Share News

ఇదేం పునరావాసం!

ABN , Publish Date - Jun 14 , 2026 | 11:44 PM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఊళ్లు, ఇళ్లు, భూములను త్యాగం చేసిన నిర్వాసితులు నేడు కనీస వసతుల కోసం ఎదురు చూస్తున్నారు.

ఇదేం పునరావాసం!
జంగారెడ్డిగూడెం మండలం చల్లావారిగూడెం పునరావాస కాలనీ

చల్లావారిగూడెం నిర్వాసిత కాలనీలో సమస్యల తిష్ఠ

విద్య, వైద్య సౌకర్యం లేదు

హైస్కూల్‌ 7 కిలోమీటర్ల దూరం

తాగునీరు, వీధిలైట్లు నామమాత్రం

అందని ప్రభుత్వ పథకాలు

పోలవరం ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములు ఇచ్చిన తమను ప్రభుత్వం త్యాగమూర్తులుుగా అభివర్ణించింది.. పునరావాసం కల్పించింది.. కానీ తమ జీవన పరిస్థితులు మాత్రం విరుద్ధంగా ఉన్నాయని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ కోసం అన్నీ కోల్పోయాం.. ఇప్పుడు చిన్నచిన్న కనీస సౌకర్యాల కోసం కూడా పోరాడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దారిలేదు.. డ్రెయినేజీ లేదు.. విద్య, వైద్యం అందదు.. పునరావాసం తమకు వనవాసంగా మారిందని వాపోతున్నారు. చల్లావారిగూడెం పునరావాస కాలనీలో కనీస జీవన సౌకర్యాలు కల్పించడమే తమ త్యాగాలకు నిజమైన కృతజ్ఞత అని నిర్వాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

జంగారెడ్డిగూడెం రూరల్‌, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఊళ్లు, ఇళ్లు, భూములను త్యాగం చేసిన నిర్వాసితులు నేడు కనీస వసతుల కోసం ఎదురు చూస్తున్నారు. పునరావాస కాలనీలో తాగునీరు లేక, పిల్లలకు పాఠశాల అందుబాటులో లేక, గర్భవతులు, అంగన్‌వాడీ అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. కనీసం వీధి దీపాలు లేవు, వైద్య సౌకర్యం లేదని వాపోతున్నారు. నిర్వాసితుల కాలనీకి ఎవరో అధికారి వస్తారు, ఇక్కడ నిర్మించే రోడ్లు, ఇళ్లను, మ్యాప్‌ల ద్వారా చూసి వెళ్లిపోవడం తప్ప ఇప్పటికే ఇక్కడ స్థానికుల సమస్యలపై ఆరా తీసే వారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

8 గ్రామాలు.. 150 కుటుంబాలు

పోలవరం మండలంలోని కొరుటూరు, శివ గిరి, చీడూరు, టేకూరు, తూటికుంట, కోండ్రు కోట, వాడపల్లి, శిరివాక మొత్తం ఎనిమిది గ్రామాలకు చెందిన 150 నిర్వాసిత కుటుంబాలు 2022లో చల్లావారిగూడెంలో ఇళ్లను నిర్మించారు. ఇప్పటికి 70పైగా కుటుంబాలు సొంత గ్రామాల ను వదిలి చల్లవారిగూడెం పునరవాస కాలనీకి వచ్చారు. ఇప్పటి వరకు సౌకర్యాల కోసం వారు పోరాటం చేస్తున్నా ఫలితం లేదు. ప్రభుత్వం ఇళ్లను నిర్మించి అప్పగించినా కనీస అనేక సదు పాయాలు లేవని నిర్వాసితులు వాపోతున్నారు.

అడ్రస్‌ లేని అంగన్‌వాడీ..

చల్లవారిగూడెం పునరవాస కాలనీలో అంగన్‌ వాడీ కేంద్రం లేదు. చిన్నారులకు పౌష్టికాహారం, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందించే పోషకాహార సరుకులు అందడం లేదని మహి ళలు చెబుతున్నారు. ప్రతి నెల ప్రభుత్వం పంపిణీ చేసే గుడ్లు, పాలు, పోషకాహార పదార్థా లు, ఇతర సంక్షేమ పథకాలకు దూరమవు తున్నారు. ఇదే కాలనీలో 3 కిలోమీటర్ల దూరం లో వేలేరుపాడు మండలం నాళ్ళవరం అంగన్‌ వాడీ సెంటర్‌ ఏర్పాటుచేసినా పోలవరం నిర్వాసి తులకు సరుకులు ఇవ్వడం లేదని చెబుతున్నా రు. కొంత కాలం చల్లావారిగూడెం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో సరుకులు తెచ్చుకునే వారు. ఇప్పుడు వారు కూడా సరుకులు ఇవ్వకపోవడంతో గత కొంత కాలంగా ఎవ్వరూ అంగన్‌వాడీ సరుకులు తీసుకోవడం లేదు.

