ముసురేసింది
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:51 AM
అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
అల్పపీడన ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల వర్షం
రైతుల ఆందోళన
భీమవరంటౌన్, మార్చి 18(ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం చెదురు మదురు జల్లులతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయంనుంచి ఎండ తీవ్రత ఉన్నా మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృత మైంది. ఉరుములుతో వర్షం ప్రారంభమైంది. భీమవరం పట్టణంలో కొద్దిసేపు వర్షం పడింది. పెనుమంట్ర మండలంలో దాదాపు 20 నిమిషాలపాటు భారీ వర్షం కురిసింది. వీరవాసరం, అత్తిలి, ఆకివీడు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, పాలకొల్లు, కాళ్ల ప్రాంతాల్లో చినుకులు పడ్డాయి. రాత్రి కూడా వాతావరణం మబ్బులతో ఉంది.
రైతన్నల గుండెల్లో గుబులు
తాడేపల్లిగూడెం రూరల్/భీమవరం రూరల్, మార్చి 18(ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడడంతో రైతులు కంగారు పడుతు న్నారు. జిల్లాలో 2.32 లక్షల ఎకరాల్లో దాళ్వా సాగు చేశారు. సగం సాగు ఈనిక దశ, సగం సాగు పొట్టదశలో ఉంది. మెట్ట ప్రాంతంలో వరి చేలు కోత దశకు వస్తున్నాయి. డెల్టాలో ఈనిక దశకు చేరడంతో రైతన్నలకు అల్పపీడన గుబులు పట్టుకుంది. ఈనిక దశ, గింజ పోసుకుంటున్న దశలో వర్షం, మబ్బులు తెగుళ్లకు దారితీస్తుంది. ఎండ కాయాల్సిన తరుణలో వర్షాలతో ఆకుముడత, అగ్గితెగులు, పొడ తెగులు సోకే అవకాశాలున్నాయి. మెట్ట ప్రాంతంలో కోత దశకు వచ్చిన వరి చేలు నేలకొరుగుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దాళ్వా సాగుకు ఆది నుంచి వాతావరణం అనుకూలంగా ఉన్నా చివరి దశలో వర్షాలతో దిగుబడిపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. సాగుకు వాతావరణ మార్పు నష్టం చేకూరుతుందని రైతులు వాపోతున్నారు.