దేవుడిపై భారం వేసి!
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:40 AM
ఖరీఫ్ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్ష పాతం నమోదవుతోంది. ఈ పరి స్థితుల్లో నీటిని పొదుపుగా వినియోగించా లని, అవసరమైతే వరికి బదులుగా ప్రత్యా మ్నాయ పంటలను ఎంచుకోవాలని సీఎం చంద్రబాబు, వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతుల ధైర్యం
ఎల్‌నినోనా...తగ్గేదేలే అంటున్న రైతులు
ఊపిరి పోసిన తాజావర్షం.. పొలాల్లో నిలిచిన నీరు.. ఖరీఫ్ పనులు ముమ్మరం
జంగారెడ్డిగూడెం రైతులకు బోరులు, కొంగువారిగూడెం జలాశయమే ఆధారం
పూర్తిస్థాయిలో నీరివ్వలేమంటున్న ఇరిగేషన్ అధికారులు
జంగారెడ్డిగూడెం రూరల్/ఏలూరు రూరల్/ ముదినేపల్లి/దెందులూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్ష పాతం నమోదవుతోంది. ఈ పరి స్థితుల్లో నీటిని పొదుపుగా వినియోగించా లని, అవసరమైతే వరికి బదులుగా ప్రత్యా మ్నాయ పంటలను ఎంచుకోవాలని సీఎం చంద్రబాబు, వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. అయితే రైతులు వర్షాలు కురుస్తాయన్న నమ్మకంతో దేవుడిపై భారం వేసి వరిసాగుకు ఉపక్రమిస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండల వ్యాప్తంగా ఏటా సుమారు 12 వేల ఎకరాల వరకు వరి సాగు చేస్తుంటారు. వీటిలో వర్షాలపై ఆధారపడి రెండు వేల ఎకరాలను రైతులు సాగు చేస్తుండగా మిగిలిందంతా బోరులు, ఎర్రకాలువ జలాశయం సాగు నీరుపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో ఇప్ప టికే రెండువేల ఎకరాల్లో వరి సాగు ప్రారంభ మైంది. పూర్తిస్థాయిలో ఆగస్టు 15వ తేదీ లోపు నాట్లు పడేలా రైతులు సమాయత్తం అవుతున్నారు.
జలాశయంలో 8 వేల ఎకరాలకు నీరు..
కొంగువారిగూడెం జలాశయంలో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరాయి. ఏటా జలాశయం ద్వారా కొంగువారి గూడెం నుంచి నల్లజర్ల వరకు ఎల్‌ఎంసీ ద్వారా 5వేల ఎకరాలకు, ఆర్‌ఎంసీ ద్వారా 10వేల ఎకరాలకు మొత్తం 15వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. ఈ ఏడాది కనిష్ఠ నీటి నిల్వల కారణంగా కేవలం 8వేల ఎకరాలకే సాగునీరివ్వగలమని ఇప్పటికే ఇరిగేషన్ అధి కారులు ఆయా గ్రామాల నీటి సంఘాలతో సమా వేశమై రైతులకు సూచించారు. జలాశయం పూర్తి సామర్థ్యం 83.5 మీటర్లు కాగా ప్రస్తుతం 78.2 మీటర్లు ఉంది. దీని కనిష్ఠ నీటి మట్టం 76 మీటర్లు. అంటే ఇప్పుడున్న నీటి నిల్వల ఆధారంగా కేవలం 0.65 టిఎంసీల నీరు మాత్రమే వ్యయ సా యానికి ఇవ్వగలరు. ఈ క్రమంలో రానున్న రోజుల్లో వర్షాలు విస్తా రంగా కురిసి జలా శయంలో నీరు చేరక పోతే అధికారులు ముందుగా చెప్పినట్టు కేవలం ఎని మిదివేల ఎకరాలకు మాత్రమే సాగునీరివ్వగలరు. ఇప్పటికే ఈనెల 15వ తేదీ నుంచి జలాశయం కుడి, ఎడమ కాలువల ద్వారా సాగు నీటిని విడుదల చేస్తు న్నారు. ఈ నేపథ్యంలో పంట చివరి దశలో సాగునీరు అందు తుందో లేదోనన్న సందిగ్ధం నెలకొంది.
