Share News

రాత్రయితే రచ్చ..రచ్చ

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:02 AM

అదొక జాతీయ రహదారి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూంటాయి. ట్రాఫిక్‌ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. రాత్రయితే మాత్రం ఆ రోడ్డులో మరో సీన్‌ కనిపిస్తుంది. ఇరువైపులా ద్విచక్ర వాహనాలు, కార్లు పార్కు చేసి కనిపిస్తుంటాయి.సంగ తేంటంటే అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

రాత్రయితే రచ్చ..రచ్చ
భీమవరం – ఉండి జాతీయ రహదారి

భీమవరం–ఉండి రహదారిలో వ్యభిచారం

ఇతర ప్రాంతాల నుంచి మహిళలు చేరిక

మందుకొట్టి యువకుల హల్‌చల్‌

రాత్రి వేళ ఆ రోడ్డులో బిక్కుబిక్కుమంటూ ప్రయాణం

గగ్గోలు పెడుతున్న జనం

భీమవరం క్రైం, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : అదొక జాతీయ రహదారి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూంటాయి. ట్రాఫిక్‌ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. రాత్రయితే మాత్రం ఆ రోడ్డులో మరో సీన్‌ కనిపిస్తుంది. ఇరువైపులా ద్విచక్ర వాహనాలు, కార్లు పార్కు చేసి కనిపిస్తుంటాయి.సంగ తేంటంటే అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సుమారు ఆరు కిలోమీటర్ల పొడవునా యువతులు, మహిళలు రోడ్ల పక్కన కాపు కాసి రోడ్డుపై వెళ్లే వారికి వల వేస్తూ ఉంటారు. వారితో పాటుగా కొంతమంది హిజ్రాలు కూడా సాయంత్రం అయితే అక్కడ వాలిపోతున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఆ ప్రాంతం మొత్తం రచ్చరచ్చగా మారుతోంది. ఎక్కువగా విద్యార్థులు, యువకులు మద్యం సేవించి అక్కడ వాహనాలతో చక్కర్లు కొడతారు. రోడ్డుపై వెళ్లేవారిని భయపెడుతూ ఉంటారు. రాత్రయితే చాలు ఆ రహదారిలో వెళ్లాలంటే మహిళలు బిక్కుబిక్కుమంటున్నారు. ఎక్కువగా ఉండి, ఆకివీడు, చెరుకువాడ, కలిసిపూడి, పాములపర్రు, కోలమూరు తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది నిత్యం భీమవరం పట్టణానికి వివిధ పనులపై వచ్చి సాయంత్రం సమయానికి వెళుతుంటారు. రాత్రి సమయాల్లో ఆ రోడ్డులో వెళ్లాలంటే భయమేస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇతర ప్రాంతాల నుంచి రాక..

తాడేపల్లిగూడెం, తణుకు, రాజమహేంద్రవరం, విజయవాడ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది యువతులు, మహిళలు రాత్రి సమయానికి ఈ ప్రాంతానికి చేరుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. యువకులను, విద్యార్థులను వలలోకి లాగుతున్నారు. వారి ఫోన్‌ నంబర్లు ఇచ్చి ఆకట్టుకుని వారిని మళ్లీ రప్పించుకుంటున్నారు. వారితోపాటు హిజ్రాలు కూడా వస్తున్నారు. ఫోన్‌ నంబర్లు తీసుకున్న యువకులు ఫోన్‌ చేసి వారు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వెళ్లిపోతున్నారు. ఇలా చాలామంది విద్యార్థులు, యువకులు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.

అందుకే.. పోలీసులూ వెళ్లడం లేదు..

అయితే ఇక్కడ ఒక ట్విస్ట్‌ ఉంది. పోలీసులు దాడి చేయకపోవడానికి కారణం ఈ ప్రాంతం మూడు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఉంది. ఆ రహదారి ఎనిమిది కిలోమీటర్లు ఉంది. అందులో భీమవరం రూరల్‌, కాళ్ళ, ఉండి పోలీస్‌ స్టేషన్ల పరిధి కూడా ఉంది. దీంతో పోలీసులు తమ పరిధి కాదంటే తమది కాదని చేతులు దులుపుకుంటున్నారు.దీంతో ఆ ప్రాంతం వ్యభిచారానికి అడ్డాగా మారింది. పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకుని అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jun 17 , 2026 | 12:02 AM