రియల్ జోష్
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:17 AM
ఇటీవల రియల్ ఎస్టేట్ రంగం కాస్త ఊపందుకుంటోంది. రిజిస్ర్టేషన్ శాఖ ఆదాయం పెరిగింది.
50 శాతానికి వీఎల్‌టీ తగ్గింపు
ప్రభుత్వ నిర్ణయంతో రియల్టర్ల హర్షం..
నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఇదే ట్యాక్స్ వసూలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా నష్టపోయింది. రకరకాల భారాలు, ల్యాండ్ కన్వర్షన్ ఫీజుల రూపేణ నష్టాల్లో కూరుకుపోయింది. ఈ రంగానికి మరింత ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం ఖాళీ స్థలాల పన్ను (వీఎల్‌టీ)ను 50 శాతానికి తగ్గిస్తూ చట్ట సభలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా రాబోయే రోజుల్లో రియల్ రంగానికి మరింత భూమ్ రానుంది. పెండింగ్‌లో వున్న ఖాళీ స్థలాల పన్ను స్థానిక సంస్థలకు జమ కానుంది.
రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ స్థలాలపై పన్నును 50 శాతానికి తగ్గించింది. ఆ స్థలంలో నిర్మాణాలు పూర్తయ్యే వరకు అదే అమలులో ఉంటుంది. నిర్మాణాలకు పన్ను విధించిన తర్వాతే ఖాళీ స్థలాలపై పూర్తిగా మినహాయిస్తారు. ప్రస్తుతం ఖాళీ స్థలాలకు 0.2 శాతం పన్ను విఽధిస్తున్నారు. భూమి రిజిస్ర్టేషన్ విలువ లక్ష రూపాయలు ఉంటే పన్ను రూ.200 వేస్తున్నారు. ఇకపై రూ.100 మాత్రమే వసూలు చేస్తారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఇటీవల రియల్ ఎస్టేట్ రంగం కాస్త ఊపందుకుంటోంది. రిజిస్ర్టేషన్ శాఖ ఆదాయం పెరిగింది. ప్రభుత్వం నిర్మాణదారులకు వెసులుబాటు కల్పిస్తూ వస్తోంది. రిజిస్ర్టేషన్ సమయంలోనే పన్ను మార్పిడి విధానాన్ని తెరపైకి తెచ్చింది. భీమవరం, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఇదే విధానం అమలు జరుగుతోంది. మున్ముందు ఇతర మున్సిపాలిటీలకు వర్తించనుంది. దీనివల్ల ప్రత్యేకంగా మళ్లీ మున్సిపాలిటీకి వెళ్లాల్సిన పనిలేదు. దరఖాస్తు చేసుకునే అవసరం లేదు. రిజిస్ర్టేషన్ జరిగినప్పుడే కొనుగోలుదారుని పేరుతో పన్ను బదలాయింపు జరగనుంది. గతంలో మున్సిపాలిటీలకు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. అధికారులు చుట్టూ తిరిగితే తప్పా పన్ను మార్పిడి జరిగేది కాదు. కొత్త పన్నుకు అవకాశం ఉండేది కాదు. భీమవరం, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఇటువంటి అవస్థల నుంచి ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. ఇతర మున్సిపాలిటీలకు ఇదే విధానం అమలు జరిగితే కొనుగోలు దారులకు ఇబ్బందులు తప్పనున్నాయి.
కొత్త నిర్మాణాల పన్నుపైనే అసంతృప్తి
ప్రభుత్వం ఇటీవల రిజిస్ర్టేషన్లపై కొత్త విధానం అమలులోకి తెచ్చింది. పట్టణాల్లో పన్ను చెల్లిస్తేనే నిర్మాణాలకు రిజిస్ర్టేషన్ చేయాలని దిశా నిర్దేశం చేసింది. ఇప్పటి వరకు అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత నిర్మాణాలు, విల్లాలు అమ్మకాలు చేస్తే ముందుగా రిజిస్ర్టేషన్ అయిపోయేది. ఆ తర్వాత కొనుగోలుదారుని పేరుతో పన్ను వేసేవారు. ప్రస్తుతం పన్ను చెల్లించిన తర్వాత మాత్రమే రిజిస్ర్టేషన్‌లు చేస్తున్నారు. దీనివల్ల రెండుసార్లు పన్ను చెల్లించాల్సి వస్తోందని నిర్మాణదారుల్లో అసంతృప్తి నెలకొంది. ముందుగా బిల్డర్ పేరుతో ప్లాట్ ఉంటున్నాయి. వాటిని కొనుగోలుదారులకు విక్రయించాలంటే బిల్డర్ పేరు మీద పన్ను చెల్లించాలి. అప్పుటే అమ్మకానికి వెసులుబాటు ఉంటుంది. రిజిస్ర్టేషన్ అయిన తర్వాత మళ్లీ కొనుగోలుదారుడు పన్ను చెల్లించాల్సి వస్తోంది. బదలాయింపు పన్ను మున్సిపాలి టీలకు జమచేయాలి. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఇది కాస్త అధికంగా ఉంది. ఇతర మున్సిపాలిటీల్లో తక్కువగా ఉంది. భీమవరం, పాలకొల్లు, తణుకు, నర్సాపురం మున్సిపాలిటీల్లో గరిష్టంగా రూ.2 వేలు బదలాయింపు పన్ను చెల్లిస్తే సరిపోతోంది. అదే తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో రూ.30 వేల వరకు వెచ్చించాలి.
కొత్త నిర్మాణాలకు ఇలా రెండు పర్యాయాలు చెల్లించాల్సి ఉండడంతో కొనుగోలుదారులకు అధిక భారం అవుతోంది. మొండి బకాయిలు, పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టే బాపతులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుగా పన్ను చెల్లింపు విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇది కొత్త నిర్మాణాలకు కాస్త ఇబ్బందికరంగా మారింది. దీనిపై పునరాలోచన చేయాలి.
మార్చి నుంచే అమలు..!
చట్ట సభల్లో రియల్ భూములపై వీఎల్‌టీ 50 శాతం తగ్గింపు సవరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. దాని తర్వాత ఈ విధానం అమలులోకి రానుంది. ఇప్పుడి ప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగి న వారికి ప్రభుత్వ నిర్ణయం ఊరటని స్తుంది. రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి.. నిర్మాణం పూర్తయ్యేలోగా 50 శాతం రాయితీ వర్తిస్తుంది. మార్చి మొదటి వారం నుంచి ఈ విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉంది.