క్యూఆర్ కోడ్ టోకరా
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:33 AM
జనం నుంచి సొమ్ములు కాజేయడానికి మోసగాళ్లు కొత్త అవతారమెత్తుతున్నారు. వసూళ్ల కోసం క్యూఆర్ కోడ్ పంపుతున్నారు. దానికి సొమ్ములు పంపాలని జనం చెవిలో పూలు పెడుతున్నారు.
దండుకుంటున్న మోసగాళ్లు
తాడేపల్లిగూడెంలో క మిషనర్ పేరుతోనే దందా
సొమ్ములు చెల్లించవద్దంటూ వివరణ ఇచ్చిన అధికారి
కోజా పచ్చడి కావాలా..రూ.300 చెల్లించండి
సొమ్ములు చెల్లిస్తే తయారీ అంటూ మరో మోసం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జనం నుంచి సొమ్ములు కాజేయడానికి మోసగాళ్లు కొత్త అవతారమెత్తుతున్నారు. వసూళ్ల కోసం క్యూఆర్ కోడ్ పంపుతున్నారు. దానికి సొమ్ములు పంపాలని జనం చెవిలో పూలు పెడుతున్నారు. మోసగాళ్ల మాటవిని సొమ్ములు పోగొట్టుకుంటున్నారు. జిల్లాలో ఇలాంటి నయాదందా మొదలైంది. తాడేపల్లిగూడెంలో ఇటీవల దీనిపై జనాల్లో పెద్ద చర్చే నడిచింది. మున్సిపల్ కమిషనర్ పేరుతోనే మోసగాళ్లు వసూళ్ల దందాకు పాల్పడ్డారు. వ్యాపారులను లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్రేడ్ లైసెన్స్ లేనివారి ఫోన్ నెంబర్లు సంపాదించా..వారికి ఫోన్‌లు చేశారు. వ్యాపారం పెట్టి పదేళ్లయింది.. లైసెన్స్ తీసుకోరా అంటూ కమిషనర్ పేరుతో వ్యాపారులను బెదిరించారు. లైసెన్స్ కోసం ఏటా రూ.800 చెల్లించాలి. పదేళ్లకు రూ. 8 వేలు అవుతుంది. చెల్లించకపోతే షాప్ సీజ్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. కొంతమంది మూడు నుంచి నాలుగు వేల రూపాయల వరకు చెల్లించారు. వ్యాపారుల ఫోన్‌లకు క్యూఆర్ కోడ్ పంపారు. దానికి స్కాన్ సొమ్ము చేసి సొమ్ములు చెల్లించుకున్నారు. ఆ నోటా ఈ నోటా ఇది పెద్ద చర్చకు దారితీసింది. దాంతో మున్సిపల్ కమిషనర్ వివరణ ఇచ్చారు. తమ పేరుతో సొమ్ములు వసూలు చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చినట్టు తెలిపారు. ఎవరూ సొమ్ములు చెల్లించకూడదంటూ కమిషనర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఇది ఎవరి పని ?
ఇదొక్కటే కాదు. వివిధ రూపాల్లో సొమ్ముల వసూళ్లు చేసే దందా సాగుతోంది. కోడి పందాల్లో కోజా వచ్చింది. పచ్చడి పడుతున్నాం. కావాలంటే క్యూర్ కోడ్‌లో కిలోకు రూ. 300 చెల్లించండి అంటూ తెలిసిన వాళ్ల మాదిరిగానే ఫోన్‌లు చేస్తున్నారు. ఇలా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ వ్యాపారి నుంచి రూ. 1500 లాగేశారు. కోడిపందాలు అడపా దడపా జరుగుతుండడంతో ఇది నిజమని అంతా విశ్వసించారు. సొమ్ములు చెల్లించడం ప్రారంభించారు. ఇలాంటి నయా దందా ఇప్పుడు నడుస్తోంది. కమిషనర్ పేరుతో ఎవరు సొమ్ములు వసూలు చేశారనేది ఇప్పటికీ బయట పడలేదు. వ్యాపారులకే ఫోన్‌లు వెళ్లాయంటే పట్టణంలో ఉన్న వ్యక్తి సహకారం ఉండే ఉంటుందని అనుమానిస్తున్నారు. లేదంటే వ్యాపారుల ఫోన్ నంబర్‌లు ఎలా తెలుస్తాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే వ్యాపారులు ముద్రించే ఫోన్ నెంబర్ డైరీ ఆధారంగానైనా మోసాలకు పాల్పడి ఉండాలి. తాళ్ల ముదునూరుపాడు, బ్రహ్మా నంద మార్కెట్ పరిధిలోనే వ్యాపారులు ఎక్కువగా మోసపోయారు. ఈ మోసాలకు పాల్పడే వ్యక్తులు ఎవరనేది ఇప్పటికీ బయట పడలేదు. బాదితులు కూడా నోరు మెదపడం లేదు. ట్రేడింగ్ లైసెన్స్ లేదన్న విషయం బహిర్గతమైపోతుందని ఎవరూ పెదవి విప్పడం లేదు. సొమ్ములు పోగొట్టుకోవడం మాటలా ఉంచితే లైసెన్స్ లేకుండా వ్యాపారాలు ఎలా నిర్వహిస్తున్నారంటూ ఇప్పుడు చర్చ మొదలైంది. మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే నానా రకాల ప్రయోగాలు చేశారు. షాపు ముందు పేరుతో బోర్డు పెట్టుకుంటే ప్రచార పన్ను వేశారు. అటువంటిది ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహించే వారి జోలికి ఎందుకు పోలేదనే విషయం ఇప్పుడు తాడేపల్లిగూడెంలో హాట్‌టాపిక్‌గా మారింది.