Share News

దళారుల భోజ్యం!

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:37 AM

జిల్లాలో రేషన్‌ మాఫియా చెలరేగిపోతోంది. నెలకు వేల మెట్రిక్‌ టన్నుల పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ రూ.లక్షల్లో గడిస్తున్నారు. కొన్నిచోట్ల డీలర్ల స్థాయి నుంచి దందా కొన సాగుతోంది. స్థానిక మిల్లులతో పాటు ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ రాష్ర్టానికి తరలించి సొమ్ము చేసు కుంటున్నారన్న ఆరోపణలున్నాయి.

దళారుల భోజ్యం!
విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేసిన రేషన్‌ బియ్యం (ఫైల్‌)

యథేచ్ఛగా రేషన్‌ బియ్యం పక్కదారి

ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 1,711 మెట్రిక్‌ టన్నులు పట్టివేత

విజిలెన్స్‌ దాడులు అరకొరే... పటిష్ఠ చర్యలు శూన్యం

పౌరసరఫరాల శాఖలోవిజిలెన్స్‌ కమిటీల ఏర్పాటు

ఇప్పటికైనా అడ్డుకట్ట పడేనా..?

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో రేషన్‌ మాఫియా చెలరేగిపోతోంది. నెలకు వేల మెట్రిక్‌ టన్నుల పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ రూ.లక్షల్లో గడిస్తున్నారు. కొన్నిచోట్ల డీలర్ల స్థాయి నుంచి దందా కొన సాగుతోంది. స్థానిక మిల్లులతో పాటు ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ రాష్ర్టానికి తరలించి సొమ్ము చేసు కుంటున్నారన్న ఆరోపణలున్నాయి. సమాచారం తెలిసినప్పుడు అధికారులు తనిఖీలు చేస్తున్నారే తప్ప.. కట్టడి ప్రత్యేక చర్యలు శూన్యం. ఈ ఏడాది ఏప్రిల్‌ మొదలుకుని ఇప్పటి వరకు రూ.కోటి46 లక్షల విలువైన 1,711 మెట్రిక్‌ టన్నుల అక్రమ బియ్యం నిల్వలను విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేసి సీజ్‌ చేశారు. 24 వాహనాలను సీజ్‌ చేశారు.

పొరుగు జిల్లాల దళారులతో మిలాఖత్‌

జిల్లాలో మోటారు సైకిళ్లపై తిరుగుతూ రేష న్‌ బియ్యం కొనే దళారులు 800 మందికి పైనే ఉంటారని అంచనా.మరో 80 మంది పైగా ట్రక్కు ఆటోలు, పాసింజర్‌ ఆటోలు, వ్యానులు టెంపోల్లో సేకరించేవారు ఉంటారని చెబుతున్నా రు. ఏలూరు సిటీ నుంచి ఆశ్రం మీదుగా అన్ని నియోజకవర్గాల కలుపుకుంటూ రావులపాలెం లోని పెట్రోలు బంకు సమీపంలో ఓ వైసీపీ నేతకు చేరవేస్తారు. అక్కడ నుంచి లారీల్లో నింపి కాకినాడ పోర్టుకు తరలిస్తుం టారు. దాదాపుగా ఎనిమిది లారీలు వరకు ఇక్కడ నుంచి వెళుతుంటాయి. కృష్ణా జిల్లాలో గుడ్ల వల్లేరు, గుడివాడ ప్రాంతాల్లో నలుగురు పార్టనర్లకు ఏలూరు జిల్లా పీడీఎస్‌ రైస్‌ అక్రమంగా తరలి వెళుతుంటుంది. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో ఒక టీడీపీ నేత అక్రమంగా పీడీఎస్‌ రైస్‌ కొని తరలిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఓ పోలీసు ఉన్నతాధికారి అతనిపై ఆరోపణలు చేసినా ఇప్పటి వరకు ఎటువంటి విచారణ లేదు. కృష్ణా–ఏలూరు జిల్లాలను కలిపే వలసపల్లి– గోగులం పాడు, కాట్రేనిపాడుల్లో పెద్ద ఎత్తున పీడీఎస్‌ బియ్యం కొనే దళారులు ఉన్నట్లు ఆరో పణ లున్నాయి. అక్కడ నుంచి తెలంగాణకు వెళ్లేలా హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా తుక్కు లూరు, నూజివీడు పక్కన రైస్‌మిల్లుల్లో దళా రులు బియ్యంను తరలించుకుని పాలిష్‌ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. చింతలపూడి నియోజకవర్గంలోని రేచర్ల– రాజు పోతేపల్లిల్లో రేషన్‌ బియ్యం తరలి వెళుతుం టుంది.

పక్కదారి షరా మామూలే

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చౌక బియ్యంలో సింహభాగం పక్కదారి పడు తోంది. కొందరు మిల్లర్లు, దళారులు, కిరాణా దుకాణదారులు కుమ్మక్కై దందా సాగిస్తున్నారు. గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి నేరుగా రూ.10 నుంచి రూ.15కు, పట్టణ ప్రాంతాల్లో రూ.20 వరకు బియ్యాన్ని దళారులు సేకరిస్తున్నారు. ఆ బస్తాలను కిరాణా దుకాణాల్లో నిల్వ ఉంచి రాత్రి వేళల్లో ఆటోలు, వ్యాన్‌లు, టెంపోల్లో మిల్లు లకు తరలిస్తున్నారు. అక్కడ పాలిష్‌ అనం తరం ఇతర బియ్యం సంచుల్లో కలిపేస్తున్నారు. కొందరు బియ్యాన్ని పిండి మిల్లులకు తరలిస్తూ టిఫిన్‌ హోటళ్లుకు అమ్ముకుంటున్నారు. మరి కొందరు కోళ్ల ఫారాలకు తరలిస్తున్నారు. రూపాయి బియ్యం కాస్త కాకినాడ పోర్టుకు వివిధ రూపాల్లో చేరడానికి రూ.34లు పైబడి అవుతుందని చెబుతున్నారు.

అంతా గప్‌చుప్‌

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, వ్యాపార నిల్వలు, వాటిని ఎక్కడికి తరలిస్తున్నారు. దందా వెనుక ఎవరెవరున్నారనే సమాచారం అంతా స్థానిక అధికారులకు తెలిసినా తమకేమి తెలియనట్టు వ్యవహరించడంతో అక్రమార్కులు మరింత చెలరేగిపోతున్నారు. ఉన్నతాధికారులు అడిగినప్పుడు ఎక్కడా ఎలాంటి అక్రమాలు జరగట్లేదని చెబుతుం డడం గమనార్హం.

మోటార్‌ సైకిళ్లపైనే ఎక్కువగా..

ఒకప్పుడు ఇంటి నుంచి రూ.10లకు కొనుక్కొని అమ్ముకునే వారు. ఇప్పుడు నేరుగా మోటార్‌ సైకిళ్లపై దళారులు తిరుగుతూ కేజీ రూ.14లకు కొనడంతో రేషన్‌ డీలర్లకు కొంత చెక్‌ పడిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ప్రతీ నెలా డిప్యూటీ తహసీల్దార్లు, ఇతర సిబ్బందికి మామూళ్లు షరా మాములేనని అసోసియేషన్‌ ప్రతినిధులు కొందరు చెప్పడం గమనార్హం. రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో తనిఖీల కోసం ప్రభుత్వం ప్రత్యేక విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బృందాన్ని ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటికైనా అక్రమాలకు కళ్లెం వేస్తారో? లేదో చూడాలి.

Updated Date - Jul 05 , 2026 | 12:37 AM