మొరాయించిన సర్వర్లు
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:29 AM
పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ ధ్రువపత్రాల పరిశీలనకు తొలి రోజు బుధవారం సర్వర్ సమస్యతో విద్యార్థులు అవస్థలు పడ్డారు.
పాలిటెక్నిక్ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన.. తొలిరోజు అంతరాయం.. విద్యార్థుల అవస్థలు
తణుకు, జూన్ 24(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ ధ్రువపత్రాల పరిశీలనకు తొలి రోజు బుధవారం సర్వర్ సమస్యతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. జిల్లాలోని తణుకు ఎస్‌ఎంవీఎం పాలిటెక్నిక్, నరసాపురం స్వర్ణాంధ్ర, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్, భీమవరం సీతా పాలిటెక్నిక్ కళాశాలల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పాలిసెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థులు తమ ధ్రువపత్రాలను తీసుకుని ఈ కేంద్రాలకు వెళ్లారు. కాని సర్వర్ సమస్య కారణంగా మధ్యాహ్నం వరకు వేచి చూసి చాలా మంది వెనుదిరిగారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ఆధార్‌తో అనుసంధానం కారణంగా ఈ సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ మాన్యువల్‌గా జరిగేది. తొలిసారిగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ చేపట్టారు.
30 వరకు గడువు
ఆన్‌లైన్ పరిశీలనకు, రుసుము చెల్లించడానికి 30వ తేదీ వరకు గడువు వుంది. విద్యార్థులు పాలిసెట్.ఏపీ.జీవో.వి.ఇన్. వెబ్‌సైట్‌లోకి వెళ్లి ముందుగా నిర్దేశించిన ఫీజు చెల్లించాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు, ఆధార్, నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, ఎస్‌ఎస్‌సి మార్కుల జాబితా, టీసీ, నివాస, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయాలి. 29వ తేదీ నుంచి జూలై మూడో తేదీ వరకు వెబ్ ఆప్షన్లు, 6న సీట్ల కేటాయింపు, 7న తరగతులు ప్రారంభమవుతాయి.
విద్యార్థుల కౌన్సెలింగ్ కోసం తమ కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తణుకు ఎస్‌ఎంవిఎం పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.తులసీ రాధ తెలిపారు. ‘విద్యార్థులు ధ్రువపత్రాలను ఆన్‌లైన్ ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. సర్వర్ సమస్యల కారణంగా తొలిరోజు జాప్యం జరిగింది’ అని తెలిపారు.