Share News

ఆకివీడులో హై అలర్ట్‌ !

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:00 AM

ఆకివీడు ఖాకీ నీడలోకి చేరింది. పట్టణంలో దాదాపు 600 మంది పోలీసులు మోహరించారు. ఆకివీడు పెదపేట రామాలయ నిర్మాణానికి మద్దతుగా హిందువులు, ఆలయం వద్దంటూ క్రైస్తవులు కొందరు చలో ఆకివీడు అంటూ వాట్సప్‌, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో పోలీసులు ముందుగానే అప్రమత్తం అయ్యారు.

ఆకివీడులో హై అలర్ట్‌ !
పోలీసు బలగాలకు సూచనలు ఇస్తున్న భీమవరం డీఎస్పీ రఘువీర్‌ విష్ణు

సోషల్‌ మీడియా ద్వారా చలో ఆకివీడుకు పలువురి పిలుపు

అప్రమత్తమైన పోలీసులు.. 600 మందికి పైగా మోహరింపు

వందమందికి పైగా అదుపులోకి..

ఆకివీడు, ఏప్రిల్‌ 5 (ఆంరఽధజ్యోతి) : ఆకివీడు ఖాకీ నీడలోకి చేరింది. పట్టణంలో దాదాపు 600 మంది పోలీసులు మోహరించారు. ఆకివీడు పెదపేట రామాలయ నిర్మాణానికి మద్దతుగా హిందువులు, ఆలయం వద్దంటూ క్రైస్తవులు కొందరు చలో ఆకివీడు అంటూ వాట్సప్‌, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో పోలీసులు ముందుగానే అప్రమత్తం అయ్యారు. పెదపేట రామాలయం వద్ద గతంలో రెండు పర్యాయాలు జరిగిన ఘటనలు, ఉద్రిక్తత వాతావరణాల సంఘటనల్లో పోలీసులు అభాసుపాలయ్యారు. నిఘా వర్గాల వైఫల్యం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పట్లో ఒక వర్గం దాడిలో పలువురికి గాయాలయ్యాయి. చలో ఆకివీడు పిలుపుతో ఏలూరు రేంజ్‌లో ఉన్న పోలీసులు, సాయుధ దళాలను రంగంలోకి దింపారు. దాదాపు 600 మంది పోలీసులు శనివారం సాయంత్రానికే ఆకివీడు చేరుకున్నారు. ఆకివీడు అంతటా 144 సెక్షన్‌ అమలు చేశారు. స్థానికలు ఎవరూ అనవసరంగా బయటకు రాకుండా నిరోధించారు. స్థానికేతరులను ఎక్కడిక్కడ అడ్డుకున్నారు. వాస్తవానికి పత్రికల్లో రాముని ఆలయం శిఽథిలావస్థకు చేరుకుందన్న వార్తలతో డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఆలయాన్ని పునర్మిస్తానంటూ ప్రకటించారు. అయితే స్ధానికంగా క్రైస్తవ వర్గం దీనిని వ్యతిరేకించింది. బయట వ్యక్తుల జోక్యంతో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఇది ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. మరో వైపు రామాలయ నిర్మాణానికి విరాళాలు భారీగానే వచ్చాయి. పెద పేటలో ఉన్న స్థానికులు కూడా కాస్త తగ్గినట్లే కనిపించారు.బయట వ్యక్తుల ప్రోద్బలంతోనే గొడలు జరుగుతున్నాయంటూ పెదపేటకు చెందిన పలువురు స్థానికులు చెప్పుకొచ్చారు. ఇంతలో చలో ఆకివీడు పిలుపుతో మళ్లీ ఆందోళన నెలకొంది. పరిస్థితి అదుపు తుప్పుతుందని భావించి పోలీసులు ఈసారి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. భారీగా పోలీసులను మోహరించారు. బయట వ్యక్తులు జోక్యం లేకుండా ఉంటేనే అక్కడ శాంతి నెలకొనేందుకు అవకాశం ఉంటుందని దాని కోసం పోలీసులు కృషి చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు.

ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు

ప్రశాంతంగా ఉన్న ఆకివీడుకు బయట నుంచి వచ్చి భంగం కల్గిస్తే సహించేది లేదని చర్యలు తీవ్రంగా ఉంటాయని భీమవరం డీఎస్పీ రఘువీర్‌ విష్ణు హెచ్చరించారు. పార్టీలు, సంఘాలు గానీ ఎటువంటి పిలుపునివ్వలేదని, ఆకతాయిలు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. బయట వ్యక్తులు ఎవరూ ఆకివీడు రావద్దని వస్తే అరెస్టు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. పెదపేట రామాలయం వద్దకు చేరుకోవటానికి ప్రయత్నించిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కైకలూరులో సినీనటి కరాటే కళ్యాణితో పాటు మరికొంతమందిని, ఆకివీడు, ఉండి మండలాల్లో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 70 మందిని ఉండిలో కోట్ల ఫంక్షన్‌ హాల్‌లో, ఆకివీడు చుట్టుపక్కల అదుపులోకి తీసుకున్న సుమారు 30 మందిని ఆకివీడు తహసీల్దార్‌ కార్యాలయంలో, మరో ఐదుగురిని పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. అందరికీ వార్నింగ్‌ ఇచ్చి వదిలేస్తామని ఆకివీడు ఎస్‌ఐ హనుమంతు నాగరాజు తెలిపారు.

Updated Date - Apr 06 , 2026 | 12:00 AM