ఖండాలు దాటినా.. చెదరని రాఖీ బంధం !
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:59 PM
రాఖీ పండుగ వేళ ‘అన్నా చెల్లెళ్లు’ ఆత్మీయ అనుబంధానికి దూరాలు అడ్డంకిగా నిలవకుండా తపాలా శాఖ ప్రత్యేక సదుపాయం కల్పిస్తోంది.
తపాలా శాఖలో ప్రత్యేక సదుపాయం
విదేశాల్లో ఉంటున్న సోదరులకు రాఖీలు, కానుకలు
ఏలూరు రూరల్, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి) : రాఖీ పండుగ వేళ ‘అన్నా చెల్లెళ్లు’ ఆత్మీయ అనుబంధానికి దూరాలు అడ్డంకిగా నిలవకుండా తపాలా శాఖ ప్రత్యేక సదుపాయం కల్పిస్తోంది. ఉన్నత చదువులు, ఉద్యోగులు, వ్యాపారాలు కోసం విదేశాలలో స్థిరపడిన సోదరులకు రాఖీలు, గిప్టులు పంపుకునేలా ప్రత్యేక పోస్టల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచంలోని 155 దేశాలకు ఆకర్షణీయ గిఫ్ట్ బాక్సులు, ప్రత్యేక ఎన్వలప్‌లలో రాఖీలను పంపించుకునే అవకాశం కల్పించింది. రాఖీలతో పాటు గిఫ్ట్ బాక్సులను సైతం పంపించేందుకు తపాలాశాఖ ఏర్పాట్లు చేసింది. తడిచినా పాడవకుండా ప్రత్యేక ఎన్వలప్‌లను అందుబాటులో ఉంచింది. పంపిన రాఖీలు గరిష్టంగా 12రోజుల్లో కనిష్టంగా మూడు నుంచి నాలుగు రోజుల్లో విదేశాల్లోని సోదరులకు చేరేలా సదుపాయం కల్పించింది. ప్రైవేటు కొరియర్ సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకే ఈ సేవలు అందుబాటులో ఉండడంతో పలువురు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈనెల 28వ రాఖీ పండుగ నేపథ్యంలో విదేశాలలో ఉంటున్న సోదరులకు రాఖీలు, కానుకలు పంపించేందుకు ప్రజలు పోస్టాఫీసులను ఆశ్రయిస్తున్నారు. దూరంగా ఉన్నా ప్రేమాను రాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీని సోదరుల చెంతకు చేర్చేందుకు తపాలాశాఖ అందిస్తున్న ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి.