ఉరుకులు.. పరుగులు
ABN , Publish Date - May 03 , 2026 | 11:10 PM
అప్పటి వరకు ఎండ..ఇంతలోనే వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి.
ఒక్కసారిగా మారిన వాతావరణం ఈదురు గాలులు... వర్షం
ధాన్యం కాపాడుకునేందుకు రైతులు పరుగులు
జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో మాసూళ్లు
కల్లాల్లో 2 లక్షల టన్నుల ధాన్యం
15 రోజులపాటు వరుణుడు కరుణిస్తే దాళ్వా గట్టెక్కినట్టే..
భీమవరం రూరల్, మే 3 (ఆంధ్రజ్యోతి): అప్పటి వరకు ఎండ..ఇంతలోనే వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి. రైతుల గుండెల్లో రైళ్లు పరుగెట్టాయి.. పంట పొలాలవైపు పరుగుతు తీశారు. ఎండబెట్టిన ధాన్యం రాశులపై బరకాలు కప్పారు. చిన్నపాటి చినుకులు పడడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
2 లక్షల టన్నుల ధాన్యం కల్లాల్లోనే..
గడిచిన 20 రోజుల నుంచి దాళ్వా పంట మాసూళ్లు జరుగుతున్నాయి. పది రోజులు ముమ్మరంగా సాగుతున్నాయి. దానికి తగ్గట్లుగానే ధాన్యం స్పీడ్‌గా కొంటున్నారు. జిల్లాలో 2 లక్షల 31 వేల ఎకరాల్లో దాళ్వా పంట చేశారు. దీనిలో 1.70 లక్షల ఎకరాల పంట మాసూళ్లు జరిగింది. 4 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. ఇంకా 2 లక్షల టన్నుల ధాన్యం కల్లాల్లోనే ఉంది. 61 వేల ఎకరాలు పంట మాసూళ్లు చేయాల్సి ఉంది. మరో 15 రోజుల్లో పంట మాసూళ్లు పూర్తిస్థాయిలో అవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు.
అక్కడక్కడా జోరువాన
యలమంచిలి, ఆచంట, వాసవి పెనుగొండ, పెంటపాడు,మే 3 (ఆంధ్రజ్యోతి): యలమంచిలి మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సుమారు గంటపాటు జడివాన కురవడంతో అన్నదాతలు అవస్థలు పడ్డారు. కల్లాల్లో ఎండబెట్టిన ధాన్యం వర్షం బారిన పడుకుండా పరుగులు తీశారు. ఽధాన్యం రాశులపై బరకాలు, టార్ఫాలిన్లు కప్పారు. ఆరు గాలం శ్రమించి పండించిన పంట చేతికి దక్కుతుందో లేదేనని అన్నదాతలు ఆందో ళన చెందుతున్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఆచంటలో మండలంలో పలుగ్రామాల్లో ఉదయం సుమారు గంట పాటు జోరువాన కురిసింది. ధాన్యం రోడ్డుపై, కల్లాల్లోనే ఉండడంతో ఆందోళన చెందారు. వర్షం కారణంగా రోడ్లు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోపది రోజులు ఉంటే గట్టెక్కుతామని రైతులు చెబు తున్నారు. పెనుగొండలో గంట సేపు భారీవర్షం కురిసింది. రైతులు హడా వుడిగా ధాన్యం ఒబ్బిడి చేసుకున్నారు. పెంటపాడులో ఉదయం నుంచి మబ్బులు అలు ముకోవడంతో రైతులు భయపడ్డారు. మండలంలో రెండు వేల ఎకరాల్లో వరికోతలు జరగాల్సి ఉంది. చాలా మటుకు ధాన్యం కల్లాలపైనే ఉంది. ఎండతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజానీకానికి ఈ వాతావరణంతో కొంత ఉపశమనం లభించింది.