ర్యాగింగ్ తీవ్రమైన నేరం
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:33 AM
కళాశాలల్లో ర్యాగింగ్ తీవ్రమైన నేరమని విద్యార్థుల భవిష్యత్తు, ఆత్మగౌరవం, మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే ఇటు వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ స్పష్టం చేశారు.
ఏలూరు క్రైం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : కళాశాలల్లో ర్యాగింగ్ తీవ్రమైన నేరమని విద్యార్థుల భవిష్యత్తు, ఆత్మగౌరవం, మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే ఇటు వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు ఆశ్రం మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్, మహిళా భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ జూనియర్ విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండాలని, ఎంబీబీఎస్ అంటే చాలా ఒత్తిడి ఉంటుందని ప్రతి సంవత్సరం అనేక సబ్జెక్టులు చదవాల్సి ఉంటుందని ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా విద్యను అభ్యసించాలన్నారు. జూనియర్లతో స్నేహపూర్వకంగా మెలగాలని ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, క్రమ శిక్షణ బాధ్యతాయుత ప్రవర్తనను అలవర్చుకోవాలని సూచించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా ర్యాగింగ్‌కు గురైతే భయపడకుండా కళాశాల యాజమాన్యానికి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. యువత మత్తు పదార్ధాలకు ఆకర్షణలకు కాకుండా వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా ఎస్పీ కెపిఎస్ కిషోర్ మాట్లాడుతూ జూనియర్లకు అండగా నిలబడి వారిలో ధైర్యాన్ని నింపి సరైన మార్గంలో నడిపించేవారే నిజమైన సీనియర్లని అన్నారు. చాలా మంది ర్యాగింగ్ చేస్తే గౌరవం వస్తుందని భయం వల్ల వచ్చేది గౌరవం కాదని ఒక వ్యక్తి మంచి మనస్సును ప్రతిభను వ్యక్తిత్వాన్ని చూసి ఇతరులు మనస్ఫూర్తిగా ఇచ్చేదే నిజమైన గౌరవం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, రిటైర్డ్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం సుబ్బారావు, వన్‌టౌన్ సీఐ రామకృష్ణ, రూరల్ ఎస్‌ఐ నాగబాబు పలువురు పాల్గొన్నారు.