గాలి వాన.. బీభత్సం!
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:09 AM
జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీవర్షం బీభత్సం సృష్టించింది. భారీగా వీచిన ఈదురుగాలులతో ఏలూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌స్థంభాలు, చెట్లు నేలకొరిగాయి.
కుండపోతగా కురిసిన వర్షం
ఏలూరులో 58 మి.మీ వర్షపాతం
నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు.. చెట్లు
జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
స్తంభించిన జనజీవనం
నేలకొరిగిన మొక్కజొన్న, వరి.. రాలిన మామిడి.. అన్నదాతల ఆవేదన
ఏలూరుసిటీ, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీవర్షం బీభత్సం సృష్టించింది. భారీగా వీచిన ఈదురుగాలులతో ఏలూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌స్థంభాలు, చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. కుండపోతగా వర్షం కురియడంతో జనజీవనం స్తంభించింది. జిల్లాలో అత్యధికంగా ఏలూరులో 58 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కాగా జిల్లాలో సరాసరి వర్షపాతం 14.4 మి.మీ నమోదైంది. ఏలూరు నగరంలో పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అత్యధిక సంఖ్యలో విద్యుత్ స్థంభాలు నేలకొరగడం, విద్యుత్ లైన్లు తెగిపోవడంతో ఏలూరు నగరంలో రాత్రి 9గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నగరంలో విద్యుత్ పునరుద్ధరణ పనులను ఏపీఈపీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ సాల్మన్‌రాజు పరిశీలించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులు ప్రభావం కారణంగా 105 హెక్టార్లలో మొక్కజొన్న పంట దెబ్బతినగా, 4 హెక్టార్లలో వరి పంట దెబ్బతిందని జిల్లా వ్యవ సాయ శాఖ ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. పెదపాడు మండలంలోని మూడు గ్రామాలు, కొయ్యలగూడెం మండలంలో మూడు గ్రామాలు, ముసు నూరు మండలంలో ఐదు గ్రామాలు, పెదవేగి మండ లంలో నాలుగు గ్రామాల్లో, జంగారెడ్డిగూడెం మండ లంలో ఒక గ్రామంలో 223 రైతులకు చెందిన మొక్క జొన్న పంట, పెదపాడు మండలంలో మూడు గ్రామాల్లో ఏడుగురికి చెంది న వరి పంట దెబ్బతిందని జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ బాషా తెలిపారు.
జిల్లాలో వర్షపాతం వివరాలు
పెదపాడులో 47.2 మి.మీ, లింగపాలెం 36, పెదవేగి 33.4, ఏలూరు రూరల్ 30, కొయ్యల గూడెం 23.2, ముసునూరు 22.4, బుట్టాయి గూడెం 19, దెందులూరు 17.2, కుక్కునూరు 15.6, ఆగిరిపల్లి 15.2, కామవరపుకోట 14.4, జంగారెడ్డిగూడెం 14.4, చింతలపూడి 11.8, జీలు గుమిల్లి 10.6, భీమడోలు 5.8 వర్షపాతం నమోదు కాగా జిల్లాలోని మిగిలిన వర్షం కురిసిన మండ లాల్లో 5 మి.మీ కన్నా తక్కువగానే కురిసింది.