కుండపోత
ABN , Publish Date - Sep 25 , 2026 | 01:19 AM
బంగాళాఖాతంలో ఏర్ప డిన తీవ్ర వాయుగుండం తీరం దాటినా దాని ప్రభావం మరో 48 గంటల పాటు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తు న్నాయి.
తీరం దాటిన వాయుగుండం.. జిల్లాలో కుంభవృష్టి వర్షాలు
ఏజెన్సీలో పొంగుతున్న వాగులు
లోతట్టు ప్రాంతాలు జలమయం
ఇళ్లలోకి ప్రవేశించిన వరదనీరు
భారీగా వీచిన గాలులు.. నేల కొరిగిన చెట్లు .. విద్యుత్ సరఫరాకు అంతరాయాలు
విద్యుత్ శాఖ కంట్రోలు రూమ్స్ ..
విద్యుదాఘాతంతో గేదె మృతి
వరద ముందస్తు జాగ్రత్త చర్యలపై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్
(ఏలూరుసిటీ/బుట్టాయగూడెం/వేలేరుపాడు/జీలుగుమిల్లి/కొయ్యలగూడెం/జంగారెడ్డిగూడెం/పెదపాడు/ద్వారకాతిరుమల/నిడమర్రు/ఏలూరు క్రైం/మండవల్లి/నిడమర్రు/కలిదిండి/ ఏలూరు అర్బన్, ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్ప డిన తీవ్ర వాయుగుండం తీరం దాటినా దాని ప్రభావం మరో 48 గంటల పాటు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తు న్నాయి. జనజీవనం స్తంభించింది. రహదారులు పూర్తిగా జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాం తాలు జలమయం అయ్యాయి. ఏజెన్సీ ప్రాంతం లో వాగులు పొంగుతున్నాయి. బుట్టాయ గూడెం మండలం కోర్సవారిగూడెం పంచాయతీ పరిధిలోని వేపులపాడు సమీపంలోని ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. బుట్టాయగూడెం– జీలుగుమిల్లి మండలాలకు రాకపోకలు నిలిచి పోయాయి. గుబ్బల మంగమ్మతల్లి ఆలయానికి వెళ్లే మార్గాన్ని రెండోరోజూ మూసివేశారు. వేలేరుపాడు మండలంలో గురువారం సాయంత్రం రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి జగన్నాఽథపురం, శివకాశీపురం, వేలేరుపాడులో పల్లపుప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. కొయ్యలగూడెం మండ లంలోని కన్నాపురం తూర్పుకాలువ, పడమటి కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కన్నా పురం నుంచి పోలవరం, బుట్టాయిగూడెం మం డలాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జీలుగు మిల్లి మండలంలో కొండవాగులు పొంగుతు న్నాయి. అంకన్నగూడెం పంచాయతీ రామ చంద్రాపురం వద్ద రహదారి పైనుంచి ప్రవహిం చిన వరదనీటికి రోడ్డు కొట్టుకుపోయింది. రాచ న్నగూడెం వద్ద చిన్నవాగు, లంకాలపల్లి వాగు, జీలుగుమిల్లి సమీప అశ్వారావుపేటవాగు, వంక వారిగూడెం, దర్భగూడెం వద్ద వాగులు రహ దారి పైనుంచి ప్రవహించడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొయ్య లగూడెంలో అపోలో పాఠశాల వద్ద రోడ్లపై వర్షపునీరు చేరింది. పల్లపు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. జంగారెడ్డిగూడెంలో అశ్వా రావుపేట రోడ్డులోని అటవీశాఖ కార్యాలయం వద్ద ఉన్న చెట్టు విరిగి ప్రధాన రహదారిపై పడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కమిషనర్ కెవి.రమణ ఆదేశాలతో శానిటరీ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్ పారిశుధ్య సిబ్బందితో చెట్టు కొమ్మలను రహదారిపై నుంచి తొలగిం చారు. గురవాయిగూడెంలో విద్యుత్ స్తంభం ఎర్త్‌వైర్ తగిలి సత్యవాడ వీర్రాజుకు చెందిన గేదె విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. పెద పాడు మండలంలోని గోగుంట, కేఆర్‌పాలెం, రామ చంద్రపురం గ్రామాల్లోని కాలనీల్లోకి వర్షపునీరు వచ్చి చేరింది. పెదపాడు నుంచి వట్లూరు వెళ్లే మార్గంమధ్యలో వున్న రెండు కాజ్‌వేలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నీరు కాజ్‌వేల మీదకు చేరింది. గోగుంట లో నీటమునిగిన ప్రాంతాన్ని పెద పాడు క్లస్టర్ ఇన్‌చార్జి గుత్తా అనిల్ పరిశీలిం చి, స్థానికులతో మాట్లాడి సహాయక చర్యలు ప్రారంభించారు. లోతట్టు ప్రాంతాల్లో వున్నవారు అప్రమత్తంగా ఉండాలని తహసీ ల్దారు కృష్ణజ్యోతి సూచించారు. నిడమర్రు మండలంలో లోత ట్టు పొలాలలో వర్షపు నీరు చేరడంతో రైతులు ఇంజన్లు ద్వారా నీరును బయటకు తోడుతు న్నారు. చినకాపవరం పంటకాలువ గట్టు అంచు ల వరకు నీటి ప్రవాహం ఉండడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు. అడవి కొలను వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ బేతు వెంకట శివ రామారావు రైతులలో కలసి ఛానమిల్లి కొత్తకోడులో గుర్రపుడెక్క తొలగించారు.
జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలు వాగులను దాటకుండా ముందస్తు జాగ్రత్తగా బారికేడ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించా రు. జిల్లాలో వరద ముందస్తు జాగ్రత్త చర్య లపై అధికారులతో గురువారం టెలీకాన్ఫ రెన్స్ ద్వారా సమీక్షించారు. ఆమె మాట్లాడు తూ.. ‘వాగులు, తమ్మిలేరు, బుడమేరు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. తహసీల్దార్లు వరద పరిస్థితిని పరిశీలించి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవా’లని అధికారులను ఆదేశించారు.
పంటలకు నష్టం
భారీవర్షాలు కురవడంతో పంటలకు నష్టం వాటిల్లింది. కొయ్యలగూడెం మండలంలోని గవరవరం, పొంగుటూరు, ఎర్రంపేట, చొప్ప రామన్నగూడెం గ్రామాల్లో వరి, మినుము, మిరప పంటలు నీట మునిగాయి. వ్యవసాయ శాఖ అధికారి పోచారావు ఆ ప్రాంతాలను పరిశీ లించి రైతులకు పలు సూచనలిచ్చారు. ద్వారకా తిరుమల మండలంలోని పలుప్రాంతాల్లో 15 ఎకరాల్లో కూరగాయ తోటలు ధ్వంసం అయ్యా యి. తిరుమలంపాలెం, కోడిగూడెం రెవెన్యూ పరిధి, పోతేపల్లి, రాళ్లకుంట, దొరసానిపాడు గ్రామాల్లో దొండ, వంగ చిక్కుడు తదితర పంట లకు నష్టం కలిగింది. వర్షం ఇలా నే కొనసాగితే నష్టం మరింత తీవ్రంగా ఉంటుం దని మండల ఉద్యానశాఖ అధికారి పీబీఎస్ అమర్‌నాథ్ తెలి పారు. పెదపాడు మండలం కొత్తూరు సమీపంలో 50 ఎకరాలకు పైగా మిను ప పంట నీట మునిగింది.‘పది ఎకరాల్లో మినుప పంట వేయ గా ఇప్పటి వరకు ఎకరానికి రూ.15 వేలు ఖర్చు అయింది. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసి నీరు కిందకు వెళ్లకపోతే కుళ్లిపోయి పంట పాడవుతుం’దని కౌలురైతు చెడుగొండి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశాడు.
కూలిన చెట్లు.. విద్యుత్ స్తంభాలు
జిల్లాలోని చాలా ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సకాలంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తు న్నట్టు విద్యుత్ శాఖాధికారులు తెలిపారు. విద్యుత్ సమస్యలు తెలపడానికి ఏలూరు సర్కిల్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 94409 02926, ఏలూరు డివిజన్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబరు 94409 04037, జంగారెడ్డిగూడెం డివిజనల్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబరు 94910 30712లను ఏర్పాటు చేసినట్టు ఏపీఈపీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ కేఎం అంబేడ్కర్ తెలిపారు.
