Share News

సర్కారు జీతం.. ప్రైవేటు వైద్యం!

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:24 AM

ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే ఎంతో కష్టం. అందులోనూ ప్రాణదాతలైన వైద్య వృత్తిలో సర్కారు కొలువు వస్తే నిరుపేదలకు సేవ చేయాలని అంతా భావిస్తారు

సర్కారు జీతం.. ప్రైవేటు వైద్యం!

విధులకు డుమ్మా కొట్టి ఏళ్ల తరబడి అజ్ఞాతం

ఉమ్మడి పశ్చిమలో 18 మంది వైద్యులకు నోటీసులు

రోగులను ప్రైవేటుకు మళ్లిస్తూ అడ్డగోలు దోపిడీ.. బయోమెట్రిక్‌ వేసి జంప్‌!

రాష్ట్రవ్యాప్తంగా 70 మంది సర్కారు వైద్యులపై వేటు

వైద్య ఆరోగ్య శాఖలో ఉలికిపాటు

ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే ఎంతో కష్టం. అందులోనూ ప్రాణదాతలైన వైద్య వృత్తిలో సర్కారు కొలువు వస్తే నిరుపేదలకు సేవ చేయాలని అంతా భావిస్తారు. కానీ, కొందరు వైద్యులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కొన్నేళ్లపాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసి.. ఆ అనుభవంతో ప్రైవేటు ఆసుపత్రులకు మారిపోతున్నారు. సొంతంగా క్లినిక్‌లు పెట్టుకుని లక్షల్లో గడిస్తున్నారు. కొందరు సర్కారు జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులకు ఎగనామం పెడుతున్నారు.

ఏలూరు క్రైం/భీమవరం క్రైం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత కొన్నేళ్లుగా 18 మంది వైద్యులు విధులకు పూర్తిగా డుమ్మా కొట్టారు. కొందరైతే ఏకంగా విదేశాలకు చెక్కేసినట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి విధులకు హాజరు కాని వీరిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా ఎందు కు తొలగించకూడదంటూ ప్రభుత్వం తాజాగా నోటీ సులు జారీచేసింది. వీరిని తొలగిస్తేనే ఆ పోస్టుల స్థానంలో కొత్త వారిని భర్తీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నోటీసులు ఒకటి రెండు రోజుల్లో జిల్లా అధికారులకు చేరనుండగా, అనంతరం వాటిని సంబంధిత వైద్యులకు అందజేయనున్నారు.

కఠిన చర్యలు

ప్రభుత్వం నుంచి ప్రతి నెలా ఠంచన్‌గా జీతాలు తీసుకుంటున్న కొం దరు వైద్యులు.. రోగులకు ముఖం చాటేస్తు న్నారు. సర్కారు వైద్యులుగా చెలామణి అవు తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల్లో సంపాదిస్తు న్నారు. ఇలాంటి వారిపై ప్రస్తుత ప్రభుత్వం కొరడా

ఝుళిపిస్తోంది. విధులకు సరిగా రాకపోయినా, ప్రైవేటు ప్రాక్టీస్‌ చేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ.. ఇప్పటికే రాష్ట్రవ్యా ప్తంగా 70 మంది వైద్యులకు ఉద్వాసన పలికింది. అలాగే 154 మందికి నోటీసులు జారీచేయగా, మరో 39 మందికి తుది అవకాశం కింద గడువు ఇచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో ఇలాంటి చర్యలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైద్యుల్లో.. ప్రస్తుత ప్రభుత్వ తాజా నిర్ణయాలతో తీవ్ర ఆందోళన మొదలైంది.

అక్కడికి రా!

ప్రైవేటు ఆసుపత్రుల్లో వేల రూపాయలు వెచ్చించి వైద్యం చేయిం చుకోలేని పేద, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయిస్తుంటారు. అయితే, కొందరు వైద్యులు ‘ఈ వ్యాధికి సంబంధించిన్చ పరికరాలు ఇక్కడ లేవు.. మెరుగైన వైద్యం కోసం నా ప్రైవేటు క్లినిక్‌కు రా’ అంటూ రోగులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. వైద్యుడి మాటలు నమ్మి అక్కడికి వెళ్లిన రోగులకు అవసరం లేని పరీక్షలు, ఖరీదైన మందులు రాస్తూ వేల రూపాయలు దోచుకోవడం కొందరికి పరిపాటిగా మారింది.

జిల్లా ఆసుపత్రుల్లోనూ అదే తీరు

పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక జిల్లా ఆసుపత్రి, నాలుగు ప్రాంతీయ ఆసుపత్రులు, మూడు సీహెచ్‌సీలు, మరికొన్ని పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆసుపత్రుల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉండగా, మరికొన్ని ఆసుపత్రుల్లో ఉన్న వైద్యులు విధులకు సరిగా హాజరుకావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ తాజా చర్యలతోనైనా ఈ పరిస్థితి మారుతుందేమో వేచి చూడాలి. నోటీసులు అందుకున్న, ఉద్వాసనకు గురైన జిల్లా వైద్యులు ఎవరన్నది రిపోర్టు రావాల్సి ఉందని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారిపి.సూర్యనారాయణ తెలిపారు.

Updated Date - Oct 04 , 2026 | 12:25 AM