ద్రోణి ప్రభావం.. జిల్లాలో వర్షాలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 01:07 AM
జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయగా జిల్లాలో పలు చోట్ల బుధవారం స్వల్పంగా వర్షాలు కురిశాయి.
ఏలూరుసిటీ/నూజివీడు టౌన్/చాట్రాయి/ ముసునూరు/పెదపాడు/కుక్కునూరు/లింగ పాలెం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయగా జిల్లాలో పలు చోట్ల బుధవారం స్వల్పంగా వర్షాలు కురిశాయి. భీమడోలు, జంగారెడ్డిగూడెం, పెదపాడు, తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ప్రస్తుతం జిల్లాలో రబీ వరి సాగు చివరి దశకు చేరటంతో వర్షాలు భారీగా కురిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని రైతులు చెబుతున్నారు. రానున్న మూడు రోజుల పాటు కోస్తాంధ్ర , రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. నూజివీడులో ఉరుములు పిడుగులతో భారీవర్షం పడింది. పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్‌లోని లెక్చరర్ దొడ్డ కమల కుమారి ఇంటిపై పిడుగు పడడంతో పైభాగం ధ్వంసమైంది. కంగారుపడిన ఇంట్లోవాళ్లు, సమీప నివాసితులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చాట్రాయి మండలంలో అకాల భారీ వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మెక్కజొన్న పంట కోతదశలో ఉంది.
ముసునూరు మండలంలో పందిళ్లపై ఉన్న నాటు పొగాకు పంటను కాపాడుకోవడానికి రైతులు పరదాల కోసం ఇతర ప్రాంతాలకు పరుగులు తీశారు. సీడ్ మొక్కజొన్న పంటల విరుపుడు ముమ్మరంగా జరుగుతున్న నేపఽథ్యంలో ఈ వర్షం వల్ల విరుపుడు మరింత అలస్యం అవుతుందని, దీని వల్ల ఆర్థికంగా నష్టం తప్పదని రైతులు చెబుతున్నారు. ఆగిరిపల్లి మండలంలో మామిడి, పొగాకు, మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. కుక్కునూరు మండలంలో వర్షంతో మిర్చి రైతాంగంలో ఆందోళన వ్యక్తమైంది. ఇప్పటికే కోసిన పండుమిర్చి కల్లాల్లో ఉంది. ఎండిన మిర్చిని కుప్పలుగా పోసి పైన బరకాలు కప్పారు. లింగపాలెం మండలంలో వర్షం వల్ల మిర్చి, పొగాకు, మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడ్డారు.