సాగర ఘోష
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:37 AM
గడచిన కొద్ది రోజులుగా సుముద్రంలోని తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. పెద్ద సంఖ్యలోనే తీరానికి కొట్టుకొస్తున్నాయి.
చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, విష పదార్థాలు, ఘోస్ట్ నెట్‌లతో
40 శాతం మత్స్య సంపదకు ముప్పు
రహస్య వలలో చిక్కుకుని తాబేళ్లు మృత్యువాత
సంరక్షణకు అటవీ శాఖ చర్యలు..
తీరంలో తాబేళ్ల గుడ్లు సేకరిస్తూ హెచరీల్లో పెంపకం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
గడచిన కొద్ది రోజులుగా సుముద్రంలోని తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. పెద్ద సంఖ్యలోనే తీరానికి కొట్టుకొస్తున్నాయి. ఈసారి నర్సాపురం సముద్ర తీరప్రాంతా నికి ఇలా కొట్టుకొచ్చిన 40 తాబేళ్లకు అటవీ శాఖ అధికారు లు గుర్తించారు. వాటికి పోస్టుమార్టం నిర్వహించి మరణాని కి కారణాలు తెలుసుకున్నారు. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలో వేసిన నిగూఢమైన వల(ఘోస్ట్ నెట్) లో చిక్కుకుని ఇవి మృతి చెందినట్టు ప్రాథమికంగా గుర్తిం చారు. తాబేళ్లు అంతరించిపోతే సముద్రంలో ఆక్సిజన్‌స్థాయి తగ్గిపోతుంది. అది ఇతర సముద్ర జీవరాశులపై ప్రభావం చూపుతోంది. అందుకే తాబేళ్లు మరణిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకుంటాయి. సాధారణంగా తాబేలు ప్రతి 40 నిమిషాలకు ఒకసారి పైకి వచ్చి ఆక్సిజన్ తీసుకుంటుంది. కాని ఈ ఘోస్ట్ నెట్‌లో చిక్కుకుపోవ డంతో అవి పైకి రాలేక మృత్యువాత పడుతున్నాయి. ఏ ప్రాంతంలో తాబేళ్లు మరణిస్తున్నాయనే విషయంపై ఇప్పు డు అటవీ అధికారులు ఆరా తీసి మత్స్య శాఖ సహకా రంతో మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్నారు.
తాబేళ్ల సంరక్షణకు చర్యలు
తాబేళ్లు సముద్ర తీరానికి వచ్చి గుడ్ల్లు పెట్టే ముందు సముద్రంపైకి మెడ ఎత్తి తీరంవైపు చూస్తాయి. ఏ అలికిడి లేకుంటేనే బయటకు వస్తాయి. గుడ్లు పెట్టేందుకు బయట కు వచ్చే సమయంలో జన సంచారం ఉన్నా లేదంటే అలికిడి ఉన్నా సరే సముద్రంలోనే ఉండిపోతాయి. మరో ప్రాంతాన్ని ఎంచుకుంటాయి. గుడ్డు పెడుతున్న సమయం లో అక్కడకు ఎవరు వెళ్లినా తాబేళ్లు అదరవు. బెదరవు. గుడ్లు పెట్టి వాటిపై ఇసుకను తమ కాళ్లతో కప్పిపెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. అందుకే అనువైన పరిసరాలను కల్పించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాత్రి పూట తీరప్రాంత పరిసరాలకు ఎవరూ వెళ్లకుండా చూడాలని మెరైన్ పోలీసులను కోరింది.
ఇలా తీర ప్రాంత ఇసుక తిన్నెల్లో తాబేళ్లు పెడుతున్న గుడ్లను సేకరిస్తోంది. హేచరీల్లో వాటిని పొదిగిస్తోంది. పిల్ల లయ్యాక అవి తిరిగి సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. గత ఏడాది 15 వేల గుడ్లను సేకరించగా, ఈ ఏడాది ఇప్ప టివరకు 1,350 గుడ్లను సేకరించారు. సముద్ర తాబేళ్లు సంరక్షణ ఎంత అవసరమో అవగాహన కల్పిస్తున్నారు.
సముద్రం.. కాలుష్యమయం
మానవుడి స్వార్థం కడలిని కబళిస్తోంది. ఇష్టానుసారం చెత్తా చెదారాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి విడిచి పెట్టడంతో జల జీవాలు కనుమరుగుయ్యే ప్రమాదం పొంచి వుంది. సముద్రంలో పెరుగుతున్న ఉష్టోగ్రతలతో 2050 నాటికి 40 శాతం చేపల జాతులు అంతరించే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతు న్నారు. సముద్రాన్ని రక్షించేందుకు బ్రెజిల్‌లో నిర్వహించిన ధరిత్రి సదస్సులో సముద్రంలో చేపలకంటే ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తా చెదారాలతో మత్స్యసంపదకు ప్రమాదం వాటిల్లిందని, వాటి నివారణకు చర్యలు తీసుకో వాలని తీర్మానించింది. ఈ నేపథ్యంలో ఏటా అంతర్జాతీయ తీరప్రాంత పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇది కేవలం ఒక రోజు చేసి తీరం వెంబడి గల చెత్తను కొంత మేర శుభ్రం చేసి అధికారులు, ప్రజా ప్రతినిధులు చేతులు దులుపుకుంటు న్నారు. సముద్ర గర్భంలో లక్షలాది టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు, చెత్తా చెదారా లు పేరుకుపోవడంతోపాటు డ్రెయిన్‌లు, ఉప్పుటేరుల్లో ఉండే కలుషిత నీరంతా సముద్రంలోకి చేరడంతో కాలు ష్యం పెరిగిపోతోందని పర్యావరణవేత్తలు భావిస్తున్నా రు. ఈ కాలుష్యం కారణంగా మత్స్యసంపద అంతరించిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు సముద్రం కోతకు గురవుతోంది.
అధికంగా కొట్టుకువస్తున్న కళేబరాలు
జిలాలో నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 19 కిలోమీటర్ల సాగర తీరం ఉంది. మోళ్లపర్రు సమీపంలో సముద్ర ముఖద్వారం గుండా ఉప్పుటేరు ద్వారా కలుషిత నీరు చేరడంతోపాటు సముద్రంలో భారీ నౌకలు, పడవలు ప్రయాణిస్తుండటంతో వాటిని తాకిన కొన్ని జలచరాలు గాయాలపాలై మృత్యువుకు గురికావడం, సముద్ర ఉష్ణోగ్ర తలు పెరగడం మత్స్యసంపద నశించిపోవడానికి ప్రధాన కారణాలుగా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వాటి రక్షణకు మనం కూడా చర్యలు తీసుకోవాలి. చెత్తా చెదా రాలు, కలుషిత జలాలు సముద్రం వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన వుంది.