Share News

రొయ్యకు వైట్‌ గట్‌ !

ABN , Publish Date - May 11 , 2026 | 12:28 AM

ఎండననక వాననకం ఆరుగాలం కష్టించి పండించిన రొయ్య పంట రైతుకు అక్కరకు రాకుండా పోతోంది. పగలనక, రాత్రినక రొయ్యల చెరువుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడు కుంటున్న రొయ్య కళ్ల ఎదుటే నీరసించి చనిపోతుంటే రొయ్య రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు.

రొయ్యకు వైట్‌ గట్‌ !
వైట్‌ గట్‌ వ్యాధి సోకిన రొయ్యల చెరువు

ఆక్వా రైతుల పాలిట యమపాశం

చెరువుల అంచుల్లో దారపు పోగుల్లా రెట్టలు

తెల్లరెట్ట వ్యాధితో నీరసించిపోతున్న రొయ్యలు

పెరుగుదల లేదు .. మేతలు నేలపాలు

అర్ధాంతరంగా పట్టుబడులు

ఎండననక వాననకం ఆరుగాలం కష్టించి పండించిన రొయ్య పంట రైతుకు అక్కరకు రాకుండా పోతోంది. పగలనక, రాత్రినక రొయ్యల చెరువుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడు కుంటున్న రొయ్య కళ్ల ఎదుటే నీరసించి చనిపోతుంటే రొయ్య రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. ఈ వేసవిలో ప్రధానంగా వైట్‌ గట్‌ సమస్య రొయ్య రైతుల పాలిట యమపాశంలా మారింది.

నిడమర్రు మే 8 (ఆంధ్రజ్యోతి): రొయ్య సాగు ప్రధా నంగా వేసవిలో ఎక్కువగా విజృంభించే వ్యాధి వైట్‌ గట్‌. ఈ వ్యాధి సోకిన రొయ్య రెట్ట తెల్లటి దారపు ఆకారంలో ప్రోగులా చెరువుల్లో విసర్జన చేస్తూంటాయి. రొయ్య జీర్ణనాళం పేగు తెల్లగా మారిపోవడాన్ని వైట్‌గట్‌ అంటా రు. ఈ వ్యాధి సోకిన రొయ్య విసర్జించే మలం తెల్లటి దారంలా కనిపిస్తుంది. వ్యాధి సోకిన తొలిరోజు చెరువు గట్లు అంచున ఒకటో, ఐదో తెల్లటి రెట్టలు కనిపిస్తాయి. వ్యాధి విజృభించి రోజురోజుకూ ఈ తెల్లటి రెట్టలు దార పు ప్రోగులు చెరువంతా వ్యాపిస్తాయి. ఈ వ్యాధి సోకిన రొయ్య ఆహారం తీసుకోలేక నీరసించిపోతాయి. రొయ్యను పట్టుకొంటే షెల్‌ మెత్తగా జీవచ్ఛవంలా ఉంటుంది.

వైట్‌ గట్‌ వ్యాధి లక్షణాలు

రొయ్యల చెరువు నీరు రంగు నలుపు రంగులోకి మారుతుంది. నీరు నాణ్యత ప్రమాణాలు తగ్గిపోవడం వల్ల ఈ రంగు మారుతుంది.

రొయ్యల చెరువులో నీటిలో తెల్లటి దారపు ప్రోగులు మలం తేలుతూ ఉంటుంది.

రొయ్యలు ఆహరం తీసుకోవడం తగ్గించి వేస్తాయి. చెక్‌ ట్రేలలో మేతలు మిగిలిపోతుంటాయి.

రొయ్యల గ్రోత్‌ ఆగిపోతుంది.

రొయ్యను పట్టుకొంటే దాని జీర్ణనాళం తెల్లగా పాలి పోయినట్లు కనిపిస్తుంది.

వ్యాధి కారణాలు

వేసవిలో చెరువులో నీరు ఐదు అడుగులలోపు చేర డం వల్ల నీటిలో ఫ్లాంటన్‌ క్రాస్‌ అయి బ్యాక్టీరియా లోడు పెరిగిపోతుంది.

