జనన మరణాల లెక్క తేల్చండి!
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:07 AM
నకిలీ జనన, మరణాల ధ్రువపత్రాలను జారీ చేశారంటూ ఏలూరు నగర పాలక సంస్థ జనన, మరణాల విభాగంలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై వచ్చిన ఫిర్యాదుపై పునర్విచారణకు డీఎంహెచ్‌వో డాక్టర్ యు.శోభ ఉత్తర్వులు జారీచేశారు.
నకిలీ ధ్రువీకరణ పత్రాల జారీపై ఫిర్యాదు.. పునర్విచారణకు డీఎంహెచ్‌వో ఆదేశం
నగర పాలకసంస్థ ఎస్‌వో, ఏఎస్‌వోలను రేపు విచారించనున్న అధికారుల బృందం
ఏలూరు అర్బన్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): నకిలీ జనన, మరణాల ధ్రువపత్రాలను జారీ చేశారంటూ ఏలూరు నగర పాలక సంస్థ జనన, మరణాల విభాగంలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై వచ్చిన ఫిర్యాదుపై పునర్విచారణకు డీఎంహెచ్‌వో డాక్టర్ యు.శోభ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 8న జారీ అయిన ఈ ఉత్తర్వులు శనివారం వెలుగులోకి వచ్చాయి. కార్పొరేషన్ జనన, మరణాల విభాగంలో సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు నిర్వర్తించిన ఓ ఉద్యోగి 89 నకిలీ జనన, 7 నకిలీ మరణ ధ్రువీకరణ పత్రా లను జారీ చేశారంటూ నగరానికి చెందిన పి.శంకర్‌బాబు గతేడాది డిసెంబరులో సంబం ధిత జాబితాతో సహా తొలుత ఫిర్యాదు చేశారు. ఇలా జారీ చేసిన ఒక్కో నకిలీ జనన సర్టిఫికెట్ కు రూ.15 వేలు నుంచి రూ.25 వేల వరకు, నకిలీ మరణ ధ్రువీకరణ పత్రానికి రూ.50 వేలు నుంచి రూ.75 వేల వరకు సబ్ రిజిస్ట్రార్ వసూ లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణకు డీఎంహెచ్‌వో కార్యాలయ పరిపాల నాధికారి, ఒక స్టాటిస్టికల్ ఆఫీసర్, ఒక అసి స్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లతో కూడిన బృందాన్ని అప్పటి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి నియ మించారు.
ఈ క్రమంలో విచారణాధికారికి సహకరించేం దుకు నియమితులైన స్టాటిస్టికల్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లపైనే నకిలీ సర్టిఫికెట్ల ఆరోపణలున్న నేపథ్యంలో నకిలీ సర్టిఫికెట్ల జారీకి బాధ్యులను తేల్చడానికి నిర్వహిస్తున్న విచారణ పారదర్శకంగా జరిగే అవకాశమే లేద ని పేర్కొంటూ ఏలూరుకు చెందిన గల్లా సునీల్ ుమార్ కలెక్టర్ వెట్రిసెల్వికి ఇటీవల ఫిర్యాదు చేశారు. నకిలీ జనన, మరణాల ధ్రువీకరణ పత్రాల జారీ ఆరోపణలు ఎదుర్కొంటున్న నగరపాలక సంస్థ స్టాటిస్టికల్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లిద్దరూ గతంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లుగా, కార్పొరేషన్ బర్త్స్ అండ్ డెత్స్ సెక్షన్‌లో సబ్ రిజిస్ట్రార్లుగా పని చేసిన సమయంలో మొత్తం 145 నకిలీ జనన, 19 నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారంటూ సంబంధిత నకిలీల జాబితాను అందజేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారణ కమిటీ నుంచి తొలగించి, అర్హులైన అధికారులతో పునర్విచారణ చేయించడంతోపాటు, నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేయాలని సునీల్‌కుమార్ కలెక్టర్‌ను అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో కొత్తగా విచారణ కమిటీని నియ మిస్తూ, వారం రోజుల్లోగా సమగ్ర విచారణ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. పునర్విచారణ కమిటీకి డీఎల్‌ఏటీవో (జిల్లా లెప్రసీ,ఎయిడ్స్,టీబీ నియంత్రణాధికారి) డాక్టర్ లక్ష్మీనారాయణ, నూజివీడు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.పద్మావతి నేతృత్వం వహిస్తారు. కమిటీకి సహకరించేందుకు కొత్తగా స్టాటిస్టి కల్ ఆఫీసర్ ఆనంద్‌కుమార్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కిషోర్‌బాబులను నియమించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నగర పాలక సంస్థ ఎస్‌వో, ఏఎస్‌వోలు ఇద్దరినీ ఈ నెల 13న పునర్విచా రణ కమిటీ విచారించాలని డీఎంహెచ్‌వో ఆదేశించారు. ఇంతకుముందు నిర్వహించిన విచారణను ఉపసంహరించుకుం టున్నామని, ఆ మేరకు సంబం ధిత విచారణ నివేదిక, రికార్డులు, సాక్ష్యాధారాలను పునర్విచారణాఽ దికారులకు అందజేయాలని డీఎంహెచ్‌వో కార్యాలయ ఏవోను ఆదేశించారు.