Share News

రొయ్యల మీసం తిప్పలేం..!

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:16 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై నూరు నుంచి 18 శాతానికి సుంకాలు తగ్గించాడు. భారత్‌ ఈయూతో చారిత్రాత్మక ట్రేడ్‌ ఒప్పందం చేసుకుంది.

రొయ్యల మీసం తిప్పలేం..!

ట్రంప్‌ టారిఫ్‌ తగ్గినా.. ఈయూతో ట్రేడ్‌ ఒప్పందం జరిగినా.. కేంద్ర బడ్జెట్‌లో వరాలు ప్రకటించినా.. కరుణించని ట్రేడర్సు

మేత ధర టన్నుకు రూ.4 వేలు పెంపు

100 కౌంటు ధర కిలోకు రూ.20 తగ్గింపు

సాగు పెంచుతున్నప్పటికీ

ఆక్వా రైతుల్లో కనిపించని ఉత్సాహం

రైతులు ఐకమత్యంతో కదిలితేనే లాభం.. లేకుంటే మిగిలేవి ఇబ్బందులే..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై నూరు నుంచి 18 శాతానికి సుంకాలు తగ్గించాడు. భారత్‌ ఈయూతో చారిత్రాత్మక ట్రేడ్‌ ఒప్పందం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అనేక వరాలు కురిపించింది. వరుసగా సంభవించిన అనుకూల పరిణామాలతో ఆక్వా రైతుల ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కాని, వీరి ఆనందానికి ట్రేడర్స్‌ బ్రేకులు వేశారు. అదెలాగో.. మీరూ చదవండి.

(ఆకివీడు రూరల్‌–ఆంధ్రజ్యోతి)

కొన్నేళ్లుగా ఆక్వా రంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొం టున్నది. కరోనా సమయంలో వైసీపీ ప్రభుత్వం తీసు కున్న నిర్ణయాలు, ట్రేడర్స్‌ సిండికేట్‌తో రైతులు తీవ్రం గా నష్టపోయారు. కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆర్జించే ఈ రంగం కుదేలైంది. దీని ప్రభావం ఇతర రంగాలైన రియల్‌ ఎస్టేట్‌, భవన నిర్మాణ, వస్త్ర, బంగారం వ్యాపారంతోపాటు ఇతర రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోలుకుంటున్న దశలో ట్రంప్‌ సుంకాల పేరు తో దెబ్బకొట్టాడు. ఎగుమతులపై ప్రభావం చూపించి, ధరలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. వైరస్‌, సీడ్‌, ఫీడ్‌ నాణ్యత లేకపోవడంతో ఆక్వా సాగు గణనీయం గా తగ్గింది.

పూర్వ వైభవానికి ఉరకలు

కేంద్ర ప్రభుత్వం ఈయుతో ట్రేడ్‌ ఒప్పందం చేసు కోవడం, ఈలోగా ట్రంప్‌ సుంకాలు తగ్గిస్తున్నట్లు ప్రక టించడం, బడ్జెట్‌లో కేంద్రం ఆక్వా ఉత్పత్తులు ఎగుమ తులలో సడలింపులు ప్రకటించడం వరుసగా జరిగా యి. దీంతో ఆక్వా రైతుల్లో ఉత్సాహం ఉరకలేసింది. పూర్వ వైభవం వస్తుందని ఉబ్బితబ్బిబయ్యారు. వంద కౌంటు 300 రూపాయలకు చేరుకుంటుందని ఆశ పడ్డారు. దీంతో సాగుకు సమాయత్తమయ్యారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లక్షన్నర ఎకరాల కు పైగా రొయ్యల చెరువులు వుండగా ఇందులో 20 శాతమే సాగవుతోంది. వరాలు జల్లు కురిసిన సమ యంలో ఇప్పటి వరకు సాగు చేయకుండా నిలిపివేసి న చెరువుల యజమానులు మళ్లీ రంగంలోకి దిగుతు న్నారు.

