పరిహారం పెంచారు..
ABN , Publish Date - May 02 , 2026 | 01:05 AM
పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ విలువ, ఇంటి స్థలం విలువ పెంపుపై రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంటికి రూ.2.85 లక్షల నుంచి రూ.3.57 లక్షలకు పెంపు
ఇంటి స్థలం విలువ రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలకు..
వన్‌టైం సెటిల్‌మెంట్ విషయంలో రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం
వేలాది మంది పోలవరం నిర్వాసితులకు మేలు
కుక్కునూరు, మే 1(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ విలువ, ఇంటి స్థలం విలువ పెంపుపై రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వాసిత కుటుంబాలకు సంబంధిం చి గిరిజన, గిరిజనేతర కుటుంబాలకు వన్‌టైం సెటిల్‌మెంట్ (ఓటీఎస్) కింద ఇళ్ల నిర్మాణం యూనిట్ ధర రూ.2.85 లక్షల నుంచి రూ.3.57 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో కాకుండా వేరేచోట ఇళ్లు నిర్మించుకోవాలనుకునేవారికి ఇంటి స్థలం విలు వ రూ.లక్ష నుంచి 2లక్షల వరకు పెంచేలా గురువారం అమరావతిలో జరిగిన క్యాబినెట్‌లో సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది నిర్వాసితులకు న్యాయం జరగనుంది.
ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటి వరకు 41.15 కాంటూరు లెవెల్‌లో ఉన్న గిరిజన, గిరిజనేతర కుటుంబాలకు పరిహారం అందించే ప్రక్రియ సాగుతోంది. ఓసీలకు వ్యక్తి గత పునరావాస పరిహారం రూ.6.36 లక్షలు ఎస్సీ, ఎస్టీలకు రూ.6.86 లక్షలు పరిహారం అం దిస్తోంది. ఇదే సమయంలో నిర్వాసితులకు పున రావాస కాలనీలో ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వాసితులకు వ్యక్తిగత పునరావాస పరి హారం ఇస్తూ ఇల్లు వద్దనుకున్న వారికి రూ.2.85 లక్షలతో పాటు ఐదు సెంట్ల ఇంటి స్థలానికి రూ.లక్ష కలిపి ఇప్పటి వరకు పరిహారం చెల్లించారు. తాజాగా క్యాబినెట్ నిర్ణయం ప్రకారం ఇక నుంచి ఇల్లు వద్దనుకునే వారికి రూ.3.57 లక్షలు, ఇంటి స్థలానికి రూ.2 లక్షలు పరిహారాన్ని వన్‌టైం సెటిల్‌మెంట్ కింద అందించనున్నారు.
గతేడాది జనవరి, నవంబరు నెలల్లో దాదాపు రూ.2,200 కోట్లు పరిహారం, పునరావాస ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం నిర్వాసితుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పటికే ప్రభుత్వం 41.15 కాంటూరు లెవెల్‌లో పునరావాస ప్రక్రియ కొంత పెండింగ్ మినహా దాదాపుగా పూర్తి చేసింది. 2007 మార్చి అనంతరం 45.72 కాంటూరు లెవెల్‌లో నిర్వాసితులకు పునరావాస ప్రక్రియ ప్రారంభించనుంది. ఈ పరిధిలో దాదాపు 85 వేల మందికి పైగా నిర్వాసితులు ఉన్నారు. ప్రస్తుతం పెంచిన వ్యయంతో వారందరికి న్యాయం జరగనుంది. ఇదిలా ఉండగా తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో 41.15 కాంటూరు లెవెల్‌లో ఇప్పటికే పరిహారం అందుకున్న నిర్వాసితులు తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.