Share News

ఇప్పుడెలా ?

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:30 AM

గోదావరి పుష్కరాల పనులకు పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ శాఖలు చేపట్టనున్న పనులకు రూ.2,850 కోట్ల వ్యయం ఖర్చు కానుందని అధికారులు అంచనాలు వేశారు.

ఇప్పుడెలా ?

గోదావరి పుష్కర పనులకు రూ.2,850 కోట్లతో అంచనాలు

విలువ, పనులు తగ్గించాలంటూ జిల్లా అధికారుల సూచన

క్షేత్రస్థాయిలో మీమాంస.. సమ్మతించని ప్రజాప్రతినిధులు

ఎటూ తేల్చుకోలేకపోతున్న అధికార యంత్రాంగం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

గోదావరి పుష్కరాల పనులకు పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ శాఖలు చేపట్టనున్న పనులకు రూ.2,850 కోట్ల వ్యయం ఖర్చు కానుందని అధికారులు అంచనాలు వేశారు. వీటిలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, జలవనరులు, పురపాలక, విద్యుత్‌, పర్యాటకం, గ్రామీణ నీటిపారుదల, విద్య తదితర శాఖలు వున్నాయి. వీటిలో దాదాపు రూ.2,600 కోట్ల విలువైన ప్రతిపాదనలు మూడు శాఖలైన జలవనరులు, పరపాలక, పంచాయతీరాజ్‌ల నుంచే వున్నాయి. జిల్లా నుంచి అధిక మొత్తంలో ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం నిధులు కేటాయించడం కష్టతరమవుతుందని జిల్లా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇదే అంచనా విలువ, పనులు తగ్గించాలంటూ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఇదే విధమైన సంకేతాలు ప్రభుత్వం నుంచి వచ్చాయి. కాని, సంబంధిత శాఖల అధికారులు విలువ తగ్గించడానికి తటపటాయిస్తున్నారు. స్థానిక మంత్రులు, ప్రజా ప్రతినిధులను ఒప్పించిన తర్వాతే తగ్గిస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో పంపాలంటూ జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి ఈ నెల తొలివారంలో దిశా నిర్దేశం చేశారు. ఇప్పటి వరకు ఏ ఒక్క శాఖ నుంచి రివైజ్డ్‌ ప్రతిపాదనలు చేరుకోలేదు. ప్రతిపాదనలు, అంచనా విలువ తగ్గించడానికి అధికారులు స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు వెళ్లినప్పటికి.. తగ్గింపునకు ప్రజా ప్రతినిధులు ఆసక్తి చూపడం లేదు. ఒక నియోజకవర్గంలో అంచనాలు తగ్గిస్తే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో సుముఖత వ్యక్తం చేయడం లేదు. మరోవైపు పుష్కరాల ముహూర్తం తరుముకొస్తోంది. ఆ లోగా అన్ని పనులు పూర్తి చేయాలి. లేదంటే నాణ్యత లోపిస్తుంది. హడావిడి పనులతో ప్రయోజనం ఉండదు. అందుకోసమే ముందస్తుగా ప్రతిపాదనలను ప్రభుత్వానికి చేరవేసేలా జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నా.. ఆ దిశగా వేగం పుంజుకోవడం లేదు.

Updated Date - Mar 21 , 2026 | 12:32 AM