Share News

కదిలేదే లే..!

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:01 AM

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఏలూరు సర్కిల్‌ కార్యాలయంలో బదిలీల వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఏళ్ల తరబడి తమ స్థానాల్లో పాతుకుపోయి హల్‌చల్‌ చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా విధులకు రావడం, తోటి ఉద్యోగులపై పెత్తనాలు, కుమ్మక్కు వ్యవహా రాలతో శాఖను అప్రదిష్ట పాలు చేస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

  కదిలేదే లే..!

ఆర్‌అండ్‌బీలో పాతుకుపోయిన ఉద్యోగులు

బదిలీ ఉత్తర్వులు వచ్చినా పాత స్థానాల్లోనే ..

వర్క్‌ అరేంజ్‌మెంట్‌ పేరుతో ఏళ్ల తరబడి తిష్ఠ

ఏలూరు డీఈఈ, ఈఈ, ఎస్‌ఈ

కార్యాలయాల్లో గుత్తాధిపత్యం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఏలూరు సర్కిల్‌ కార్యాలయంలో బదిలీల వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఏళ్ల తరబడి తమ స్థానాల్లో పాతుకుపోయి హల్‌చల్‌ చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా విధులకు రావడం, తోటి ఉద్యోగులపై పెత్తనాలు, కుమ్మక్కు వ్యవహా రాలతో శాఖను అప్రదిష్ట పాలు చేస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. గతేడాది జరిగిన సాధారణ బదిలీల్లో ఉత్తర్వులు అందుకున్న సుమారు 20 ఉద్యోగులు, ఇప్పటికీ తమ పాత స్థానాల్లోనే తిష్టవేసి ఏకచత్రాధిపత్యం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్క్‌ అరేంజ్‌మెంట్‌ ముసుగులో వారు తమ పాత సీట్లలోనే కొనసాగుతూ, ప్రభుత్వ శాఖలో పాలనాపరమైన లోపాలకు కారణమవుతున్నారు.

గత ఏడాది ఒక ఉన్నతాధికారి పదవీ విరమణ సమయంలో, శాఖాపరమైన బదిలీల్లో పారదర్శకత లోపించిందనే విమర్శలు వచ్చాయి. ఏలూరు ఆర్‌అండ్‌బీ సర్కిల్‌ పరిధిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, కొవ్వూరు, నరసాపురం డివిజన్లు ఉన్నాయి. అయినప్పటికి బదిలీ అయిన వారిలో 90 శాతం మంది విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ వంటి పొరుగు జిల్లాల పేర్లతో బదిలీ ఉత్తర్వులు పొంది, తిరిగి వర్క్‌ అరేంజ్‌మెంట్‌ కింద తమ పాత స్థానాల్లోనే పనిచేస్తున్నారు. బదిలీ అయినా పాత స్థానాల్లోనే కొనసాగుతున్న 20 మందిలో జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు ఉన్నారు. ముఖ్యంగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారే ఇందులో ఎక్కువగా ఉండటం గమనార్హం. ఉదాహరణకు, ఏలూరు ఎస్‌ఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ విజయవాడకు బదిలీ అయినా, అతను ఏలూరులోనే కొనసాగుతున్నారు. విజయవాడ ఎన్‌హెచ్‌ డివిజన్‌లో పనిచేయాల్సిన మరో సీనియర్‌ అసిస్టెంట్‌, ఏలూరు డీఈ కార్యాలయంలో పనిచేస్తున్నారు. బిల్లుల ఆడిట్‌ బాధ్యతలు చూస్తున్న సదరు ఉద్యోగిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. రూ.10 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు బిల్లులు మంజూరు కావా లంటే, సదరు ఉద్యోగి సంతకం తప్పనిసరి. ఈ క్రమంలో ఆయన భారీగా ముడుపులు వసూలు చేస్తున్నారన్న విమ ర్శలు శాఖలో గుప్పుమంటున్నాయి. ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన నిర్మాణ సామగ్రిని మళ్లించి సొంత ఇల్లు నిర్మించు కున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, ఎస్‌ఈ కార్యాల యంలో ఒక అటెండర్‌ 25 ఏళ్లుగా ఒకేచోట పని చేస్తుం డటం వెనుక పెద్ద లాబీయింగ్‌ ఉందనే చర్చ నడుస్తోంది.

తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి

డీఈఈ, ఈఈ కార్యాలయాల్లో వర్క్‌ అరేంజ్‌మెంట్‌ పేరుతో ఇంతమంది ఉద్యోగులు పాత స్థానాల్లోనే కొనసాగుతున్నా, ఉన్నతాధికారులు నిస్సహాయంగా ఉండిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బదిలీల తంతు జరిగి పదిహేను నెలలు దాటినా కిందిస్థాయి ఉద్యోగుల గుత్తాధిపత్యాన్ని అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీనిపై ఏలూరు ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కె.విజయరత్నంను వివరణ కోరగా.. బదిలీల ఉత్తర్వులు వచ్చినా, పాత స్థానాల్లోనే వారు కొనసాగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే కార్యాలయ పనుల్లో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే పాత స్థానాల్లో వారిని కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Oct 07 , 2026 | 12:02 AM