Share News

విత్తనానికి వేళాయె.. చినుకు జాడ లేదాయె !

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:56 AM

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. మృగశిర కార్తె రాకతో వర్షాలు కరుస్తాయని రైతుల నమ్మకం. భూము లు దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధమయ్యారు. కాని, ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయే తప్ప చినుకు రాలడం లేదు.

విత్తనానికి వేళాయె..  చినుకు జాడ లేదాయె !
కుక్కునూరులో దుక్కులుదున్ని పత్తి విత్తనాలు వేయడానికి సిద్ధం చేసిన భూములు

వరి, పత్తి సాగులో జాప్యం.. రైతుల అవస్థలు

మన్యంలో పత్తి విత్తనాలు కొనేవారు కరువు

కుక్కునూరు, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి):ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. మృగశిర కార్తె రాకతో వర్షాలు కరుస్తాయని రైతుల నమ్మకం. భూము లు దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధమయ్యారు. కాని, ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయే తప్ప చినుకు రాలడం లేదు. ఇప్పటికి మే నెల మాదిరి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కటే ఎండ, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజూ సాయంత్రం, ఉదయం మబ్బులు మేఘాలు పట్టడం తప్ప వర్షం మాత్రం పడటం లేదు. శనివారం కూడా వాతావరణం వేసవిని తలపించింది. దీంతో సార్వా సాగుకు సన్నద్దం కావడానికి రైతులు ఆలోచిస్తున్నారు. వర్షాలు ఎప్పుడు కురుస్తాయా అని ఈ ప్రాంత రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట, పెనుగొండ, పోడూరు, పెనుమంట్ర తదితర మండలాల్లో వరి పొలాలు ఎడారిని తలపిస్తున్నాయి. గొర్రెలు సైతం ఈ పొలాల్లో మేతలు మేస్తున్నాయి. అక్కడక్కడ సార్వా సాగు కోసం రైతులు నారుమడులు వేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆకాశం మబ్బులు పట్టి కొంత సేపు గాలి వేసినప్పటికి వర్షం పడలేదు. కాని రాత్రి తెల్లవార్లు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

పత్తి సాగు చేసేదెలా ?

ఏజెన్సీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఏటా రైతాంగం మే చివరి నుంచి పత్తిసాగుకు సన్నద్ధం అవుతారు. భూమి దుక్కి దున్ని ఆ దుక్కిలో పత్తి విత్తనాలు వేసి పైన పొడిమట్టి నొక్కుతారు. ఏ మాత్రం వర్షం పడినా ఆ గింజలు మొలకెత్తుతాయి. మరికొంత మంది రైతుల వర్షం ఆరంభమైన తర్వాత పత్తి గింజలు వేస్తారు. జూన్‌లో జోరుగా ఈ వ్యవసాయ పనులు సాగుతాయి. ఈ ఏడాది జూన్‌ ముగుస్తున్నా వర్షం జాడ లేకపోవడంతో ఇంత వరకు కనీసం 10 ఎకరాల భూమిలో కూడా పత్తి సాగు ఆరంభం కాలేదు. ఎల్‌నినో ప్రభావంతో రుతు పవనాల రాక ఆలస్యం కావడంతో రైతాంగం సాగుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ రెండు మండలాల్లో ఏటా 10 వేల ఎకరాల్లో పత్తి సాగవుతుంది. పోలవరం ముంపు, మెరక భూములు, పోడు భూముల్లోను సాగు చేస్తారు. రెండేళ్లుగా అతివృష్టి, అనావృష్టి, ఆశించిన గిట్టుబాటు ధర లేక పత్తి రైతులు నష్టాల ఊబిలో ఉన్నారు. ఈ ఏడాదైనా సాగు ఆశాజనకంగా ప్రారంభించాలని రైతులు ఆశించారు. కాని, ఆరంభంలోనే వర్షాభావ పరిస్థితుల కారణంగా డీలా పడ్డారు. ఇక్కడ ఏటా 15 వేల విత్తనాల ప్యాకెట్లు ఎరువుల దుకాణాల్లో అమ్ముడవుతాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు వెయ్యి విత్తనాల ప్యాకెట్లు కూడా అమ్ముడు కాకపోవడం గమనార్హం.

ప్రత్యామ్నాయ పంటల దృష్టి

వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా తక్కువ కాల పరిమితిలో పండే అపరాలు, చిరుధాన్యాలు తదితర పంటలపై రైతులు దృష్టి సారించాలని కుక్కునూరు ఏవో బాలాజీ రైతులకు సూచించారు. ఆశాజనకంగా వర్షాలు వుంటేనే పత్తి సాగు చేయాలని లేదంటే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతులకు సూచిస్తున్నాం.

Updated Date - Jun 21 , 2026 | 12:56 AM