Share News

పోలవరం పరుగులు

ABN , Publish Date - Jul 13 , 2026 | 12:39 AM

గోదావరి పుష్కరాలకు మునుపే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పోల వరం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

పోలవరం పరుగులు

వర్షాలు.. వరదలొచ్చినా ఆగకుండా ఏర్పాట్లు

సీఎం రాక నేపథ్యంలో ప్రాజెక్టు పనులపై పరిశీలన..

పోలవరం, జూలై 12(ఆంధ్రజ్యోతి):గోదావరి పుష్కరాలకు మునుపే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పోల వరం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం పరిశీలనకు రానున్న నేపథ్యం లో ప్రాజెక్టు నిర్మాణపు పనులు మరింత ఊపందుకున్నాయి. కేంద్రం ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.800 కోట్లు మంజూరు చేసి సహకారం అందించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు విడతలుగా రూ.2,250 కోట్లు నిర్వాసి తులకు పరిహారం అందించింది. నిర్వాసితులకు మిగిలిన పరిహారం సొమ్మును అందించడానికి, పూర్తిస్థాయి పునరా వాసాలు కల్పించడానికి రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుం టోంది. ‘సోమవారం ముఖ్యమంత్రి పర్యటన, 14న సీఎస్‌ఎం ఆర్‌ఎస్‌ బృందం పరిశీలనకు రానున్న నేపథ్యంలో పనులు వేగవంతంగా చేస్తున్నాం. పుష్కరాలకు మునుపే పనులు పూర్తి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా’ మని ఎస్‌ఈ రామచంద్రరావు తెలిపారు. ‘ముఖ్యమంత్రి చంద్ర బాబు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు ఆదేశాలు, సూచనల మేరకు అత్యాధునిక పరికరా లతో నాణ్యతలో రాజీ లేకుండా పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. వర్షాలొచ్చినా వరద లొచ్చినా పనులు ఆగకుండా చర్యలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పుష్కరాల నాటికి పనులు పూర్తి చేస్తా’మంటూ మేఘా నిర్మాణ సంస్థ జిఎం ఎ.గంగాధర్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలవరం పనుల ప్రగతిని ఓసారి పరిశీలిద్దాం..

ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన ప్రధాన నిర్మాణం ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం. స్పిల్‌వేకి ఆనుకుని ఉన్న కొండ నుంచి ప్రాజెక్టు ఎడమ కాలువవైపు కొండలలోకి భూగర్భంలో నిర్మించిన డయాఫ్రంవాల్‌కి ఇరువైపులా 53.45 మీటర్ల ఎత్తున నిర్మిస్తున్న మట్టి, రాయి, కంకరు, ఇసుకలతో నిర్మించే భారీ అనకట్ట. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో సీపేజీ జలాలు, వర్షాల జలాల వల్ల పనులకు ఆటంకం లేకుండా ఎగువ కాఫర్‌ డ్యాంకి దిగువన ఇప్పటికే బట్రస్‌ డ్యాం నిర్మించారు. గ్యాప్‌–1 ప్రాంతంలో సీపేజీ జలాలు వర్షాల జలాలను డీవాటరింగ్‌ చేయడానికి భారీ అశ్వసామర్థ్య కలిగిన 61 మోటార్లను ఆప్రాంతంలో ఏర్పాటు చేసి నీటిని తోడుతున్నారు. ఎగువ కాఫర్‌ డ్యాం పొడవునా వస్తున్న సీపేజీ జలాలను ప్రత్యేక కాలువ ద్వారా దిగువ కాఫర్‌ డ్యాంకి తరలించి అక్కడ నిర్మించిన స్లూయిజ్‌ ద్వారా మోటార్ల ద్వారా నీటిని గోదావరి సహజ ప్రవాహంలోకి తోడుతున్నారు. ఎర్త్‌కంరాక్‌ఫిల్‌ డ్యాం నిర్మాణంలో దిగువన 280 మీటర్ల వెడల్పున డయాఫ్రంవాల్‌కి ఇరువైపులా సీఎస్‌ ఎంఆర్‌ఎస్‌ నిపుణులు సూచించిన నాణ్యతా ప్రమాణాలతో ఎర్త్‌కంరాక్‌ఫిల్‌ డ్యాం నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఇప్పటి వరకు 450 చైనేజీ నుంచి 900 వరకు 23 మీటర్ల ఎత్తుకి, 1 నుంచి 420 చైనేజీ వరకు 21 మీటర్ల ఎత్తుకి, 900 చైనేజీ నుంచి 1,200 వరకు 21 మీటర్ల ఎత్తుకి 1,200 చైనేజీ నుంచి 1,350 మీటర్ల ఎత్తుకి పనులు పూర్తయ్యాయి.మొత్తం 53.53 మీటర్ల తుది ఎత్తు లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. గ్యాప్‌–1 ప్రాంతంలో ఎర్త్‌కం రాక్‌ఫిల్‌ డ్యాం పనులు 34 మీటర్ల సేఫ్‌ లెవెల్‌ వరకు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. గ్యాప్‌–1కి గ్యాప్‌–2ని అనుసంధానించే పనులు కొనసాగుతున్నాయి. వర్షాల సీజనులో సైతం పనులు ఆగకుండా డీవాటరింగ్‌ చేస్తున్నట్టు ఇప్పటికే మట్టి రాయి సీజను పనులకు సరిపడా సమీప ప్రాంతాల్లో డంప్‌ చేసినట్టు ఈఈ శ్రీనివాస్‌ తెలిపారు.

