బస్తాలకు బస్తాలు మాయం
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:47 PM
రెండు రోజుల క్రితం పెదపాడు మండలం దాసరి గూడెం ప్రాంతంలో జరిపిన పోలీసుల తనిఖీల్లో 80 బస్తాల బియ్యం పట్టుబడడం, అవన్నీ తెల్లరేషన్ కార్డుదారులకు చౌకడిపోల ద్వారా ఉచితంగా అందించే బియ్యం కావడం గమనార్హం.
పీడీఎస్ బియ్యం నేరుగా బ్లాక్ మార్కెట్‌కు..
కొరవడిన అధికారుల నిఘా
పెదపాడు, జనవరి 2 (ఆం ధ్రజ్యోతి): రెండు రోజుల క్రితం పెదపాడు మండలం దాసరి గూడెం ప్రాంతంలో జరిపిన పోలీసుల తనిఖీల్లో 80 బస్తాల బియ్యం పట్టుబడడం, అవన్నీ తెల్లరేషన్ కార్డుదారులకు చౌకడిపోల ద్వారా ఉచితంగా అందించే బియ్యం కావడం గమనార్హం. ఆ బియ్యం లబ్ధి దారుల నుంచి డబ్బులు చెల్లించి సేకరించినవి కాదు.. రైస్ మిల్లుల నుంచి రేషన్ డిపోలకు సరఫరా చేసిన బియ్యం బస్తాలే. ఈ బస్తాలను కాకినాడ పోర్టుకు తరలించే క్రమం లో పట్టుబడ్డాయి. ఇన్ని బస్తాల రేషన్ బియ్యం ఎలా బయ టకు వచ్చాయి, ఎవరూ తీసుకొచ్చారు, ఏఏ డిపోల నుంచి వచ్చాయో అధికారులు విచారణలో తేలాల్చి ఉంది. మండలంలో 21,318 తెల్లరేషన్‌కార్డులు ఉండగా, 56,385 మంది లబ్ధిదారులకు ఉచితంగా రేషన్‌డిపోల ద్వారా ప్రభుత్వం బియ్యాన్ని అందజేస్తోంది. గతంలో రెవెన్యూ, సివిల్ సప్లయి అధికారులు దాడులు నిర్వహించి కొత్తూరు, సత్యవోలు తదితర చోట్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని కేసులు నమోదు చేసిన ఘటనలు ఉన్నాయి. ఆయా కేసుల్లో లబ్ధిదారుల నుంచి సేకరించి మూటలు కట్టిన బియ్యాన్నే సీజ్ చేశారు. ఇప్పుడు ఏకంగా గన్నీ సంచుల తోనే బియ్యం దొరకడం పట్ల అధికారుల నిఘా కొర వడిందనే వాదన బలంగా విన్పిస్తోంది. సీజ్ చేసిన బియ్యం బస్తాల మీద వున్న నంబర్లు, ఇతర సాంకేతిక ఆధారాలతో రెవెన్యూ, సివిల్ సప్లయి అధికారులతో కలిసి విచారణ నిర్వహిస్తున్నామని ఎస్‌ఐ శారదా సతీష్ తెలిపారు.