రీ సర్వేలోను రైతులకు అన్యాయమే
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:18 AM
రెవెన్యూ శాఖ చేస్తున్న తప్పిదాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి.
ఒక రైతు భూమి రిటైర్డ్ తహసీల్ధార్ భార్య పేరిట రికార్డుల్లోకి..
దొడ్డనపూడిలో ఒకరి భూమిపై మరొకరి పేరు
అధికారుల నిర్వాకంపై రైతులు ఆగ్రహం
కాళ్ళ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖ చేస్తున్న తప్పిదాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. భూములకు ఖచ్చితమైన హద్దులు లేక ఇబ్బందులు పడుతున్న రైతులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రీ సర్వే చేపట్టి పాత పట్టాదారు పాస్ పుస్తకాలు వెనక్కి తీసుకుని కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఇందులోనూ అవే తప్పులు సరికదా.. ఒకరి భూమిని మరొకరికి కట్టబెట్టి తూతూమంత్రంగా రెవెన్యూ అధికారులు చేతులు దులుపేసుకున్నారు. ఇటీవల ఇదే వ్యవహారంపై కాళ్ళ గ్రామానికి చెందిన కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో జిల్లా అధికారులు స్పందించారు. ఇప్పుడే ఇదే అంశంపై కాళ్ళ మండలంలోని దొడ్డనపూడి గ్రామానికి చెందిన పలువురు రైతులు తహసీల్ధార్ కార్యాలయం వద్ద మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
దొడ్డనపూడి గ్రామంలో దాదాపు పదుల సంఖ్యలో ఎకరాలు ఇతరుల పేరున మారిపోయాయని, అదేలా సాధ్యమో రైతులకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిందన్నారు. అధికారులు పట్టాదారు పాస్ పుస్తకాల్లో పేర్లు మార్చమన్నా మార్చడం లేదు. మా భూములు వేరొకరి పేరున చూపిస్తున్నాయన్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పొలానికి సంబంధించిన యజమానురాలి భర్త పేరు స్థానే తెలియని పేరు వచ్చిందని రైతులు తెలిపితే.. స్థానిక తహసీల్ధార్ సమాధానం సక్రమంగా లేకపోవడంతో గ్రామానికి చెందిన కొందరు రైతులు ఇటీవల జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అక్కడ నుంచి తహసీల్ధార్‌కు ఫిర్యాదును ఎండార్స్ చేశారు. విషయం తెలుసుకున్న రైతులు కార్యాలయానికి వస్తే వారు అక్కడే గంటల తరబడి అధికారి కోసం పడిగాపులు పడటం తమ వంతయ్యిందన్నారు. తాము జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన అంశాలు విలేకరులకు వివరించారు. రీ సర్వేలో దొడ్డనపూడిలో అక్రమాలు జరిగాయని, మరోసారి రీ సర్వే చేపట్టండి అంటూ కోరామన్నారు. అధికారులు భూమి వద్దకు వచ్చి చేయాల్సిన పనిని కార్యాలయాల్లోనే కూర్చుని అడంగళ్ ప్రామాణికంగా తీసుకుని ఫారం 34 సెక్షన్ 9(2) ప్రకారం నోటీసు జారీ చేసి కొంత మంది రైతులకు మాతమ్రే ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకుండా పూర్తి చేశారని ఆరోపించారు. నోటీసులు ఇచ్చిన రైతుల వద్ద ఎటువంటి దస్తావేజులు, లింకు దస్తావేజులు పరిశీలించకుండా భూములు రికార్డులు తారుమారు చేసి ఒకరి భూమి మరొకరి పేరుతో రికార్డులు తయారు చేశారని పేర్కొన్నారు. ఈ కారణంగా గ్రామంలో రైతుల మధ్య సమస్యలు వస్తున్నాయన్నారు.
నా భార్య పొలం రిటైర్డ్ తహసీల్ధార్ భార్య పేరున..
నా భార్య నాగలక్ష్మి పేరున ఎకరం పొలం ఉంది. రీ సర్వే తర్వాత 68 సెంట్లు మాత్రమే ఉంది. మిగిలిన 32 సెంట్లు గతంలో కాళ్ళ తహసీల్ధార్‌గా పని చేసిన తిలక్ భార్య మండా సుధారాణి పేరున ఉన్నట్లు చూపిస్తుంది. అధికారులను అడిగితే సమాధానం లేదు. ఈ పొలాన్ని నా కూతురికి కట్నంగా ఇచ్చాను. నా అల్లుడికి ఏమి సమాధానం చెప్పాలి.
– జట్టుబోయిన సుబ్బయ్య, దొడ్డనపూడి
ఖాతానే కనిపించడం లేదు
మా మావయ్య కొల్లి వెంకటేశ్వరరావుకు సంబంధించి 818 ఖాతాలో 358/1లో 91 సెంట్లు ఉండాలి. కనిపించడం లేదు. 358/2లో కొల్లి వెంకటలక్ష్మీ రత్న మాణిక్యం పేరున 27న్నర సెంట్లు ఉండాలి. అసలు రికార్డుల్లోనే చెరిగిపోయాయి. అదే భూమి వేరొకరి పేరుతో చూపిస్తుంది. అడిగితే కాళ్ళ తహసీల్ధార్ సమాధానం చెప్పడం లేదు. మేము ఎవరిని అడగాలి...?
– సయ్యపురెడ్డి శ్రీకాంత్, దొడ్డనపూడి