Share News

ఈదురు గాలులు.. వర్షం

ABN , Publish Date - Mar 22 , 2026 | 12:51 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అవర్తనం కారణంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు వర్షం కురిసింది.

ఈదురు గాలులు.. వర్షం
వర్షపు నీటితో మునిగిన జంగారెడ్డిగూడెం ఐసీఐసీఐ బ్యాంకు రోడ్డు

పోలవరం మండలంలో రెండు గంటలు నిలిచిన విద్యుత్‌ సరఫరా

జంగారెడ్డిగూడెంలో నీట మునిగిన రోడ్లు

పోలవరం/బుట్టాయగూడెం/జంగారెడ్డిగూడెం, మార్చి 21(ఆంధ్ర జ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అవర్తనం కారణంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు వర్షం కురిసింది. ఏజెన్సీలోని పోలవరం మండలంలో వీచిన గాలులకు రెండు గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పట్టిసీమ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రధాన రహదారిపై చెట్టు కూలి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. స్థానికులు చెట్టును తొలగించారు. బుట్టాయగూడెంలో కురిసిన వర్షానికి పొగాకు పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. జంగారెడ్డిగూడెంలో గంటన్నరపాటు ఈదురుగాలులతోపాటు కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారులపై ఉన్న డ్రెయిన్లు పొంగి పొర్లాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం తగ్గిన వెంటనే ఎండ రావడం విశేషం. తణుకు, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో తుపర్లు పడ్డాయి. కాసేపటికే ఉక్కబోత మొదలైంది.

Updated Date - Mar 22 , 2026 | 12:51 AM