రథసప్తమి వేడుక
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:24 AM
రథసప్తమి వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు.
తణుకు సూర్యాలయంలో భక్తుల రద్దీ
సూర్యప్రభ వాహనంపై చిన వెంకన్న
పంచ వాహనాలపై లక్ష్మీనారాయణుడు
తణుకు, జనవరి 25(ఆంధ్రజ్యోతి): రథసప్తమి వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. జిల్లాలో పలుచోట్ల సూర్య దేవాలయాలను భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. తణుకు పట్టణంలో సూర్యాల యానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో రద్దీ నెలకొంది. ఆలయం నుంచి సుమారు కిలోమీటరుపైగా భక్తులు క్యూలెన్ ఉంది. ప్రభుత్వ ఆసుపత్రి గేటు వరకు క్యూలైను ఉండడంతో, ట్రాఫిక్ ఇబ్బందులు తల్తెకుండా హైస్కూల్ ప్రాంగణంలోకి లైను ఏర్పాటు చేశారు. భారీ అన్నసమారాధన నిర్వహించారు. ప్రజలపై సూర్యభగవానుడి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఏపీ స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ బూరుపల్లి శేషారావు అన్నారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
రథసప్తమి వేళ సూర్యప్రభ వాహనంపై శ్రీవారు
ద్వారకాతిరుమల, జనవరి 25(ఆంధ్రజ్యోతి): సూర్యభగవానుడి లేలేత కిరణాలు పుడమిపై ప్రసరించే వేళ.. సప్తఅశ్వాలను అధిరోహించి సూర్య ప్రభ వాహనంపై ఉభయదేవేరులతో కొలువుతీరిన శ్రీవారు క్షేత్ర పురవీథుల్లో విహరించారు. సాయం సమయంలో చంద్రప్రభపై ఆసీనులై తిరువీథుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం ఉదయం, రాత్రి వేళల్లో జరిగిన ఈ వాహనసేవలు భక్తజనులకు నేత్రపర్వమయ్యాయి. ముందుగా ఆలయ ప్రాంగణలో ఉదయం సూర్యప్రభపైనా, సాయంత్రం చంద్రప్రభపై స్వామి, అమ్మవార్లను ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అర్చకుల వేదమంత్రోచ్ఛరణలు, భక్తుల గోవిందనామస్మరణలు, మేళతాళా లు మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం తిరువీధుల్లో తిరుగాడింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లకు హారతులు పట్టారు.
పంచ వాహనాలపై అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి
పాలకొల్లు అర్బన్, జనవరి 25(ఆంధ్రజ్యోతి): స్థానిక వైష్ణవ దేవాలయం అష్టభుజ లక్ష్మీనారాయణస్వామిని రథసప్తమి సందర్భంగా ఆదివారం ఉద యం నుంచి రాత్రి వరకూ ఐదు వాహనాలపై గ్రామోత్సవం నిర్వహిం చారు. ఉదయం 6 గంటలకు సూర్యప్రభ వాహనం, 9గంటలకు శేష వాహనం, మధ్యాహ్నం 1.30 గంటలకు హనుమత్ వాహనం, 4.30 గంటలకు గరుడ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారిని వివిధ అవతారాలతో అలంకరించి మేళతాళాలలతో ఊరేగించారు. స్వామివారికి ప్రత్యేక సేవలు, తిరుమంజనోత్సవాలు నిర్వహించారు. పాలక మండలి చైర్మన్ రేపాక ప్రవీణ్ భాను, ట్రస్టీలు, పవిత్రోత్సవ కమిటీ సభ్యులు, ఆలయ ఈవో బీవీవీ.సత్యనారాయణ శంకర్ పాల్గొన్నారు.
గోకుల పారిజాతగిరిలో వేడుకలు
జంగారెడ్డిగూడెం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): రథసప్తమి సందర్భంగా గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారికి సూర్యప్రభ వాహనసేవ, చక్రస్నానం నిర్వహించారు. సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయ కోనేరులో సుదర్శన మూర్తికి ప్రధాన అర్చకుడు నల్లూరు రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఈవో కలగర శ్రీనివాస్, అబ్బిన దత్తాత్రేయ, తదితరులు పాల్గొన్నారు.