ఏలూరు రూరల్ మండలంలో..
ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న హెచ్చ రిస్తున్నా ఏలూరు రూరల్ మండలంలో పలుచోట్ల రైతులు వరి సాగు ప్రారంభించారు. సుమారు 700 ఎకరాలలో వరి సాగు ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మండలం పరిధిలో తీవ్ర వర్షాభావం నెలకొంది. వర్షా లు, కాలువలకు సాగు నీటి విడు దలపై ఆశలు పెట్టుకుని వరిసాగు చేపట్టిన రైతు లు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రెండు రోజులు ఊహించకుండా కురిసిన వర్షం రైతులకు ఊపిరిపోసింది. ఒకవేళ నీరు రావని వరి సాగు వదిలేస్తే తర్వాత నీరు వచ్చినా ఏమి చేయలేమని, అదే నీరు అందు తుందన్న ఆశతో ముందుకు వెళితే ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడే నష్ట పోతామని, అదును దాటాక సాగు చేదామన్నా చేయలే మంటున్నారు. పోణంగి గ్రామ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నాట్లు వేశారు. మల్కాపురంలో 80 ఎకరాలు, జాలిపూడిలో 5 ఎకరాలు, చొదిమెళ్ళలో బోర్ల కింద 40 ఎకరాలు, వెంక టాపురంలో 40 ఎకరాలు వరిపంట సాగు అవుతుంది.
ముదినేపల్లి మండలంలో..
మూడు రోజులుగా కురుస్తున్న మోస్తరు వర్షాలు రైతులకు ఊరట కలిగిస్తున్నాయి. వెదజల్లిన వరి పైరుకు జీవం పోసినట్లయింది. మండలంలో 13 వేల ఎకరాల్లో సార్వా వరి సాగు చేస్తుండగా సీజను ప్రారంభం నుంచి కాల్వ ద్వారా సరిపడినంత నీరురాక, ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురియక పోవడంతో నారుమళ్లు, వెదజల్లిన పైరు ఎండిపోయింది. పైరును కాపాడుకు నేందుకు అత్యధిక వ్యయంతో కాల్వల్లో ఉన్న కొద్దిపాటి నీటిని ఇంజన్లతో తోడుకుంటూ రైతులు తంటాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాతావరణం చల్లబడి వర్షాలు కురవడం ప్రారంభం కావడంతో రెండు రోజులుగా భూముల్లో దుక్కులు నిర్వహించడం, నాట్లు వేసే పనులను చేపట్టారు. ఖరీఫ్ సాగుకు నీరందించలేమని ఇరిగేషన్ ఉన్నతాధికారులు ప్రకటించిన నేపథ్యంలో రైతులు వర్షం పైనే ఆశలు పెట్టుకున్నారు.
దెందులూరు మండలంలో..
రెండు రోజులుగా చిరు జల్లులు పడుతుండంతో పాటు గోదావరి కాల్వలో సాగునీరు పెరిగిన నేపథ్యంలో దెందులూరు మండలంలో ఖరీఫ్ వరి నాట్లు వేగం పుంజుకున్నాయి. బోర్ల కింద ఇప్పటికే వరి ఊడ్పులు పూర్తయ్యాయి. ముప్పవరం,కండ్రిగ నరసింహపురం గండివారిగూడెం గ్రామాల్లో చెరువుల పరిధిలో నాట్లు వేగంగా జరుగుతున్నాయి. మండలంలో పరిధిలో 80 శాతం పైగా వరి నాట్లు పూర్తయ్యాయి. సీతంపేట ఆయకట్టు రైతుల మాత్రమే పట్టిసీమ కాలువ సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు.