Share News

కొనసాగుతున్న వర్షాలు

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:48 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లాలో ఆదివారం వర్షాలు కురిశాయి.

కొనసాగుతున్న వర్షాలు
ఏజెన్సీలోని గుబ్బల మంగమ్మ ఆలయ ప్రాంతంలో కురుస్తున్న వర్షం

ఖరీఫ్‌ పనులకు మేలు.. రైతుల్లో హర్షం

ఏలూరు సిటీ/ పెదవేగి/బుట్టాయగూడెం/పోలవరం/దెందులూరు, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లాలో ఆదివారం వర్షాలు కురిశాయి. ఉదయం కొంత ఎండవేడిమి ఉన్నా మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పులు సంభవించాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడు గులు, ఉరుములతో కూడిన వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. ఉష్టతాపంతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. 24 గంటల్లో ముదినేపల్లిలో 4.8 మిల్లీమీటర్లు, మండవల్లిలో 4.2, ఆగిరిపల్లిలో 3.8, కలిదిండిలో 2.4, నూజివీడులో 2.4, నిడమర్రులో 1.8, జీలుగుమిల్లిలో 1.6, బుట్టాయిగూడెంలో ఒక మి.మీ వర్షపాతం నమోదైంది. ఏజెన్సీలో వర్షం దంచికొట్టింది. గుబ్బల మంగమ్మతల్లి, పరిసర అటవీ ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. అమ్మవారి దర్శనాలకు వచ్చిన భక్తులు వంటలు చేసుకోవడానికి అష్టకష్టాలు పడ్టారు. పోలవరం, దెందులూరు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది.ఖరీఫ్‌కు సన్నాహాలు చేసుకుంటున్న రైతుల్లో ఈ వర్షం ఆశలు రేకెత్తించింది. దుక్కులు తడవడంతో దుక్కి దున్నకాలకు అనుకూలమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యాన పంటలకు మేలు చేస్తుందని పేర్కొంటున్నారు.

Updated Date - Jun 29 , 2026 | 12:48 AM