Share News

వణికించిన గాలులు

ABN , Publish Date - May 30 , 2026 | 12:52 AM

రోహిణి కార్తెలో వాతావరణం రోజుకో విధంగా మారుతోంది. గురువారం రాత్రి ఒక్కసారిగా మబ్బులు, మేఘాలు ఏర్పడి భారీ వేగంతో వీచిన ఈదురుగాలులు.. ఎక్కడికక్కడ నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు.. ఎగిరిపోయిన ఫ్లెక్సీలు, కటౌట్‌లతో భయానక వాతావరణం కనిపించింది.

వణికించిన గాలులు
పెనుగొండ మండలం సిద్ధాంతం హైవేపై విరిగిన చెట్టు

కూలిన చెట్లు.. విద్యుత్‌ స్తంభాలు

తెగిపడిన వైర్లు.. ఎగిరిపడిన ప్లెక్సీలు

నేలనంటిన అరటి.. నేలరాలిన మామిడి

జిల్లాలో గంటపాటు వాతావరణం అల్లకల్లోలం

కరెంటు సరఫరా నిలిపివేత.. జనం జాగారం

పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు

వాతావరణం చల్లబడినా.. మళ్లీ ఉక్కపోత

విద్యుత్‌ శాఖకు రూ.28 లక్షలు నష్టం

రోహిణి కార్తెలో వాతావరణం రోజుకో విధంగా మారుతోంది. గురువారం రాత్రి ఒక్కసారిగా మబ్బులు, మేఘాలు ఏర్పడి భారీ వేగంతో వీచిన ఈదురుగాలులు.. ఎక్కడికక్కడ నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు.. ఎగిరిపోయిన ఫ్లెక్సీలు, కటౌట్‌లతో భయానక వాతావరణం కనిపించింది. ఏ చెట్టు పడుతుందో, ఏ ఫ్లెక్సీ వచ్చి మీద పడుతుందో, రహదారి వెంబడి ఉన్న షాపులపై ఉన్న రేకులు ఎక్కడ మీదకొస్తాయోనని ఎవరికి వారు వణికిపోయారు. అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రయాణి కులు షెల్టర్లలో తలదాచుకున్నారు. చాలా ప్రాంతాల్లో సుమారు 12 గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో రాత్రి జనం చాలా ఇబ్బందులు పడ్డారు.

భీమవరం టౌన్‌/ నెట్‌వర్క్‌, మే 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని తాడేపల్లిగూడెం, పాలకోడేరు, తణుకు, వాసవి పెనుగొండ, పెనుమంట్ర, వీరవాసరం, పెంటపాడు, ఉండి, అత్తిలి, ఆకివీడు తది తర ప్రాంతాల్లో ఈ దృశ్యాలే కనిపిం చాయి. తాడేపల్లిగూడెంలో ఎక్కడ చూసినా విరిగిన హోల్డింగ్స్‌, కూలిన చెట్లతో అల్లకల్లోలంగా మారింది. జనం బైకులు నడపలేనంత గాలి వీచింది. తేలిపోతున్నంత భారీ వేగంతో ఈదురుగాలులు వేయడంతో భయపడి చెట్లు లేని ప్రాంతాల్లో హైవేకు వున్న గడ్డర్లను పట్టుకుని వాహనాన్ని నిలిపి ఉండిపోయారు. గంటపాటు వెళ్లే అవకాశం లేకపోయింది. తాడేపల్లిగూడెం మసీదు సెంటర్‌, కుంచనపల్లికి వెళ్లే దారిలో పశువుల ఆసుపత్రి వద్ద పెద్ద చెట్టు కొమ్మలు విరిగి విద్యుత్‌ వైర్లపై పడింది. సరఫరాను నిలిపివేయడం తో పెను ప్రమాదం తప్పింది. చాలాచోట్ల శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తిస్థాయిలో విద్యుత్‌ను పునరుద్దరించారు.

