వర్షం లోటు.. పంటకు చేటు!
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:33 AM
వర్షాకాలం చివరి దశకు చేరుకుంది. అయినా జిల్లాలో వర్షాల జాడ అం తంత మాత్రమే. సూపర్ ఎల్‌నినో పరిస్థితులు ఇటు ప్రజలను, అటు రైతులను భయపెడుతున్నాయి.
ఎల్‌నినో ప్రభావంతో కానరాని వర్షాలు
గత మూడు నెలల్లో సరాసరి 49 శాతం వర్షంలోటు
లోటు వర్షపాతంతో అడుగంటిన భూగర్భజలాలు
భారీగా తగ్గిన సార్వా వరి సాగు
రబీ పైనా చూపనున్న ప్రభావం.. ఆందోళనలో రైతాంగం
(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)
వర్షాకాలం చివరి దశకు చేరుకుంది. అయినా జిల్లాలో వర్షాల జాడ అం తంత మాత్రమే. సూపర్ ఎల్‌నినో పరిస్థితులు ఇటు ప్రజలను, అటు రైతులను భయపెడుతున్నాయి. జూన్, జూలై, ఆగస్టు మాసాలలో వర్షాలు లేకపోవడంతో సార్వా సాగు లో రైతులు పడుతున్న ఇబ్బందు లు వర్ణనాతీతం. ఈ నెలల్లో సరాసరిగా 49 శాతం వర్షంలోటు కనబడుతోంది. ఎల్‌నినో కారణంగా వర్షాకాలంలోనూ ఎండల తీవ్రత విపరీతంగా ఉంటోంది. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితులు లేవని అధికారులు చెబుతున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి నా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురియని పరిస్థితి. ఇది వర్షాకాలమా .. వేసవికాలమా తెలియని పరిస్థితులతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. సాగు, తాగునీటి కి ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి బోర్లులో నీరు అడుగంటటంతో గ్రామాల్లో మంచినీటి సరఫరాలో ఇబ్బందులు ఇప్పటికే ఏర్పడ్డాయి. వర్షం లోటుతో భూగర్భజలాలు అడుగంటి బోర్ల కింద సాగు రైతులు సైతం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కొద్దిరోజులుగా వీస్తున్న వేడిగాలులు, వడగాడ్పులు, ఎండ తీవ్రత వల్ల అవస్థలు పడుతున్నారు. విద్యు త్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. వర్షాకాలంలోను ఇళ్లల్లో ఏసీలు, ఎయిర్ కూలర్ల వినియోగం బాగా పెరిగింది.
భారీగా పడిపోయిన సాగు విస్తీర్ణం
సూపర్ ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. జిల్లా లో సార్వా అరంభంలో 2.14 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని నిర్ణయించగా ప్రస్తు తం లక్షా 35 వేల ఎకరాల్లోనే సాగు జరుగు తోంది. సాగునీటి ఇబ్బందులు ఏర్పడు తు న్నందున ఆరుతడి పంటలు సాగు చేసు కోవాలని రైతులకు వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ప్రత్యామ్నాయ పం టల ప్రణాళిక అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయా లని అధికారులు సూచిస్తున్నా ఎంత వరకు అక్కరకు వస్తాయో తెలియని పరిస్థితిలో రైతులు వెనుకంజ వేస్తు న్నారు.
లోటు వర్షపాతం
గత మూడు నెలల్లో జిల్లాలో లోటు వర్ష పాతంతో సార్వా సాగు అస్తవ్యస్తంగా మారిం ది. ముఖ్యంగా నూజివీడు డివిజన్‌లో పరిసి ్థతి మరింత అధ్వానంగా ఉంది. గత మూడు నెలల్లో (జూన్, జూలై, ఆగస్టు) నూజివీడు డివిజన్‌లో 594.6 మిల్లీ మీటర్లు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉం డగా కేవలం 254.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ డివిజన్‌లో 57.3 శాతం లోటు వర్షపాతం ఏర్పడింది. ఏలూరు డివిజన్‌లో సాధారణ వర్షపాతం 524.2 మిల్లీ మీటర్లు కాగా 310.5 మి.మీ నమోదు కాగా 40.8 శాతం వర్షపా తం లోటు ఏర్పడింది. జంగారెడ్డిగూడెం డివి జన్‌లో 675.6 మి.మీలకు ఇప్పటివరకు 321.6 మి.మీ మాత్రమే వర్షపాతం నమోదైంది.
