మా సమస్యలను.. పట్టించుకోండి సారూ..!
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:17 AM
అభివృద్ధికి ఆమడ దూరంలో మేమున్నామంటూ ఆ గిరిజన గ్రామ వాసులు వాపోతున్నారు. అంకన్నగూడెం పంచాయతీలో మారుమూల గిరిజన గ్రామమైన రామచంద్రాపురం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.
అభివృద్ధికి ఆమడ దూరంలో రామచంద్రాపురం
జీలుగుమిల్లి, జూన్ 16(ఆంధ్రజ్యోతి): గిరిజన గ్రామాల అభివృద్ధికి కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం జన్‌మన్ పథకం అమలు చేస్తోంది. మరోవైపు అధికారులు ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్, రహదారులు గృహ నిర్మాణం, ఉపాధి పనికల్పన, వైద్య సేవలు మెరుగుపరచడం వంటి లక్ష్యాల్ని అధిగమించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమేనని అభివృద్ధికి ఆమడ దూరంలో మేమున్నామంటూ ఆ గిరిజన గ్రామ వాసులు వాపోతున్నారు. అంకన్నగూడెం పంచాయతీలో మారుమూల గిరిజన గ్రామమైన రామచంద్రాపురం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. గ్రామంలో మూడేళ్ల క్రితం నిర్మించిన 10 వేల లీటర్ల మంచి నీటి ట్యాంకే గ్రామస్థులకు దిక్కయ్యింది. ట్యాంకుకు లీకులు ఏర్పడడంతో విద్యుత్ సరఫరా ఉన్నంతసేపు మాత్రమే ట్యాంకులో నీరు ఉంటుందని, తర్వాత ట్యాంకు ఖాళీ అవుతుందని గ్రామస్థలు చెబుతున్నారు. ఇటీవల వేసవిలో తాగునీటి కొరత ఏర్పడడంతో పక్కనే రోడ్డుకు అటువైపున తెలంగాణ గ్రామమైన కన్నాయిగూడెం నుంచి గ్రామస్థులు ట్రాక్టర్లపై తాగునీరు తెచ్చుకున్నారు. మరోవైపు గుబ్బలమంగమ్మ గుడికి సమీపంలో కొండ ప్రాంతంలో ఉన్న గ్రామం కావడంతో భక్తులు గ్రామానికి వచ్చి మంచినీటిని తీసుకెళ్తుంటారని చెబుతున్నారు. జీలుగుమిల్లి, బుట్టాయ గూడెం మండలాలకు సరిహద్దులో ఉన్న ఏపులపాడుకు మరోవైపు తెలం గాణ రాష్ట్రం కన్నాయిగూడెంకు కలిపేలా గతంలో రూ.50 లక్షల నిధులతో తారురోడ్డు నిర్మించేందుకు పనులు చేపట్టారు. గతంలో ఉన్న రోడ్డును తవ్వి నిర్మాణం పేరుతో కంకర వేసి వదిలేశారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రాపురం–వేపులపాడు మధ్య ఉన్న సీసీ రోడ్డు సైతం రోడ్డు నిర్మాణం పేరుతో తవ్వడంతో పాడైందని ప్రస్తుతం తారు ధరలు పెరిగాయని రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేసినట్టు ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం అభివృద్ధి పేరిట రూ.కోట్ల నిధుల మంజూరు చేస్తున్నా ఇక్కడ ఏ అభివృద్ధి కన్పించడం లేదని, మారుమూల గిరిజన గ్రామాలపై పాలకులు అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
మంచినీటి ట్యాంకు నిర్మించాలి
ఎన్టీఆర్ హయాంలో ఐటీడీఏలు ఏర్పడిన సమయం మా గ్రామంలో మంచినీటి ట్యాంకు నిర్మించారు. మంచినీటి ట్యాంకు శిఽథిలావస్థలో ఉంది. విద్యుత్ సరఫరా ఉన్న సమయంలో మాత్రమే ట్యాంకులో నీరు ఉంటుంది. స్థానిక ప్రజాప్రతినిధులకు మంచినీటి సమస్యపై చెప్పినా పరిష్కారం కావడం లేదు. ఇటీవల రాత్రి సమయంలో చేతిపంపు వద్ద నీటిని తెచ్చుకుం టున్న గిరిజన మహిళ పాముకాటుకు గురై మృతి చెందింది. ఇంటింటికి నీటి సరఫరా వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– రాజన సావిత్రి, రామచంద్రాపురం
రోడ్ల నిర్మాణం చేపట్టాలి
మూరుమూల గిరిజన గ్రామాల రాకపోకలు సాగించేందుకు సరైన రోడ్డు లేదు. కూతవేటు దూరంలో గుబ్బలమంగమ్మ గుడి ఉంది. ఇక్కడకు వచ్చే భక్తులకు సైతం రోడ్డు, తాగునీరు వంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. గిరిజన గ్రామాల్ని కలిపే తారురోడ్డు నిర్మాణం ప్రారంభించి వదిలేశారు. పూర్తి చేయాలని అధికారులును కోరుతున్నాం.
– గెడ్డం రాజకుమారి, రామచంద్రాపురం