Share News

గోదారి గట్టుకు కొత్తరూపు

ABN , Publish Date - Aug 02 , 2026 | 11:54 PM

గోదావరి పుష్కరాలకు జిల్లాలో ఏటిగట్టు రూపురేఖలు మారనున్నాయి. విజ్జేశ్వరం నుంచి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వరకు సుమారు 90 కిలోమీటర్ల మేర ప్రస్తుతం ఉన్న ఏటిగట్టును బీటీ రహదారిగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ పరిశీలనకు పంపారు.

గోదారి గట్టుకు కొత్తరూపు
యలమంచిలిలో గోదావరి ఏటిగట్టు

విజ్జేశ్వరం నుంచి బియ్యపుతిప్ప

వరకు బీటీ రోడ్‌గా ఏటిగట్టు

34 పుష్కర ఘాట్‌ల ఆధునీకరణ

జిల్లాలో అతి పెద్ద స్నానాల రేవులుగా

వలంధర్‌, సిద్ధాంతం

రూ.194 కోట్లతో పుష్కర పనులకు

ప్రభుత్వానికి ప్రతిపాదనలు

నరసాపురం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలకు జిల్లాలో ఏటిగట్టు రూపురేఖలు మారనున్నాయి. విజ్జేశ్వరం నుంచి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వరకు సుమారు 90 కిలోమీటర్ల మేర ప్రస్తుతం ఉన్న ఏటిగట్టును బీటీ రహదారిగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ పరిశీలనకు పంపారు. ఈ పనులకు రూ.164 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇవి కాకుండా సిద్ధాంతం నుంచి బియ్యపుతిప్ప వరకు ఉన్న 30 స్నానాల రేవుల్ని ఆధునీకరించనున్నారు. ఇందుకు రూ.30 కోట్లతో అంచనాలు రూపొందించారు. వీటిలో సిద్ధాంతం , నరసాపురంలోని వలంధర్‌ రేవును అతి పెద్ద రేవులుగా మార్చనున్నారు. వీటితో పాటు మరో 18 రేవులను ఐదు మీటర్ల నుంచి పదిమీటర్ల వరకు విస్తరించేందుకు ప్రతిపాదనలు రెడీ చేశారు. ఈ పనులకు మొత్తం 30 కోట్లు అవుతుందని అంచనా వేశారు. వీటికి ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉంది.

అతి పెద్ద రేవులుగా వలంధర్‌, సిద్ధాంతం

జిల్లాలో ప్రస్తుతం 30 స్నానాల రేవులున్నాయి. వీటిలో వలంధర్‌ రేవు ఒక్కటి ప్రస్తుతం అతి పెద్ద రేవు. 40 మీటర్లు విస్తరించింది. గత పుష్కరాలకు ఈ రేవులో 40 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. ఈసారి రెట్టింపు సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఈ రేవును 100 మీటర్ల వరకు విస్తరించేందుకు ప్రతి పాదనలు రెడీ చేశారు. ప్రస్తుతం ఉన్న పిండాలరేవు నుంచి బాపు ఘాట్‌ వరకు విస్తరణకు నోచుకోనుంది. సిద్ధాంతంలో మూడు రేవులు ఉన్నాయి. వీటిని కలిపి 90 మీటర్ల ఒకే రేవుగా మార్చనున్నారు. ఇవి కాకుండా అమరేశ్వర, లలితాంబ, కొండాలమ్మ, రాజుల్లంక, యల మంచిలి మండలం లక్ష్మిపాలెం, దొడ్డిపట్ల, కరుగోరుమిల్లి, వైవీ లంక, కంచుస్థంబపాలెం రేవుల్ని కూడా విస్తరించ నున్నారు. ప్రస్తుతం ఇవి 5 నుంచి 8 మీటర్ల వరకు విస్తరణలో ఉన్నాయి. వీటిని 10 నుంచి 15 మీటర్ల వరకు పెంచనున్నారు.

90 కిలోమీటర్ల ఏటిగట్టు అభివృద్ధి

గోదావరి వరదల్ని పరగణలోకి తీసుకుని 2007లో ఏటిగట్టును అభివృద్ధి చేశారు. 16 మీటర్ల గట్టును ఎత్తు చేశారు. అయితే అప్పట్లో గట్టుపై రోడ్డును ఏర్పాటు చేయలేదు. బియ్యపుతిప్ప నుంచి విజ్జేశ్వరం వరకు 90 కిలోమీటర్ల మేర విస్తరించిన ఏటిగట్టును ఈ పుష్కరా లకు బీటీ రహదారిగా మార్చేందుకు ప్రతిపాదన చేశారు.

వలంధర్‌ రేవు రూపురేఖలు మారుస్తాం

బొమ్మిడి నాయకర్‌, ఎమ్మెల్యే

ఉభయ గోదావరి జిల్లాలో వలంధర్‌ రేవుకు ఆధ్యాత్మికంగా ఎంతో పేరుంది. గత పుష్కరాలకు ఈ రేవులో సుమారు 40 లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అంచనా. ఈసారి మరింత పెరిగే అవ కాశం ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రేవును 80 నుంచి 100 మీటర్లకు పెంచాలని ప్రతిపాదన చేశాం.

అనుమతి రాగానే పనులు

పవన్‌, ఏఈఈ ఏటిగట్టు శాఖ

జిల్లాలో 30 ఘాట్‌లను అభివృద్ధి చేయనున్నాం. దీంతో పాటు విజ్ఞేశ్వరం నుంచి బియ్యపుతిప్ప వరకు గట్టును బీటీ రోడ్‌గా మార్చనున్నాం. మొత్తం రూ.194 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. సిద్ధాంతంలో ఉన్న మూడు రేవుల్ని ఒకటిగా చేసి అతి పెద్ద స్నానాల రేవుల్ని నిర్మిస్తున్నాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పనులకు టెండర్లు పిలుస్తాం.

Updated Date - Aug 02 , 2026 | 11:54 PM