రబీ సాగు పైనా ప్రభావం
సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. చింతలపూడి, చాట్రాయి, కొయ్యలగూడెం వంటి మండలాల్లో పరిస్థితి మరింత దయ నీయంగా ఉంది. ఇదే పరిస్థితులు కొనసాగితే రబీసాగులో ఇక్కట్లు తప్పని పరిస్థితి కన్పి స్తోంది. జిల్లాలో రబీ సాగులో సాగునీటి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో లక్ష వరకు బోర్లు ఉన్నాయి. బోర్ల కింద లక్షల ఎకరాల సాగు జరుగుతోంది. భూగర్భజలాలు అడుగంటడం కారణంగా సాగు నీటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పశువులకు మేతగా వరినారు
ముదినేపల్లి : వర్షాలు కురవక, కాల్వల ద్వారా సాగు నీరందక ముదినేపల్లి మండలంలో బంటుమిల్లి మెయిన్ డిస్ట్రిబ్యూటరీ ఛానల్ కింద వందలాది ఎకరాల ఆయకట్టు ఈ ఏడాది బీడులుగా మారాయి. అష్టకష్టాలను దాటి పెంచిన వరి నారును నాటే అవకాశం లేక పశువులకు మేతగా వదిలేశారు. ఈ ఛానల్ కింద శివారు భూములైన వణుదుర్రు, దేవపూడి, ఊటుకూరు, కొత్తపల్లి, వాడవల్లి, నారాయణపురం తదితర గ్రామాల ఆయకట్టులో వందలాది ఎకరాల భూముల్లో గతంలో ఏనాడు లేని విధంగా సాగు నీరందక నాట్లు పడలేదు. వర్షాలు కురుస్తాయని, కాల్వల ద్వారా సాగు నీరందుతుందన్న ఆశతో మురుగు కాల్వల నుంచి, పంట కాల్వల్లో ఉన్న కొద్దిపాటి నీటిని ఇంజన్లతో తోడుకుని నారుమళ్లు పెంచారు. మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కూడా పలువురు రైతులు నాణ్యమైన విత్తనాలను తెచ్చి మరీ నారుమళ్లు పోశారు. పొలాలను దుక్కులు చేసే అవకాశం లేక నాట్లు వేయకపోవడంతో నారుమళ్లలో పశువులను మేపుతున్నారు. దేవపూడి, వణుదుర్రు గ్రామాల ఏరియాల్లో 300 ఎకరాల భూముల్లో నాట్లు వేయలేదు. మరికొంత ఆయకట్టులో ఎదజల్లిన వరిపైరు సైతం నీరందక పూర్తిగా ఎండిపోయాయి. దేవపూడి–ఊటుకూరు మధ్య బీడులుగా ఉన్న భూములు ఎడారిని తలపిస్తున్నాయి.
ఏనాడు లేని దుస్థితి..
బంటుమిల్లి మెయిన్ డిస్ట్రిబ్యూటరీ ఛానల్ కింద పొలాలకు ఈ దుస్థితి ఏనాడు లేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక కాల్వల ద్వారా నీరందక వందలాది ఎకరాలు బీడులుగా మారాయి. ఎదజల్లిన పొలాలు, నారుమళ్లు దెబ్బతిన్న రైతులను, నీరందక నాట్లు వేయని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
చిన్నం మాధవ, వ్యవసాయ కార్మిక సంఘ నాయకుడు, వణుదుర్రు
250 ఎకరాలకే వరిసాగు పరిమితం
కుక్కునూరు : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది మండలంలో ఏ చెరువూ పూర్తిగా నిండలేదు. చెదురు మదురు వర్షాలకు పత్తి సాగుకు మాత్రమే అనుకూలంగా ఉంది. సాధారణంగా ఏటా మండలంలో మూడు వేల ఎకరాల్లో వరి సాగు జరుగు తుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 250 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పడ్డాయి. ప్రధాన చెరువుల ఆయకట్టులో పొలాలు బీడుగా దర్శనమిస్తున్నాయి. వరి నారు అందివచ్చినా చెరువులో నీరు లేకపోవడంతో పంట ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు వరిసాగుకు వెనుకంజ వేస్తున్నారు. వర్షాలు కురిసి చెరువుల నిండితేనే వరిసాగు చేసే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. మండలం లోని దౌలత్‌రామ్‌కుంట, కివ్వాక, చీరవల్లి, ఉప్పేరు, రాయ కుమరయ్యకుంట, ఇసుక పాడు, తదితర ప్రాంతాల్లో ఉన్న చెరువులన్నీ పూర్తిస్థాయిలో నిండకపోవడం తో వరిసాగు ప్రశ్నార్థకమైంది. ‘వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులను వరి సాగు చేయవద్దని సూచిస్తున్నాం. ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని అవగాహన కల్పిస్తున్నా’మని వ్యవసాయాధికారి బాలాజీ తెలిపారు.