Share News

పంటంతా నేలపాలు

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:17 AM

మరో పది రోజులు గడిస్తే మొక్కజొన్న పంట కోత పూర్త వుతుంది. ఇంతలో మాయదారి గాలివాన పంటను నేలపాలు చేసింది. మండలంలో ఈ రబీ సీజనులో 5,821వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగింది.

పంటంతా నేలపాలు
గార్లమడుగులో నేలవాలిన మొక్కజొన్న చేను

ఈదురు గాలులకు పడిపోయిన మొక్కజొన్న చేలు

పెరిగిన పెట్టుబడుల భారం

పంట చివరి దశలో రైతులకు తీరని కష్టం

ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తి

పెదవేగి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): మరో పది రోజులు గడిస్తే మొక్కజొన్న పంట కోత పూర్త వుతుంది. ఇంతలో మాయదారి గాలివాన పంటను నేలపాలు చేసింది. మండలంలో ఈ రబీ సీజనులో 5,821వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగింది. ఇప్పటికే సగం పంట మాసూ ళ్లు పూర్తయ్యింది. ఈ తరుణంలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పంట చాపచుట్టలా నేలనంటు కుంది. అక్కడితో ఆగకుండా మంగళవారం సాయంత్రం మరోసారి భారీవర్షం కురవడంతో మొక్కజొన్న పంటకు తీవ్రనష్టం వాటిల్లుతుంద ని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురు గాలుల తీవ్రతకు విరుపుకొచ్చిన మొక్కజొన్న నేలనంటడంతో దానిని ఒబ్బిడి చేయడం అధిక శ్రమతో కూడిన పని అని, పెట్టుబడి రెట్టింపు అవుతుందని, నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి

పదిహేను ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. కొంత పంట మాసూళ్లు చేశాం. మరో ఐదు ఎకరాల్లో పంట ఉంది. అకాలవర్షానికి పంట నేల పాలైంది. దానిని కోయడానికి రెట్టింపు వ్యయమ వుతుంది. ప్రభుత్వంఆదుకోవాలి.

– కొల్లి సత్యనారాయణచౌదరి, రైతు, గార్లమడుగు

నిండా ముంచింది..

అకాలవర్షం నిండా ముంచింది. ఇప్పుడు విరవా లంటే రెట్టింపు పెట్టుబడి అవుతుంది. ఎకరానికి రూ.40 వేలు కౌలు చెల్లించాలి. ఇప్పటికే రూ.1.20 లక్షలు పెట్టుబడి అయ్యింది. అప్పుచేసి కౌలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

– కొల్లి రామాంజనేయులు, రైతు, గార్లమడుగు

అప్పులే కనిపిస్తున్నాయి..

గాలివాన పంటచేనును పడేసి పోయింది. ఇప్పుడు కండెలు విరవాలంటే పెట్టు బడి అదనంగా అవుతుంది. నేలవాలిన మొక్కజొన్నను చూస్తుంటే అప్పులు కనిపిస్తున్నాయి.

– మార్ని మహేశ్‌, రైతు, గార్లమడుగు

105 హెక్టార్లలో మొక్కజొన్నకు నష్టం

ఏలూరుసిటీ, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో రోజు మంగళవారం కూడా జిల్లాలోని పెదవేగి, టి.నరసాపురం మండలా లతో పాటు పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. జిల్లాలో 19 గ్రామాల్లో మొక్కజొన్న, వరి పంటలు దెబ్బ తిన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. మొత్తం 223 మంది మొక్కజొన్న రైతులకు చెందిన 105 హెక్టార్లలో మొక్కజొన్న పంట దెబ్బతిందని ప్రాథమిక అంచనా వేశారు. పెదపాడు మండలంలో 4 హెక్టార్లు, టి.నరసాపురం మండలంలో 4 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. ఈదురు గాలులు, భారీ వర్షాలు కారణంగా ఏలూరు సర్కిల్‌ పరిధిలో విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ లైన్లు దెబ్బతినడంతో రూ.15.64 లక్షల నష్టం వాటిల్లిందని ఏపీఈపీ డీసీఎల్‌ జిల్లా ఎస్‌ఈ పి.సాల్మన్‌రాజు తెలిపారు. ఏలూరులో తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరా ఇచ్చినా పలు చోట్ల ఇంకా విద్యుత్‌ పునరుద్ధరణ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఏలూరు సర్కిల్‌ పరిధిలో విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేయడం, కొత్తగా స్తంభాలు ఏర్పాటు చేయడం వంటి పనులు జరుగుతున్నాయి.

Updated Date - Apr 08 , 2026 | 12:17 AM