రేషన్.. పరేషాన్ !
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:03 AM
రేషన్ డీలర్లు రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే చాలాచోట్ల వారు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కష్టం తప్ప, లాభం లేకపోవడమే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కమీషన్ పెరుగుతుందనే ఆశించారు. కానీ ఆ పరిస్థితి కనిపించలేదు.
డీలర్లకు పెరిగిన నిర్వహణ భారం
పెరిగిన కూలి ఖర్చులు, షాపు అద్దెలు.. పెరగని ఆదాయం
నెలలో 20 రోజులు పనిచేసినా అదే కమీషన్
వృద్ధుల ఇళ్లకు సరఫరాలో అదనపు భారం
ఏలూరులో 1,123, పశ్చిమలో 1,052 మంది డీలర్లు
కమీషన్ పెంచాలి.. గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్
తాడేపల్లిగూడెం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): రేషన్ డీలర్లు రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే చాలాచోట్ల వారు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కష్టం తప్ప, లాభం లేకపోవడమే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కమీషన్ పెరుగుతుందనే ఆశించారు. కానీ ఆ పరిస్థితి కనిపించలేదు. దీంతో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నారు. గత ప్రభుత్వం డీలర్ల వ్యవస్థను పక్కన పెట్టి ఎండీయూలను తెరపైకి తెచ్చింది. ఎండీయూలకు కొమ్ము కాస్తూ వారిపై ఎలాంటి కేసులు లేకుండా కాపాడుకుంటూ వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ డీలర్ల వ్యవస్థను తెచ్చింది. తమకు కమీషన్ పెంచుతారని ఆశగా చూసిన వారికి చేదు అనుభవమే మిగిలింది. కమీషన్ పెంచకపోగా పనిభారం పెంచారు. ఇప్పుడు 15 రోజులపాటు డిపోలో సరుకులు ఇవ్వాలి. ఐదు రోజులపాటు 65 ఏళ్లు పైబడిన వారికి ఇంటికి తీసుకెళ్లి బియ్యం, సరుకులు ఇవ్వాలి. మొత్తం నెలలో 20 రోజులపాటు సేవ చేస్తే తమకు శ్రమ తప్ప ఏమీ లేదని వాపోతున్నారు. ఇప్పుడు అదనంగా ఒక కూలీని పెట్టుకుంటే కాని నిర్వహణ సాధ్యం కావడం లేదు. డీలర్లకు అదనపు ఆదాయం సమకూరేలా ఎక్కువ సరుకులు ఇస్తామని చెప్పినా ఆ దిశగా చర్యలు తీసు కోలేదు. ఇప్పుడు చౌక డిపోల్లో కార్డుదారులకు బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డీలర్సు చాలీచాలని కమీషన్‌తో కుటుంబాలను నెట్టుకుని రావడం భారంగా మారడంతో షాపులకు రాజీనామాలు చేసే పరిస్థితి వచ్చింది.
ఖర్చులు కూడా రావడం లేదు
రాష్ట్రవ్యాప్తంగా 29,794 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. ఏలూరు జిల్లాలో 1123, పశ్చిమ గోదావరిలో 1052 మంది డీలర్లు ఉన్నారు. వీరంతా రేషన్ షాపులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహణ ఖర్చులు పెరిగాయి. మారుమూల గ్రామాల్లో షాపు అద్దె నెలకు రూ.1500, కరెంట్ రూ.300, మండల కేంద్రాల్లో షాపు అద్దె రూ.3,000 నుంచి 4,000 మధ్య ఉంది. పట్టణాల్లో రూ.4 వేల నుంచి 6 వేల మధ్య ఉంది. పనిచేసే వారికి నెలకు రూ.4 వేల నుంచి 6 వేలు లేకపోతే రావడం లేదు.
డిమాండ్లు పట్టించుకునే వారేరీ ?
ఎంతో కాలంగా డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గౌరవ వేతనం నెలకు రూ.7,500 ఇవాలని, పట్టణ ప్రాంతంలో రూ.15 వేలు ఇవ్వాలని కోరుతున్నారు. కమీషన్ పెంచాలని కోరుతు న్నారు. ఇదే విష యాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు.
కేంద్రం వాటా కమీషన్‌లో జాప్యం
పేదలకు అందించే బియ్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తుంటాయి. వీటికి వేరువేరుగా కమీషన్ ఇస్తుంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పేదలకందించే బియ్యానికి ప్రతి నెలా ఎస్‌సీఎంలోకి జమ చేస్తోంది. కాని కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎఫ్‌బీసీ (ఆహార భద్రతా పథకం) ద్వారా అందజేసే బియ్యం వాటా కమీషన్ మాత్రం నెలవారీ డీలర్స్ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్స్‌కు జమ అవడం లేదు. ఇటీవలే మూడు నెలలకు ఒకసారి పడింది. దీంతో బయట నుంచి డబ్బులు తెచ్చి డీడీలు తీయాల్సి వస్తోంది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఐసీడీఎస్, ఎండీఎం కమీషన్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేశారు. దీంతో డీలర్లు కొంత ఊపిరి పీల్చుకున్నారు.
పారదర్శకత పేరిట సీసీ కెమెరాలు
పాదర్శకత పేరిట షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. అది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా ? డీలర్లు ఏర్పాటు చేసుకోవాలా ? అనే దానిపై స్పష్టత రాలేదు. ఒక వైర్‌లెస్ సీసీ కెమెరా ఏర్పాటు చేయాలంటే రూ.8 వేలు అవుతుంది. అదే విత్ వైర్ సీసీ కెమెరా ఏర్పాటు చేయాలంటే రూ.13 వేలు పైమాటే. దీనికి నెలనెలా మెయింట్‌నెన్స్ భారం అదనం.