పోలీసు, అగ్నిమాపకశాఖలు అప్రమత్తం
భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పోలీస్, అగ్నిమాపక శాఖ శాఖలు అప్రమత్త చర్యలు చేపట్టారు. రహదారులపై ఏమైనా చెట్లు పడిపోయినా వెంటనే కట్టర్ల ద్వారా వాటిని తొలగించే చర్యలను చేపడుతున్నారు. వాగులు, వంకలు, చెరువులు, కాలువలు రోడ్లపై నుంచి పొంగే పరిస్థితులు ఉంటే అక్కడ పోలీస్ సిబ్బం దిని ఏర్పాటు చేశారు.
జిల్లాలో వర్షపాతం వివరాలు
గత 24 గంటల్లో జిల్లాలో కొయ్యల గూడెంలో 157.6 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కాగా జిల్లాలో సరాసరి వర్షపాతం 89.7 మి.మీ నమోదైంది. ముదినేపల్లి 137.8, పెదవేగి 135.2, పోలవరం 111.4, మండవల్లి 107.8, కైకలూరు 107.6, పెద పాడు 106.6, కలిదిండి 105.2, ముసు నూరు 94.4, కుక్కునూరు 92.8, జంగారెడ్డిగూడెం 92.6, ఉంగుటూరు 92.2, నిడమర్రు 85.2, నూజివీడు 84.4, బుట్టాయిగూడెం 82.6, వేలే రుపాడు 79.6, ఏలూరు రూరల్ 78.6, ద్వారకాతిరుమల 77.6, ఆగిరిపల్లి 77.2, కామవరపు కోట 74.8, భీమడోలు 74.4, దెందులూరు 72.4, జీలుగుమిల్లి 71.6, టి.నరసాపురం 68.2, చింతల పూడి 61.4, లింగపాలెం 60, చాట్రాయి 46.4 మి. మీ వర్షపాతం నమోదైంది. గురువారం జిల్లాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అత్యఽధికంగా పోలవరం మండలంలో 69 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
నేడు విద్యా సంస్థలకు సెలవు
వర్షాల దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించినట్టు డీఈవో వెంకటలక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 19 ఏళ్ల లోపు విద్యార్థులకు నిర్వహిం చాల్సిన నులి పురుగుల నివారణ(ఆల్బెండజోల్) మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసినట్టు వివరించారు.
అప్రమత్తంగా ఉండాలి : ఎంపీ
భారీ వర్షాలు కురు స్తున్న నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాం గం అప్రమత్తంగా ఉండాలని ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా అధికారులు జాగ్రత్త లు తీసుకోవాలన్నారు. ఏలూరు, జంగారెడ్డి గూడెంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశా మని, వాటితో అత్యవసర సమయాల్లో ఎంపీ కార్యాలయానికి ఫోన్ నంబర్ 9515225125, 9885519299ను సంప్రదించాలన్నారు.
ఆక్వా రైతుల్లో ఆందోళన
ఎడతెరిపి లేని వర్షాలకు చెరువుల్లో ఆక్సిజన్ స్థాయిలపై ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల చెరువుల్లో నీరు చల్లబడటంతో ఆక్సిజన్ లోపించి రొయ్యలు మృత్యువాత పడే ప్రమాదం ఉండటంతో రేయింబవళ్లు నిరంతరాయంగా ఏరియేటర్లు తిప్పుతున్నారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతుండటం తో ప్రత్యామ్నాయంగా అద్దె జనరేటర్లు ఏర్పాటు చేసుకుంటు న్నారు. డీజిల్‌కు అదనపు వ్యయాన్ని భరించాల్సి వస్తోందని వాపోతున్నారు. కౌంట్‌కు వస్తున్న రొయ్యల చెరువులల్లో పీహెచ్‌లు పడిపోవడంతో పీహెచ్ స్థాయి పెంచడం కోసం మందులు చల్లుతున్నారు. మరోపక్క ఆక్సిజన్ లెవెల్స్ పెంచేందుకు ఏరియేటర్లు తిప్పుతున్నారు. వాతా వరణ ప్రభావంతో రొయ్యలు మేతలు తినడం పూర్తిగా తగ్గిపోవడంతో రైతులు రొయ్య కండీషన్ కోసం రకరకాల మందులు పడవల్లో వేసుకుని చెరువుల్లో చల్లుతున్నారు. చేపల చెరువుల్లో డీవో ప్రాబ్లెమ్ రాకుండా మందులు చల్లుతూ మేతల వాడకం తగ్గించివేశారు.