ఉన్నత పాఠశాల సుదూరం..!

పునరావాస కాలనీలో పాఠశాల లేకపోవడం తో విద్యార్థులు సుమారు 7 కిలోమీటర్ల దూరం లోని తాడువాయి జడ్పీ హైస్కూల్‌కు వెళుతు న్నారు. ఈ ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలో పోలవరం మండలం 150 కుటుంబాలతో పాటు వేలేరు పాడు, కుక్కునూరు మండలాలకు చెందిన మొత్తం దాదాపు 600 కుటుంబాలు ఇక్కడే నివాసం ఉండేలా పునరావాసం కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ హైస్కూల్‌ ఏర్పాటు చేయకపోవడంపై ఇక్కడకు వచ్చి నివాసం ఉంటున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాగునీరు లేదు.. వైద్యం అందదు!

కాలనీలో తాగునీటి సరఫరా, వీధిలైట్ల్లు, రవాణా సదుపాయాలు, వైద్య సేవలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని నిర్వాసితు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవలకు సమీప పట్టణాలకు వెళ్లాల్సి వస్తోందని, వృద్ధులు, మహిళలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చల్లావారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో పోలవరం మండల నిర్వాసితులకు పీహెచ్‌సీ ఏర్పాటుచేసి ఇప్పుడు మూసి వేశారని చెబుతున్నారు. నెలలో ఒక బుధవారం ఆశ కార్యకర్త వస్తారని, మిగిలిన రోజుల్లో ఏడు కిలోమీటర్ల దూరంలోని తాడువా యి పీహెచ్‌సీకి వెళుతున్నామని మహిళలు చె బుతున్నారు. వీధిలైట్‌లు ఎప్పుడు వెలుగుతాయోఎప్పుడు ఆరిపోతాయో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాలనీలో ఉన్న వాటర్‌ ప్లాంట్‌ వద్ద గత కొంత కాలం నుండి ఇప్పటివరకు దాదాపు 15 విష సర్పాలను చంపామని, అక్కడే పిల్లలు, మహిళలు తిరుగు తుంటామని కానీ వీధి లైట్‌లు మాత్రం సరిగ్గా వెలగడం లేదని వాపోతున్నారు. చల్లావారిగూ డెం పునరావాస కాలనీకి రవాణ సౌకర్యం లేదు. ఉదయం సాయంత్రం ఆర్టీసీ బస్సు తిరుగుతు న్నా మిగిలిన సమయంలో ఆటో, బైక్‌లే దిక్కు.

ఎన్నో సమస్యలు

చల్లావారిగూడెం పునరావాస కాలనీలో పలు సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా వీధి లైట్‌లు లేక విష సర్పాల మధ్య జీవిస్తున్నాం. వీధి లైట్‌ల సరిగ్గా వెలగడం లేదు. కాలనీలో హైస్కూల్‌ లేకపోవడంతో చదువుకునే పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

పడాల ఉమ, నిర్వాసితురాలు

అంగన్‌వాడీ కేంద్రం లేదు

అంగన్‌వాడీ కేంద్రం లేకపోవడం వలన సరుకులు తీసుకునేందుకు చల్లావారిగూడెం వెళ్లే వాళ్లం. ఇప్పుడు వాళ్లు కూడా సరుకులు ఇవ్వమని చెప్పడంతో ఏడాదిగా అంగన్‌వాడీకి వెళ్లడం లేదు. మా కాలనీలో కూడా అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.

మర్రి పండు, నిర్వాసితురాలు, టేకూరు

తాగునీటి సౌకర్యం లేదు

మా కాలనీలో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో కొంత కాలంగా ఒక ప్లాస్టిక్‌ ట్యాంక్‌ తెచ్చారు. మోటార్‌ ద్వారా దాన్ని నింపుతారు. అక్కడి నుంచి తాగునీరు ఇళ్లకు మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఇంటికి కుళాయి అన్నారు. ఏమీ ఇక్కడ జరగడం లేదు.

చిట్రా రత్నారావు, నిర్వాసితుడు, టేకూరు

Updated Date - Jun 14 , 2026 | 11:44 PM