటు ఫుట్‌రెస్ట్‌లు, జీపీ ఎస్ ట్రాకింగ్, ఎస్‌ఓఎస్ బటన్ వ్యవస్థను సమకూర్చారు. ఇప్పటివరకు జిల్లాలోని ఉన్న 14 వాహనాలను అరబిందో సంస్థ నిర్వాహణ చెయ్యగా కొత్తగా వచ్చిన ఈ వాహనాలను విద్యావేద ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. తల్లీ బిడ్డ వాహనాన్ని 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. అప్పటినుంచి ఈ వాహనానికి మంచి స్పందన వచ్చింది. ఐరన్, విటమిన్ల లోపంతో బాధపడుతున్న గర్భిణులను దగ్గరలో ఉన్న పీహెచ్‌సీలకు తీసుకువెళ్లి వారికి వైద్యసాయం అందిన తరువాత తిరిగి వారిని ఇంటి వద్ద దింపేవారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేసుకున్న తల్లి, బిడ్డను క్షేమంగా వారి ఇంటి వద్ద దింపుతారు.
తణుకులో ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి
తణుకు, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి):గర్బిణులు, బాలింతలు, నవ జాత శిశువులు ఆసుపత్రుల నుంచి సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను తిరిగి ప్రారంభించడం అభినంద నీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మంగళవారం తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఐదు తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ఆయన ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు వీటిని ప్రారంభించారని తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు.