పురమిత్రపై అలక్ష్యం!
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:53 AM
పట్టణాల్లోని సమస్యలను అధికారులు.. పాలకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. సాంకేతికను ప్రజలకు చేరువ చేసి.. వాట్సాప్ ద్వారా పురమిత్ర యాప్‌తో అక్కడకక్కడ పరిష్కరించే దిశగా ఏర్పాట్లు చేసినా కనీసం 50 శాతం ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు.
ఐదు నెలలైనా కానరాని స్పందన
యాప్ నమోదు అంతంత మాత్రమే
ఏలూరు కార్పొరేషన్‌తో సహా మునిసిపాలిటీలు వెనుకంజ
అధికారుల్లో నిర్లిప్తతే ప్రధాన కారణం
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
పట్టణాల్లోని సమస్యలను అధికారులు.. పాలకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. సాంకేతికను ప్రజలకు చేరువ చేసి.. వాట్సాప్ ద్వారా పురమిత్ర యాప్‌తో అక్కడకక్కడ పరిష్కరించే దిశగా ఏర్పాట్లు చేసినా కనీసం 50 శాతం ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. ఏలూరు కార్పొరేషన్, నూజివీడు, జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీల్లో, చింతలపూడి నగర పంచాయతీలో నిర్లక్ష్యమే రాజ్యమేలింది. ఐదు నెలలైనా యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య నామమాత్రమే.
ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రభుత్వం ప్రజలకు చేరువ కావాలని యోచిస్తోంది. దీనికి విరుద్ధంగా పాలకులు.. అధికారులు సాంకేతిక అంశాలపై ప్రజల్లో తీసుకెళ్లడంలో నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారు. దీంతో నగరాలు, పట్టణాల్లో సమ స్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి. ఈ విధా నానికి విరుగుడు మంత్రంగా పురపాలకశాఖ గతే డాది ఆగస్టు 1 నుంచి పురమిత్ర యాప్‌ను తీసు కొచ్చింది. ఐదు నెలలు గడిచినా కనీసం 50 శాతం మందిని యాప్‌లో నమోదు చేయించలేకపోయా రు. దీనికి ప్రధాన కారణం చిత్తశుద్ధి లోపమే.
అంతటా నిర్లిప్తతే..
ప్రజల సమస్యలను శరవేగంగా పరిష్కరించే దిశగా పురపాలక శాఖ అమలు చేసిన పురమిత్ర యాప్ నిర్వహణలో పాలకవర్గాలు, అధికారులు బద్ధకం వీడడం లేదు. జిల్లా కేంద్రమైన ఏలూరు కార్పొరేషన్‌తో సహా, గ్రేడ్–2 పురపాలక సంఘమైన జంగారెడ్డిగూడెం, నూజివీడుల్లో నిర్లిప్తతే చోటు చేసుకుంది. ఏలూరు కార్పొరేషన్‌లో ప్రధానంగా సూపరింటెండెంట్ ఇంజనీర్, టౌన్‌ప్లానింగ్ అధికారి, ఎంహెచ్‌వో తదితర కీలక పోస్టులు ఖాళీగా ఉన్నా యి. జంగారెడ్డిగూడెంలో అరకొర సిబ్బందే ఉన్నా రు. నూజివీడులో సిబ్బంది ఉన్న పట్టించుకునే అఽధికారే కరువయ్యారు.
ప్రచార లోపమే ప్రధాన కారణం
ప్రభుత్వం ఏదైనా పథకం లేదా ప్రజలకు మేలే చేసే విషయాలను ప్రచారం చేసుకోవడానికి విరి విగా అవకాశాలున్న శాఖ పురపాలకశాఖే. అటు వంటి ఈ శాఖలో కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులు ప్రచారం చేయించడానికి సమయం కేటాయించడం లేదన్న ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలనలు జరగడం లేదన్న విమర్శలున్నాయి. పురపాలకశాఖ కీలకాధికారులు ఆకస్మిక తనిఖీల ఊసేలేదు. కీలక ప్రభుత్వ శాఖల కార్యాలయాలతో పాటు హోర్డింగ్‌లు, ఇతర సంస్థలకు చెందిన షాపింగ్ కాంప్లెక్సుల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్న అటు దిశగా కన్నెత్తి చూడడం లేదు.
ఎక్కడి సమస్యలే అక్కడే..
ఏలూరుతో సహా నూజివీడు, జంగారెడ్డిగూడెంల్లో అపారిశుధ్యం నెలకొంది. పలు విభా గాల్లో సమస్యలను పేరుకుపోతున్నాయి. వీటిని పరిష్కరించడానికి చేతిలో వజ్రాయుధం ఉన్న ఆ దిశగా ప్రజలు వినియోగించే దిశగా నడపలేకపోతున్నారు. యాప్‌లో నమోదు చేసిన సమస్యలను అధికారులు వేగంగా పరిశీలించి పరిష్కరించడానికి వీలున్న ఇంకా ప్రజలకు అవగాహన కల్పించడంలో ముందుకు కదలడం లేదు.
యాప్‌లో నమోదు ఇంకెప్పుడు..
ఏలూరు నగరంలో 93,236 కుటుంబాలు ఉండగా గత ఐదు నెలలు నుంచి ఈనెల 17వ తేదీ వరకు 25,077 మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఓవరాల్‌గా 1,251 సమ స్యలు రాగా పరిష్కరించినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. నూజివీడులో 18,179 కుటుంబాలుంటే 12,990 డౌన్‌లోడ్ చేసుకుని 71.46 శాతం మంది ముందంజలో ఉన్నారు. 246 మంది సమస్యలు నమోదు చేసి వాటిని పరిష్కరించుకున్నారు. జంగారెడ్డిగూడెంలో 17,859 కుటుంబాలకు 9,305 కుటుంబాలు యాప్‌లో నమోదు కాగా, 482 సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకున్నారు. చింతలపూడి నగర పంచాయతీలో 8,746 కుటుంబాలకు అతి తక్కువగా 1,854 కుటుంబాలు యాప్‌లో మమేకం అయ్యాయి. కేవలం 78 సమస్యలను అధికారులతో పరిష్కరింప చేసుకున్నారు. ఇప్పటికైనా యాప్‌పై పురపాలక సంఘాల్లో ప్రజలకు అవగాహన దిశగా జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.