Share News

ముంపు పాట్లు

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:31 AM

మురుగు డ్రెయిన్ల ప్రక్షాళనలో జాప్యం, నిర్లక్ష్యం సార్వా సాగుకు గండంగా మారుతోంది. పది గ్రామాలకు సంబంధించిన 35 వేల ఎకరాల మురుగు నీరును బయటకు పంపే గునుపూడి సౌత్‌ డ్రెయిన్‌ ఐదేళ్లుగా సరిగా లాగకపోవడంతో రైతులు నష్టపోతున్నారు.

ముంపు పాట్లు
పెనుగొండ మండలం చేలల్లోకి నీరు చేరి నాట్లు మునిగిపోయిన పొలాలు

పూడుకుపోయిన గునుపూడి సౌత్‌ డ్రెయిన్‌

35 వేల ఎకరాలకు పొంచివున్న ముప్పు

10 కిలోమీటర్లకే మరమ్మతులు.. మిగిలిన వాటి మాటేంటి ? ఉప్పుటేరు మొగ బాగుచేస్తేనే నీరు బయటకు వెళ్లేది

సార్వా నాట్లు వేసిన రైతులకు వర్షాలు లేకున్నా ముంపు అవస్థలు

(భీమవరం రూరల్‌–ఆంధ్రజ్యోతి):

మురుగు డ్రెయిన్ల ప్రక్షాళనలో జాప్యం, నిర్లక్ష్యం సార్వా సాగుకు గండంగా మారుతోంది. పది గ్రామాలకు సంబంధించిన 35 వేల ఎకరాల మురుగు నీరును బయటకు పంపే గునుపూడి సౌత్‌ డ్రెయిన్‌ ఐదేళ్లుగా సరిగా లాగకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. కోమటితిప్ప, వెంప, తాడేరు, బేతపూడి, యనమదుర్రు, గునుపూడి ప్రాంతాల్లోని మురుగునీరు ఈ డ్రెయిన్‌ నుంచే వెళ్లాలి. మట్టిపూడికతీత తీసి మూడు దశాబ్ధాలు అవుతుంది. అప్పటి నుంచి చెత్త తొలగింపే తప్ప పూడికతీత జరగలేదు. ఈ కారణంగా మురుగునీరు దిగువకు వెళ్లడం లేదు. ఈ మధ్యనే డ్రెయిన్‌ దిగువన కొత్తాట నుంచి తొమ్మిది కి.మీ. పొడవునా కోటి రూపాయలతో అభివృద్ధి చేశారు. మిగిలిన 10 కి.మీ. పొడవునా మట్టి తొలగించాలి. దానికి ప్రతిపాదనలు పంపామని డ్రెయినేజీ అధికారులు చెబుతున్నారు. ఇది చేసినా డ్రెయిన్‌కి దిగువన కొత్తాట నుంచి ఉన్న ఉప్పుటేరు మొగ పూడికతీత తొలగింపు ఆరు కి.మీ. పొడవునా చేయాలి. అప్పుడే మురుగునీరు వేగంగా దిగువకు వెళుతుంది. ఇవి పూర్తి చేస్తేనే వేల ఎకరాల వరి సాగుకు ముంపు అవస్థలు తగ్గి సాగులో నష్టాల నుంచి గట్టెక్కుతారు.

ుఽ గత ఏడాది 20 బస్తాలు దిగుబడి

గునుపూడి సౌత్‌ డ్రెయిన్‌ నుంచి మురుగు నీరు బయటకు సరిగా వెళ్లకపోవడం వరి చేలు ముంపునకు గురవుతున్నాయి. గత ఏడాది ఐదు వేల ఎకరాలలో దిగుబడి ఎకరానికి 20 బస్తాలులోపు పడిపోయింది. నాట్లు ముంపు పొట్ట దశలో ముంపు తెగుళ్లు దాడి చేశాయి. పిలకలు తొడగలేదు. దీనివల్ల ఎకరానికి 10 బస్తాలు దిగుబడి వచ్చిన వరి చేలు ఉన్నాయి. అంతకు ముందు పంటలు నష్టాలు వచ్చాయని రైతులు చెబుతున్నారు. సార్వాలో వందల ఎకరాలు సాగుకు వెళ్లలేదు. ఒక పంట సాగుగా రైతులు నిర్ణయించుకున్నారు. బేతపూడి, తాడేరు, తుందుర్రు గ్రామాల్లో వెయ్యి ఎకరాలు పైగా సార్వా సాగడం లేదు. ఇదంతా డ్రెయిన్‌ ప్రభావమేనని రైతులు అంటున్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి.

ుఽ వర్షాలు పడితే ముంపు

డ్రెయిన్‌ పూడుకుపోవడంతో మురుగునీరు బయటకు వెళ్లడం లేదు. మూడేళ్లుగా సార్వా సాగు దెబ్బ తిని భారీ నష్టాలు వచ్చాయి. ఈ ఏడాది నాట్లు వేశారు. నీరు బయటకు వెళ్లడం లేదు. వర్షాలు పడితే మునిగిపోతాయి.

– నందమూరి కృష్ణ, రైతు, గునుపూడి

గత సార్వాలో ఎకరానికి 15 బస్తాలు దిగుబడి రాలే దు. వేల రూపాయలు నష్టపోయాను. డ్రెయిన్‌ చెత్తతో నిండిపోయింది. మొక్కుబడిగా బాగు చేస్తున్నారు. డ్రెయిన్‌ బాగుపై అధికారులు దృష్టి పెట్టాలి.

– నల్లం వెంకటేశ్వరరావు, తాడేరు

రెండు గంటల వర్షం..

పొంగిన కాల్వలు

పూడుకుపోవడంతో ముందుకు పారని నీరు.. పొలాలకు ముంపు

వాసవి పెనుగొండ/ఆచంట, జూలై 29 (ఆంధ్రజ్యోతి):వాతావరణం చల్లబడింది. మంగళవారం రాత్రి రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. నక్కల కాలువ పొంగి పొర్లుతోంది. నిన్న మొన్నటి వరకు నీరు లేక ఎండిన కాలువ వర్షపు నీటితో పొంగడంతో జలకళ సంతరించుకుంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు కురవకపోవడంతో నాట్లు వేసినా అవి పలుచోట్ల ఎండిపోయాయి. కొన్నిచోట్ల నీరందక నాట్లు వేయలేదు. ఈ సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో కాలువలు పొంగాయి. ఈ నేపథ్యంలో పెనుగొండ మండలంలోని పలుచోట్ల కాలువలకు ఆనుకుని ఉన్న పొలాల్లో నాట్లు వర్షపు నీటిలో మునిగిపోయాయి. శివారు ప్రాంతాలకు సైతం నీరు చేరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఆచంట మండలం తాడేరు, కొఠాలపర్రు నక్కల డ్రెయిన్లు భారీవర్షం కారణంగా పొంగి పొర్లుతున్నాయి. డ్రెయిన్లన్నీ పూడుకుపోవడం, గుర్రపుడెక్కతో నిండిపోవడంతో చిన్నపాటి వర్షానికి డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయని రైతులు వాపోతున్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు ఏకధాటిగా కురిసే అవకాశం ఉంది. దీనివల్ల డ్రెయిన్లు మరింత పొంగి పొర్లితే పంటలు నీటిపాలవడం ఖాయం. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సార్వా నాట్లు వేగంగా జరుగుతున్నాయి.

Updated Date - Jul 30 , 2026 | 12:31 AM