Share News

గేటు కష్టాలకు చెక్‌

ABN , Publish Date - Jan 09 , 2026 | 12:27 AM

రైల్వే గేట్‌ల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు త్వరలో చెక్‌ పడనుంది. జిల్లా వ్యాప్తంగా 46 గేట్లను శాశ్వతంగా మూసివేయనున్నారు.

గేటు కష్టాలకు చెక్‌

జిల్లాలో 46 రైల్వే గేట్లు గుర్తింపు

వాటి స్థానంలో ఆర్వోబీ, ఆర్‌యూబీల నిర్మాణం

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికార యంత్రాంగం

రైల్వే గేట్‌ల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు త్వరలో చెక్‌ పడనుంది. జిల్లా వ్యాప్తంగా 46 గేట్లను శాశ్వతంగా మూసివేయనున్నారు. వీటిస్థానంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు లేదా అండర్‌ గ్రౌండ్‌ రోడ్డు మార్గాన్ని (ఆర్‌యూబీ)లను నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన పనులు చేపట్టేందుకు జిల్లా అధికారులతో పాటు రైల్వే అధికారులు సన్నద్ధమవుతున్నారు.

నరసాపురం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైల్వే ట్రాక్‌ నిర్మించినప్పుడు నుంచి చాలాచోట్ల ప్రమాదాలు నివారించేందుకు రైల్వేగేట్లను ఏర్పాటు చేశారు. వీటిపై కొన్నిచోట్ల ఆర్వోబీలు కట్టారు. మరికొన్ని పెండింగ్‌ పడ్డాయి. ఈ కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. కొన్నిచోట్ల ప్రమాదాలు కూడా జరుగుతు న్నాయి. జిల్లాలో నరసాపురం నుంచి ఆకివీడు వరకు, ఇటు భీమవరం నుంచి నిడదవోలు వరకు విస్తరించిన రైల్వే ట్రాక్‌పై దాదాపు 50 గేట్లు ఉన్నాయి. వీటిలో తొలివిడతగా 46 చోట్ల ఆర్వోబీ, ఆర్‌యూబీలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి అర్‌అండ్‌బీ, రెవెన్యూ, గ్రామీణ నీటిసరఫరా, విద్యుత్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. వంతెన, అండర్‌ గ్రౌండ్‌ నిర్మాణం పనులు చేపట్టనున్నందున ప్రస్తుతం గేట్ల వద్దనున్న విద్యుత్‌ స్థంబాలను తొలగించాలన్నారు. వాటికింద ఉన్న పైప్‌లైన్లు తీసివేసేందుకు అయ్యే ఖర్చును అంచనా వేయాలన్నారు. భూసేకరణ చేపట్టాల్సి ఉంటే యుద్ధప్రతిపాదికన పూర్తిచేయాలని రెవెన్యూ, అర్‌ఆండ్‌బీ అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులు సర్వే మొదలు పెట్టారు. ఎక్కడ ఆర్వోబీ నిర్మించాలి, ఏ ప్రాంతం ఆర్‌యూబీకి అనువుగా ఉన్నందన్న దానిపై ఆధ్యయనం చేస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వేకు అందించనున్నారు.

కష్టాలు తప్పుతాయి

ప్రస్తుతం అన్నిచోట్ల ట్రాఫిక్‌ పెరిగింది. తరుచూ రైల్వే గేట్లు పడటం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడు తుంది. పాలకొల్లు నుంచి భీమవరం వరకు ఉన్న 20 కిలోమీటర్ల దూరం రెండు చోట్ల రైల్వేగేట్లు ఉన్నాయి. ఇటు ఉండి, భీమవరం టౌన్‌లోకూడా ఇదే పరిస్థితి. భీమవరం నిడదవోలు మధ్య కూడా చాలాచోట్ల గేట్లు ఉన్నాయి. ఇటీవల రైల్వే ట్రాఫిక్‌ కూడా పెరిగింది. దీనివల్ల తరచూ గేటు వేయాల్సి వస్తున్నది. గేటు పడితే 20 నిమషాల వరకు నిరీక్షించాల్సి వస్తుంది. గేటు వేసే సమయంలో కొంత మంది దాటే ప్రయత్నం చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆర్వోబీ, ఆర్‌యూబీలు ఏర్పాటు చేస్తే ఈ సమస్యలకు చెక్‌ పడుతుంది. వీటితో పాటు రైళ్ల వేగం పెరగనుంది. గేట్ల వద్ద రైల్వే అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. దీని వల్ల రైల్వేకు ఆదాయం కలగనుంది.

Updated Date - Jan 09 , 2026 | 12:27 AM