Share News

అలలపై పతకాల కలలు !

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:03 AM

కొంగు వారిగూడెం ఎర్రకాలువ వాటర్‌ స్పోర్ట్స్‌ కేంద్రంలో ప్రతిష్ఠాత్మక రోయింగ్‌ క్రీడకు రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించినా ఆ స్థాయికి తగిన ఏర్పాట్లు లేకపోవడం క్రీడాకారులు, కోచ్‌లను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి రోయింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది.

అలలపై పతకాల కలలు !
మధ్యలోనే అసంపూర్తిగా నిలిచిపోయిన కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయ జలక్రీడా శిక్షణ కేంద్రం

నిలిచిపోయిన వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ భవనం

ఎనిమిదేళ్లుగా ఎదురుచూపులు

క్రీడాకారులకు కనీస వసతులు కరువు

జంగారెడ్డిగూడెం రూరల్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి) అలలపై పతకాల కోసం పోరాడుతున్న క్రీడాకారులకు కనీస సౌకర్యాలు కూడా లేని పరి స్థితి నెలకొంది. ఎర్రకాలువ వాటర్‌ స్పోర్ట్స్‌ కేంద్రంలో ప్రతిష్ఠాత్మక రోయింగ్‌ క్రీడకు రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించినా ఆ స్థాయికి తగిన ఏర్పాట్లు లేకపోవడం క్రీడాకారులు, కోచ్‌లను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆదివారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగు వారిగూడెం సమీపంలోని ఎర్రకాలువ వాటర్‌ స్పోర్ట్స్‌ సెంటర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి రోయింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు, వారి ట్రైనర్స్‌, జిల్లా సంఘాల ప్రతినిధులు అక్కడి పరిస్థితులు చూసి ఆశ్చర్యానికి గుర య్యారు. 2018లో ప్రారంభమైన అకాడమీ భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో మొండి గోడలు, పిచ్చి మొక్కలు, మధ్యనే కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చింది.

నాలుగు కుర్చీలే వేదిక !

విజేతలకు పతకాలు అందజేసే కార్యక్రమం కూడా అత్యంత సాధారణంగా సాగింది.అసంపూర్తిగా ఉన్న భవనంలో ముందు నాలుగు కుర్చీలు వేసి అదే వేదికగా బంగారు, రజత, కాంస్య పతకాలను అంద జేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు వచ్చిన అతిథులు, క్రీడాకారులు ఇలాంటి దృశ్యాన్ని చూసి విస్మయానికి గురయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అరుదైన వాటర్‌ స్పోర్ట్స్‌ కేంద్రాల్లో ఒకటైన ఎర్రకాలువ అకాడమీలో తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు, డ్రెస్సింగ్‌ రూములు వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించే కేంద్రం పరిస్థితి ఇలాగే ఉంటే, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను ఎలా తీర్చిదిద్దగలమని పలువురు పెదవి విరుస్తున్నారు.

ప్రభుత్వం దృష్టి సారించాలి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమయంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం 4 వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాట్లకు అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 365 రోజుల పాటు నీరు పుష్కలంగా ఉండే నాలుగు జలాశయాలను ఎన్నుకుని జలక్రీడల అకాడమీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇది చాలా ఖరీదైన క్రీడ. బోట్లు, పనిముట్లు విలువైనవి. దీనికి తోడు ఒలింపిక్‌ క్రీడ కావడంతో ఈ క్రీడను ఆడే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తుంటారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని నాగాయలంక, విజయనగరం జిల్లా తాటిపూడి, విజయవాడ పున్నమి ఘాట్‌, జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయాల్లో క్రీడా అకాడమీలు ఉన్నాయి. ఏడాది పొడుగునా ఈ అకాడమిలో క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. 2018లో ఎర్రకాలువ అకాడమి నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు కాగా భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కానీ మధ్యలోనే నిలిచిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పిచ్చిమొక్కలు మొలిచాయి. కనీసం బోట్లు, ఇతర పరికరాలను భద్రపరిచేందుకు కూడా షెల్టర్‌ లేదు. వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి సౌకర్యాలు కల్పించాలని క్రీడాకారులు, కోచ్‌లు కోరుతున్నారు.

Updated Date - Jul 28 , 2026 | 12:03 AM