Share News

పీఆర్‌–126 పంచాయితీ!

ABN , Publish Date - Apr 13 , 2026 | 12:13 AM

జిల్లాలో అధిక దిగుబడులనిచ్చే పీఆర్‌ –126 రకం వరి విత్తనం అసలు పండించాలా .. వద్దా అన్న మీమాంసలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

పీఆర్‌–126 పంచాయితీ!
పీఆర్‌–126 రకం ధాన్యాన్ని చూపిస్తున్న రైతులు

సాగుపై సందిగ్ధం

అధిక దిగుబడులు.. అదనపు ఆదాయం .. సాగుపై మొగ్గు చూపుతున్న రైతులు

నాణ్యత ఉండదు.. ఎగుమతుల్లేవ్‌..సాగు వద్దని వారిస్తున్న వ్యవసాయ శాఖ

ఏలూరుసిటీ, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అధిక దిగుబడులనిచ్చే పీఆర్‌ –126 రకం వరి విత్తనం అసలు పండించాలా .. వద్దా అన్న మీమాంసలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ రకం వరి సాగు చేయడం వల్ల అధిక దిగుబడులు వస్తున్నాయని, ఎకరానికి అదనపు ఆదాయం లభిస్తోందని రైతులు చెబుతుండగా, ఈ వంగడం సాగుకు శ్రేయస్కరం కాదని, ధాన్యం ఎగుమతులు లేవని, నిల్వ శాతం తక్కువగా ఉంటుందని వ్యవసాయ శాఖ చెబుతోంది. గతేడాది నుంచి ఈ రకాన్ని సాగు చేయవద్దని వ్యవసాయ శాఖ చెబుతున్నా రైతులు పీఆర్‌–126 రకాన్ని సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖాధి కారులు చెబుతున్నారు.

జిల్లాలో గతంలో 50 వేల నుంచి 60 వేల ఎకరాల్లో పీఆర్‌–126 సాగు జరగ్గా ఈ ఏడాది నాలుగు వేల నుంచి ఐదువేల ఎకరాల్లో మాత్రమే ఈ రకాన్ని సాగు చేస్తు న్నారని జిల్లా వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం కొనుగోలు కేం ద్రాల వద్ద ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయ డానికి నిరాకరిస్తున్నారని, తమ ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ రకాన్ని సాగు చేసిన రైతులు కోరుతు న్నారు. దీనిపై రైతు సంఘం ఆధ్వర్యంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మ రాజుకు శనివారం వినతి పత్రం ఇచ్చినట్టు రైతు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి కె.శ్రీనివాస్‌ తెలిపారు. పీఆర్‌–126 రకాన్ని సాగు చేయవద్దంటే వ్యవసాయ శాఖ రైతుల్లో పూర్తిగా అవగాహన కల్పించాలని, ప్రత్యామ్నాయంగా అధిక దిగుబడి ఇచ్చే కొత్త వరి వంగడాన్ని తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

నాణ్యత లేదు..

‘పీఆర్‌–126 వరి రకం అన్ని రకాల కంటె అధిక దిగుబడి ఇస్తుంది కాని ఈ రకంలో అసలు నాణ్యత లేదు. గతేడాది నుంచే ఈ రకాన్ని సాగు చేయవద్దని చెబుతున్నాం. గతంతో పోలిస్తే ఈ రకం విస్తీర్ణం బాగా తగ్గింది. ఈ రకం బియ్యంతో వండిన అన్నం ఎక్కువ సమయం నిల్వ ఉండదు. పులిసిపోతుంది. ఒకప్పుడు ఆఫ్రికా దేశాల్లో ఈ రకానికి చెందిన ధాన్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఈ ఏడాది ఈ రకానికి ఎగుమతులు లేవు. బహిరంగ మార్కెట్‌లోను డిమాండ్‌ లేదు. ప్రస్తుతం ఈ రకం ధాన్యం కొనుగోలు చేస్తాం. రాబో యే రోజుల్లో ఈ రకం విత్తనాన్ని సాగు చేయవద్దు’ అంటూ జిల్లా వ్యవసాయ శాఖ జేడీ షేక్‌ హబీబ్‌బాషా పేర్కొన్నారు.

ధాన్యాన్ని తరలించేందుకు లారీలు ఏర్పాటు చేయాలి

భీమడోలు, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి) : కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు లారీలు ఏర్పాటు చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం డిమాండ్‌ చేసింది. భీమడోలు మండలం పూళ్ళలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కర్‌రావు, జిల్లా కన్వీనర్‌ అప్పారావు, వెజ్జు శ్రీరామమూర్తి మాట్లాడుతూ పది రోజులుగా వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయని అయితే ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆరోపించారు. వాతా వరణ మార్పుల వల్ల రైతులు ఆందోళన చెందుతున్నా రన్నారు. శ్రీనివాస్‌రావు, నాగేశ్వరరావు, వెజ్జు రాంబాబు రైతులు పాల్గొన్నారు.

కాగా ‘మండలంలో 12 రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. రెండు లక్షల 68 వేల గోనె సంచులు అందుబాటులో ఉన్నాయి. 1600 ఎకరాల కోతలు పూర్తికాగా 110 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. రైతులకు ఏ ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నా’మని ఏవో ఉషారాణి తెలిపారు.

Updated Date - Apr 13 , 2026 | 12:13 AM