ఓ వైపు దోమలు మరోవైపు విద్యుత్‌ నిలిచిపోవడంతో రాత్రంతా ప్రజలు నిద్రలేకుండా గడిపారు. ఉంగుటూరు నుంచి తాడేపల్లిగూడెం మధ్యలో చెట్ల కొమ్మలు రోడ్డుకు అడ్డుగా పడిపోవడంతో ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలాచోట్ల ప్రజలే స్వచ్ఛందం గా తొలగించారు. పడాల అయ్యప్పస్వామి గుడి సమీ పంలో ఏలూరు కాలువ గట్టుపై ఉన్న పెద్ద చెట్టు విరిగి రోడ్డుపై పడింది. ఏలూ రు నుంచి బస్సులు, వాహనాలు గూడెం వైపు వెళ్లేందుకు దారిలేక పోయింది. మామిడి చెట్టుకున్న మామిడికాయలు, అరటి తోటలు చెల్లాచెదురుగా పడిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు

విరిగిపడ్డాయి. కొన్నిచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. పాలకోడేరు మండలంలో ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే దర్శనమిచ్చాయి. వాసవి పెనుగొండ మండలం సిద్దాంతం, ములపర్రు, దొంగరావిపాలెం, రామన్నపాలెం తదితర గ్రామాల్లో ప్లెక్సీలు, చెట్లు కూలడంతో జనం ఇబ్బందులు పడ్డారు. తాడేపల్లిగూడెం మండలంలో ఈదురు గాలులకు 25కు పైగా స్తంభాలు కూలిపోవడంతో రాత్రి మూడు గంటల గంటల వరకు ప్రజలు జాగారం చేశారు. జువ్వలపాలెం రోడ్డులో కారు అదుపు తప్పి

డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది.

వెంకట్రామన్నగూడెంలో మామిడికాయలు నేలవాలాయి. పెంటపాడు, అత్తిలి, తణుకు రూరల్‌, ఉండి, ఆకివీడు, ఆచంట మండలాల్లో అనేకచోట్ల విద్యుత్‌

స్తంభాలు పడిపోయాయి. అరటితోపాటు చిన్నపాటి చెట్లు, నేలనంటాయి. గణపవరం మండలంలో 25 విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయని జేఈ వెంకన్నబాబు, ఏఈ పరమేశ్వర్లు తెలిపారు. పలు గ్రామాల్లో విద్యుత్‌ 11 కేవీ వైర్లపై తాడి, కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. దశల వారీ విద్యుత్‌ సరఫరా పునరుద్ధరిస్తున్నారు.

ఆక్వాపై ప్రభావం

ఆకివీడు మండలం పెదకాపవరం, చినకాపవరం, గుమ్ములూరు, అప్పారావుపేట, తరటావ, కోళ్ళపర్రు, రాజులపేట, సిద్దాపురం గ్రామాలలోని ఆక్వాకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో రైతులు జనరేటర్లపై ఆధారపడ్డారు. చెరువుల విస్తీర్ణం ప్రకారం 24 గంటలకు 200 లీటర్ల వరకు డీజిల్‌కు అదనపు ఖర్చు అయ్యిందని లబోదిబోమంటున్నారు.

వర్షపాతం

అత్యధికంగా ఆకివీడులో 20.2 మి.మీ, తణుకు 13.2, పెనుమంట్ర 18.2, వీరవాసరం 17.2, కాళ్ల 16.4, పెనుగొండ 12.6, గణపవరం 9.8, ఉండి 8.8, పాలకోడేరు 5.8, ఇరగవరం 5.8, భీమవరం 5.4, అత్తిలి 4.6, తాడేపల్లిగూడెం 4.4, పెంటపాడు 3.8, పాలకొల్లు 2.0, మొగల్తూరు 1.2, యలమంచిలి 1.2, ఆచంట 0.4, పోడూరు 0.4 మిలిమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం మరలా వాతావరణం ఎప్పటిలాగానే ఎండ తీవ్రత మరింత పెరిగిపోయి వేడిగాలులు, వడగాడ్పులతో ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.

Updated Date - May 30 , 2026 | 12:52 AM