Share News

రోడ్డు ప్రమాదాలకు చెక్‌!

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:39 AM

ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ డైరెక్టరేట్‌ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో తీర్మానించింది.

రోడ్డు ప్రమాదాలకు చెక్‌!
భీమవరంలో నిత్యం రద్దీగా వుంటూ తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్‌ స్పాట్‌

కొత్తగా ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌

అండ్‌ రోడ్‌ సేఫ్టీ డైరెక్టరేట్‌

ముందస్తు చర్యలపై కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌

జిల్లాలో.. 23 బ్లాక్‌ స్పాట్స్‌..

30 మంది కొత్త సిబ్బంది అవసరం!

వాహనాల సంఖ్యతోపాటు వేగం పెరిగింది. వాహనాల వేగం వల్ల ప్రమాదాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో వారి కుటుంబాలు

రోడ్డున పడుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ డైరెక్టరేట్‌ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో తీర్మానించింది. పెరుగుతున్న వాహనాల వేగం, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలతో ప్రాణనష్టం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త డైరెక్టరేట్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.

భీమవరం క్రైం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి):కొత్త డైరెక్టరేట్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నా.. పోలీసు శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ కొత్త విభాగాన్ని ప్రారంభిస్తే ఒక్కో జిల్లాకు కనీసం 20 నుంచి 30 మంది సిబ్బంది అవసరం. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన సమయంలోనూ ఉన్న సిబ్బందితోనే సర్దుబాటు చేశారు. ఈ నేపథ్యంలో కొత్త శాఖ కోసం ప్రత్యేకంగా నియామకాలు చేపడతారా? లేక ఉన్నవారితోనే నెట్టుకొ స్తారా? అన్నది తేలాల్సి ఉంది.

జిల్లాలో 23 బ్లాక్‌ స్పాట్లు

కొత్తగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రమా దాలు ఎక్కువగా జరుగుతున్న ఇరవై మూడు బ్లాక్‌ స్పాట్‌లను పోలీసులు గుర్తించారు. ఇక్కడ ప్రమాదాలను అరికట్టేందుకు స్పీడ్‌ బ్రేకర్లు, అవసరమైన చోట సిగ్నల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. కొన్ని ప్రధాన పట్టణాల్లో ఇప్ప టికే సిగ్నలింగ్‌ వ్యవస్థను ఏర్పాటుచేసినా.. అవింకా అందుబాటులోకి రాలేదు.

గుర్తించిన బ్లాక్‌ స్పాట్లు

భీమవరం వన్‌టౌన్‌, టూటౌన్‌, అత్తిలి పరిధిలోని మంచిలి, మొగల్తూరు పరిధిలో ఒక్కొక్కటి చొప్పున.. నరసాపురం రూరల్‌, టౌన్‌ పరిధిలో రెండు, పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు పరిధిలో రెండు, తణుకు రూరల్‌ పరిధిలో నాలుగు, తణుకు టౌన్‌ పరిధిలో మూడు, తాడేపల్లిగూడెం రూరల్‌, టౌన్‌ పరిధిలో రెండు, యలమంచిలి పరిధిలో ఒకటి చొప్పున ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు. పట్టణాలు, పల్లెల్లో సైతం ఈ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు.

బ్లాక్‌ స్పాట్‌లో ప్రమాదాలు

గడిచిన ఆరు నెలల కాలంలో తణుకు షర్మిష్ట సర్కిల్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు దాటుతున్న ఇద్దరిని లారీ, అలాగే మరొకరిని కారు ఢీకొట్టడంతో వారు మృతి చెందారు. వాహనాల మితిమీరిన వేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు.

తేతలి వై.జంక్షన్‌ వద్ద రెండు నెలల కాలంలో ముగ్గురు మృతి చెందారు. బైక్‌లను రోడ్డు దాటిస్తుండగా ఇద్దరిని లారీ, మరొకరిని వ్యాన్‌ ఢీకొనడంతో ముగ్గురు చనిపోయారు. అక్కడ సరైన సిగ్నలింగ్‌ వ్యవస్థ లేకపోవడం, మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణమని తేల్చారు.

భీమవరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రకాశం చౌక్‌లో మూడు నెలల క్రితం వృద్ధుడు రోడ్డు దాటుతుండగా మద్యం మత్తులో వున్న ఒక వ్యక్తి బైక్‌పై వచ్చి ఢీకొట్టడంతో మృతి చెందాడు. ఈ ప్రమాదాలన్నీ బ్లాక్‌ స్పాట్‌లలో జరిగినవే.

నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలకు రక్ష

కొత్తగా రాబోతున్న ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు. జరిమానాలు విధి స్తున్నా వాహనదారుల్లో ఆశించిన మార్పు రావడం లేదు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి. రానున్న రోజుల్లో ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. వాహనదారులకు మరింతగా అవగాహన కల్పిస్తాం.

– రఘువీర్‌ విష్ణు, భీమవరం డీఎస్పీ

Updated Date - Nov 15 , 2026 | 12:39 AM