రైతుల ఆశలపై నీళ్లు జల్లిన ట్రేడర్స్‌

దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వాలిగా అన్న సామెత అచ్చంగా ఆక్వా రైతులకు వర్తిస్తుంది. ప్రభు త్వాలు వరాలు ప్రకటించినా ట్రేడర్స్‌ వాటిని రైతులకు దక్కకుండా చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతు న్నారు. రైతుల్లో ఆనందం, ఉత్సాహంపై నీళ్లు జల్లారు. ఫీడ్‌ ధర టన్నుకు రూ.4 వేలు పెంచేశారు. రొయ్యల కౌంటు ధరలు రూ.20 వరకు తగ్గించారు. ప్రభుత్వం అన్ని రకాలా అండగా ఉన్నప్పటికి తమకు చేరడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం కౌంటుకు ధరలు ప్రకటించినా ట్రేడర్స్‌ వాటిని సక్రమంగా అమలు చేయడం లేదు. సీడ్‌, ఫీడ్‌, ఎక్స్‌పోర్టర్స్‌ అన్నీ కొందరి చేతులలో ఉండటంతో మార్కెట్‌ మీద పూర్తి అవగాహన సందర్భానుసారంగా రైతులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. అంతర్జాతీ య మార్కెట్‌లో ఫీడ్‌ ముడిసరుకు సోయాబీన్స్‌ ధరలు పెరిగితే టన్నుకు రూ.20 వేల వరకు పెంచిన కంపెనీలు అవే ధరలు భారీగా తగ్గినా కేవలం టన్నుకు నామ మాత్రంగానే తగ్గించారు. ప్రస్తుతం ముడిసరుకు ధరలు కొద్దిగా పెరిగాయని ఫీడ్‌ ధర టన్నుకు రూ.4 వేలు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆక్వా రైతులు ఆదాయం ట్రేడర్స్‌ చేతిలో చేరిందని, ఉత్పత్తులు చేస్తున్న రైతులకు మిగిలిందేమి లేదని, కేవలం ట్రేడర్స్‌కే లాభిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రంగం ద్వారా లభించే ఆదాయంపై భవన నిర్మాణరంగం, రియల్‌ ఎస్టేట్‌, బంగారం, వస్త్ర, ఇతర వ్యాపార రంగాలు చాలా కాలంగా ఆక్వా రంగానికి ప్రోత్సాహం లభిస్తే తమకు మంచి రోజులు వస్తాయని ఎదురుచూస్తున్నాయి.

ఆక్వాలోనూ మాఫియా

ఆక్వా రైతులు ప్రభుత్వాల రాయితీలు, సహకారం పొం దాలంటే ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలి. చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. ట్రేడర్స్‌ సిండికేట్‌ను నియం త్రించాలి. సబ్సిడీలు, రాయితీలు రైతులకు మాత్రమే చేరాలి. కరెంట్‌, ట్రాన్స్‌ఫార్మర్ల సబ్సిడీ అందించాలి. ప్రభుత్వం కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేయాలి. ఆక్వా రంగంలోను మాఫియా మొదలైందని రైతులు ఆం దోళనలో ఉన్నారు. ప్రభుత్వం మాత్రమే రైతులకు మేలు చేయగలదు. అది నడుంకట్టి ట్రేడర్స్‌ సిండి కేట్‌ గోడలు బద్దలుకొట్టి ఆక్వారంగాన్ని ఆదుకుని మార్కెట్‌లో కొనుగోలు శక్తిని పెంచాలి.

– సుబ్బరాజు, ఆక్వా రైతుల అడ్వైజరీ కమిటీ సభ్యుడు

ఐకమత్యంతో లబ్ధి

ఈయూ, యూఎస్‌ఏ ఒప్పందాలతో ఆక్వా రైతుకు ఆనందం కలిగింది. ఉత్సాహం తో సాగు చేయాలనుకున్నాం. ట్రేడర్స్‌ తీరు తీవ్రంగా కలిచి వేసింది. ప్రభుత్వం ఇస్తున్న దానిని రైతులకు చేరకుండా ట్రేడర్స్‌ లాగే సుకుంటున్నారు. రైతులు ఐకమత్యంతో ముందుకు వస్తేనే ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సహకారం లభిస్తుంది. రైతులందరూ ఒకే మాటతో ఆక్వా రంగం పూర్వ వైభవానికి కృషి చెయ్యాలి. ప్రభుత్వం వద్ద ఆక్వా రైతులు వాణిని వినిపించాలి.

– యువరాజు, ఆక్వా రైతు

Updated Date - Feb 06 , 2026 | 12:16 AM