పుర పోరులో రెబెల్స్ సెగ
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:26 AM
ఎన్నికల వేడితోపాటు రెబల్స్ బెడద అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
కూటమి కౌన్సిలర్ అభ్యర్థులకు సొంత నేతల నుంచే పోటీ
భీమవరంలో పది, తాడేపల్లిగూడెం
నాలుగు వార్డుల్లో ఉత్కంఠ
తణుకులో నాలుగుచోట్ల తిరుగుబాటు..
వైసీపీ నుంచి 30 మంది కొత్త అభ్యర్థులు
పాలకొల్లులో సస్పెన్షన్ వేటుతో
వెనక్కి తగ్గిన ఆశావహులు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఎక్కే గడప, దిగే గడప అన్నట్లుగా ఓటర్లను కలుసుకుంటుండగా.. ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే, ఎన్నికల వేడితోపాటు రెబల్స్ బెడద అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రధానంగా అధికార కూటమిలోనే ఈ పరిస్థితి తీవ్రంగా కనిపిస్తోంది. వార్డుల సర్దుబాటులో టికెట్లు దక్కని ఆశావహులు స్వతంత్రులుగా బరిలో నిలిచి, అధికారిక కూటమి అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తామంటూ సవాల్ విసురుతున్నారు.
భీమవరం 10 వార్డుల్లో రెబల్స్ బెడద
భీమవరంలో టీడీపీ, జనసేన పోటీ చేస్తున్న కొన్ని వార్డుల్లో సొంత పార్టీ నాయకులే స్వతంత్రులుగా రంగంలో ఉన్నారు. వైసీపీలో టికెట్ ఆశించేవారే కనిపించక, అడిగిన వారికి, అడగని వారికి కూడా పిలిచి మరీ టికెట్లు ఇచ్చిన పరిస్థితి నెలకొంటే.. కూటమిలో మాత్రం గెలుపు ధీమాతో తీవ్ర పోటీ ఏర్పడింది. ఆశించిన వారందరికీ సర్దుబాటు చేయలేకపోవడంతో సుమారు పది వార్డుల్లో రెబల్స్ బెడద తప్పడం లేదు. కూటమి నేతలు చివరి వరకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అదే కుటుంబంలో ఏదో ఒక పదవిలో ఉన్నవారు సైతం తమ బంధువులను బరిలోకి దింపి ప్రచారంలో పోటీ ఇస్తున్నారు. చైర్మన్ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలుస్తారన్న భరోసా ఉన్నప్పటికీ, కౌన్సిలర్ స్థానాలపై రెబల్స్ ప్రభావం ఎంత వరకు ఉంటుందనేది కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. పరిషత్ ఎన్నికల తరహాలోనే మున్సిపాలిటీలోనూ విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రచారం చేస్తూనే, వైసీపీ అభ్యర్థుల కదలికలపై దృష్టి సారించారు.
తాడేపల్లిగూడెంలో వీడని ఉత్కంఠ
తాడేపల్లిగూడెంలో నాలుగు వార్డుల ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. టీడీపీ పోటీ చేస్తున్న వార్డుల్లో స్వతంత్రులు రంగంలో ఉండటం, పొత్తు ధర్మాన్ని పాటించకుండా బరిలో నిలవడంతో కూటమి కౌన్సిలర్ అభ్యర్థులు ఇబ్బందులు పడుతూ ప్రచారంలో ఉరుకులు పరుగులు తీయాల్సి వస్తోంది. ఒక వార్డులో అయితే టీడీపీ, జనసేన అభ్యర్థులిద్దరూ పోటీలో నిలిచే పరిస్థితి ఏర్పడింది. కూటమి నేతలు ఏకతాటిపైకి రాకపోతే, అనైక్యత వల్ల వైసీపీ అనూహ్య విజయాలు సాధించిన తాడేపల్లిగూడెం రూరల్ మండల పరిషత్ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయని కేడర్ ఆందోళన చెందుతోంది. మున్సిపాలిటీలోనూ అలాంటి విజయాలే దక్కుతాయని వైసీపీ అంచనా వేస్తోంది. అయితే పరిషత్ ఎన్నికల్లో దెబ్బతిన్న కూటమి నాయకులు ఇప్పుడు మేల్కొని గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతుండగా, అధిష్ఠానం సైతం ఇక్కడి ఎన్నికలపై ఆరా తీస్తోంది.
తణుకులో నాలుగు చోట్ల స్వతంత్రుల పోటీ
తణుకు మున్సిపాలిటీలో స్వతంత్రుల బెడద ఉన్నప్పటికీ, వారి ప్రభావం అంతగా ఉండదని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. పరిషత్ ఫలితాలనే ఇక్కడా సాధిస్తామన్న ధీమాతో ముందడుగు వేస్తున్నారు. వైసీపీ 30 వార్డుల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దించడం, వారికి ప్రజలతో అంతగా పరిచయం లేకపోవడం తమకు కలిసొచ్చే అంశంగా కూటమి భావిస్తోంది. అయితే, నాలుగు వార్డుల్లో కూటమికి చెందిన ఒకరిద్దరు నాయకులే రెబల్స్‌ను పోటీలో నిలిపారు. పార్టీ గుర్తులు లేనందున ప్రజల నుంచి వారికి స్పందన ఉండదని కూటమి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పాలకొల్లులో సస్పెన్షన్‌తో తగ్గిన తిరుగుబాటు
పాలకొల్లు మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలు మినహా యిస్తే సుమారు 30 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. వీరి ప్రభావం ఎంత వరకు ఉంటుందనే దానిపై నాయ కులు లెక్కలు వేస్తున్నారు. అయితే ఇక్కడ కూటమి నుంచి రెబల్స్ బెడద అంతగా లేదు. చైర్మన్ అభ్యర్థిగా బరిలో దిగిన ఒక మహిళా నాయకురాలిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయడంతో, మరెవరూ తిరుగుబాటు చేసే సాహసం చేయలేకపోయారు. బరిలో ఉన్న స్వతంత్రులు తమ అభ్య ర్థుల విజయంపై ఎలాంటి ప్రభావం చూపలేరని కూటమి నేతలు ధీమాగా ఉన్నారు.