చెరువులో బ్లూగ్రీన్‌ ఆల్గే అని పిలవబడే నాచు పదార్థం పెరిగి వాటిని తిన్న రొయ్యలు ఈ వ్యాధికి గురవుతాయి.

నీటి నాణ్యతా ప్రమణాలు లేకపోవడం, పీహెచ్‌, అమ్మోనియో, నైట్రెట్‌లు పెరగడం.

మేత నాణ్యత లోపం వల్ల కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. బూజు పట్టిన , తడిసిన మేతను, బాగా నిల్వ ఉన్న మేతను వాడడం ద్వారా ఈ వ్యాధి సోకుతుంది.

చెరువులో బోటమ్‌ (అడుగునేల) బాగా పొల్యూషన్‌ అవ్వడం వల్ల హానికర విషవాయువులు పుట్టి రొయ్య ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి.

నివారణ కోసం..

చెరువుల్లో నీటి యాజమన్యం సక్రమంగా పాటించాలి. చెరువుల్లో నీరు నిల్వ ఐదు అడుగుల లోతు తగ్గకుండా చూసుకోవాలి. ఒకవేళ కాలువ నీరు అందుబాటులో లేకపోతే బోరువాటర్‌నేనైనా తోడుకోవాలి.

చెరువుల్లో బ్యాక్టీరియా లోడు నివారణ కోసం తక్కువ మోతాదులో శానిటైజర్లు వాడాలి.

వైట్‌గట్‌ వ్యాధి వల్ల రొయ్యలు ఆహారం సరిగా తీసుకోలేవు. దానిని గమనించి రొయ్యల ఫీడ్‌ను 30% – 40% తగ్గించాలి. ఎప్పటికప్పుడు చెరువులో చెక్‌ట్రేలను చూసుకొంటూ మేత వాడుకోవాలి.

ఇటీవల చాలామంది రైతులు సంప్రదాయ పద్ధతిలో ఆయుర్వేద చికిత్సా విధానంలో వైట్‌గట్‌ వ్యాధి నివారణ కోసం 10 గంటల మేతలో ఎకరాకు 2 కేజీల పసుపు, 2 కేజీల వెల్లుల్లిని మెత్తగా ఆడించి ముందురోజు నీటిలో నానబెట్టి మేత ఆపి వాటర్‌ లో ఆప్లై చేయాలి. మరోక రోజు అచ్చు బెల్లం ఎకరాకు ఐదు కేజీల బెల్లం నానబెట్టి నీటిలో చల్లార్చాలి.

మార్కెట్‌లో పేరొందిన కంపెనీల వారి గట్‌ ప్రొబైటిక్‌ మందులు నివారణ డబ్యూఎఫ్‌ మొదలగునవి వాడకం ద్వారా మంచి రిజర్ట్‌ పొందవచ్చును.

ప్రారంభంలోనే గుర్తిస్తే నివారించవచ్చు

వేసవిలో రొయ్యలకు సంభవించే వ్యాధుల్లో ప్రధానమైనది వైట్‌గట్‌. ఈ వ్యాధి సోకిన రొయ్యలు మేతలు తినక నీరసించి పోతాయి. జీర్ణనాళం తెల్లబడిపోయి (వైట్‌గట్‌) ఆహారం తీసుకోవు. ఈ వ్యాధి ప్రారంభంలో గుర్తించడం ద్వారా నివారించవచ్చు. వైట్‌గట్‌ రాకుండా రైతులు ముందస్తుగా గట్‌ ప్రొబైటిక్స్‌ వాడుకోవాలి. ప్రతి వారం నీటి నాణ్యతా ప్రమాణాల పరీక్షలు చేయించాలి.

– పి.రాంప్రసాద్‌, ఏరియా మేనేజర్‌, టెక్నీషియన్‌బయోమెడ్‌ ఆక్వా కేర్‌ కంపెనీ గణపవరం

Updated Date - May 11 , 2026 | 12:28 AM