పుష్కర రోడ్లకు భారీ కోత
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:34 AM
నరసాపురం పురపాలక సంఘం పరిధిలో చేపట్టనున్న గోదావరి పుష్కర పనుల టెండర్లలో కాంట్రాక్టర్లు పోటాపోటీగా కోట్ చేసిన రేట్లు విస్మయం కలిగిస్తున్నాయి.
అంచనా వ్యయం కంటే 23 శాతం తక్కువకు కోట్ చేసిన కాంట్రాక్టర్లు..
ఆకాశాన్నంటుతున్న తారు, సిమెంట్ ధరలు.. నాణ్యతపై అనుమానాలు!
8 పనులను దక్కించుకున్న ఇద్దరు కాంట్రాక్టర్లు.. తొలి విడత రూ.15 కోట్లు
నరసాపురం పురపాలక సంఘం పరిధిలో చేపట్టనున్న గోదావరి పుష్కర పనుల టెండర్లలో కాంట్రాక్టర్లు పోటాపోటీగా కోట్ చేసిన రేట్లు విస్మయం కలిగిస్తున్నాయి. పనులను ఎలాగైనా దక్కించుకోవాలన్న తాపత్రయంతో అంచనా వ్యయంకంటే ఏకంగా ఇరవై మూడు శాతం తక్కువకు టెండర్లు దాఖలు చేయడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి రూ.పదిహేను కోట్లు తొలి విడతగా మంజూరు కాగా, తక్కువ మొత్తానికి పనులు దక్కించుకుంటున్న తీరు నాణ్యతపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తోంది.
నరసాపురం, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘం మొత్తం 201 పనుల కోసం రూ.199 కోట్లతో సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ప్రభుత్వం మొదటి విడత కింద రూ.15 కోట్లు కేటాయించింది. పుష్కర ఘాట్లకు వెళ్లే రహదారులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. దీనికి అనుగుణంగా అధికా రులు రూ.40 లక్షలలోపు పనులు 12, ఆపై విలువైన పనులు 15 కలిపి మొత్తం 27 పనులకు టెండర్లు ఆహ్వానించారు. రూ.40 లక్షలలోపు పనులను ఆమోదిం చే అధికారం మునిసిపల్ పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు ఉంది. ఆయన అనుమతితో ఇప్పటి వరకు నాలుగు బీటీ, నాలుగు సీసీ రోడ్లు వెరసి ఎనిమిది పనులకు సంబంధించిన టెండర్లను తెరిచారు. వీటిని ఇద్దరు కాంట్రాక్టర్లు అంచనా వ్యయంకంటే 23 శాతం తక్కువకు కోట్ చేసి దక్కించుకున్నారు. మిగిలిన నాలుగు పనుల టెండర్లలోనూ ఇదే తరహాలో భారీగా తగ్గింపు రేట్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికా రులు భావిస్తున్నారు.
పెరిగిన ధరలు.. నాణ్యతపై అనుమానాలు
అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావంతో తారు ధరలు భారీగా పెరిగాయి. ఇతర మెటీరియల్ సిమెంట్, కంకర రేట్లు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. వీటికితోడు 18 శాతం జీఎస్టీ, సీనరేజ్, ఇతర ఖర్చులు మరో ఏడు శాతం కలిపి మొత్తం 25 శాతం వరకు పన్నుల రూపంలోనే పోతాయి. కాంట్రాక్టరు ఇప్పటికే ఇరవై మూడు శాతం తక్కువకు కోట్ చేయడంతో, కేవ లం 50 శాతం నిధులతోనే పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. గత పుష్కరాల అనుభవాల దృష్ట్యా నాణ్య తా లోపాలపై ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరిస్తున్న తరు ణంలో, సగం నిధులతో నాణ్యమైన రోడ్లు నిర్మించడం కాంట్రాక్టర్లకు సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.