పైలట్‌ ఛానల్‌..రోడ్డు పనులు

డివిజన్‌ 1 పరిధిలో పైలట్‌ ఛానల్‌ మట్టి తవ్వకం పనులు 30 శాతం ఇప్పటికే పూర్తి కాగా మిగిలిన 70 శాతం పనులు వేగంగా జరుగుతున్నాయి. పోలవరం నుంచి స్పిల్‌వే వరకు రూ.98 కోట్ల బడ్జెట్‌తో 7 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రెండు లైన్ల ప్రధాన రహదారి పనులు జరుగుతున్నాయి. రోడ్డు మార్గానికి పలుచోట్ల అవసరమయ్యే బాక్సు కల్వర్టుల డిజైన్ల అనుమతులు పొందిన వెంటనే నిర్మాణం ప్రారంభమవుతుందని ఆ మార్గంలో రెండు వంతెనల నిర్మాణం కూడా చేయను న్నట్లు ఈఈ పి.వెంకటరమణ తెలిపారు.

జంట గుహలు

డివిజన్‌ 2 పరిధిలో నిర్మిస్తున్న 63,64 ప్యాకేజీలలో తోటగొంది–మామిడిగొంది, మామిడిగొంది–దేవరగొంది గ్రామాల మధ్య నిర్మించిన రెండు జంట గుహల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. ప్యాకేజీ 63లో పనులు 98.5 శాతం పూర్తి కాగా, 64 ప్యాకేజీలో 93.93 శాతం పనులు పూర్తయ్యాయి. ఎంట్రీ ఛానల్‌, ఎగ్జిట్‌ ఛానల్‌ కాంక్రీటు పనులు కొనసాగుతున్నాయని పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈఈ ఎల్‌వీ రావు తెలిపారు.

పవర్‌ హౌస్‌ నిర్మాణం

ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణం పనులు 54 శాతం పూర్తయ్యాయి. సివిల్‌ పనులు 72 శాతం పూర్తికాగా హైడ్రో మెకానికల్‌ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తొలి మూడు యూనిట్ల కమీషనింగ్‌ పనులు జరుగుతున్నాయి. 2027 జూలై నాటికి ఐదు యూనిట్ల నిర్మాణం, 2028 నాటికి మొత్తం 12 యూనిట్ల నిర్మానం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనులు వేగవంతంగా చేస్తున్నట్లు ఏపీ జెన్‌కో ఎస్‌ఈ రత్నకుమార్‌ తెలిపారు.

ఈ ఏడాది సాగు నీటి ఎద్దడి లేకుండా..

ప్రస్తుతం రైతులకు సాగునీటి ఎద్దడి లేకుండా ఉమ్మడి పశ్చిమ డెల్టా, కృష్ణా డెల్టాలకు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నిత్యం 20 పంపులు 20 మోటార్లతో 7,080 క్యూసెక్కుల జలాలను పోలవరం కుడి కాలువకు పంపిణీ చేస్తున్నారు. ధవళేశ్వరం సర్‌ ఆర్దర్‌ కాటన్‌ బ్యారేజి నుంచి కుడి, ఎడమ, సెంట్రల్‌ కాలువలకు 10 వేల క్యూసెక్కుల గోదావరి జలాలను ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు.

30 పడకల ఆస్పత్రికి మోక్షమెప్పుడు ?

పోలవరం: పోలవరం సామాజిక ఆరోగ్యం కేంద్రం ప్రాంగణంలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించి ఐదేళ్లు గడిచినా నేటికీ పూర్తికాక ప్రజానీకం అత్యవసర పరిస్థితులలో వైద్యం కోసం రాజమహేంద్రవరం వెళ్లాల్సి వస్తోంది. పోలవరం మండల కేంద్రంలో రూ.5.16 కోట్ల నాబార్డు నిధులతో 26–10–2020లో నిర్మాణం చేపట్టారు. రెండేళ్లలో పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో మండల ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద పనుల్లో ప్రమాదాల్లో గాయపడిన కార్మికులకు, మండలంలో పలు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు అత్యవసర చికిత్సలు అందించేందుకు జాగా లేని పరిస్థితుల్లో ఇక్కడి వైద్యులు రాజమహేంద్రవరం సిఫార్సు చేస్తున్నారు. దీనివల్ల అధికశాతం రోగులు, క్షతగాత్రులు వైద్యం అలస్యమై మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో ఒక గర్భిణీకి వైద్య సేవలు ఆలస్యం కావడంతో గర్భంలో బిడ్డతో సహా మృతి చెందింది. ఆస్పత్రి నిర్మాణ బాధ్యతలు చేపట్టిన నాగార్జున నిర్మాణ సంస్థకు బిల్లులు కాకపోవడంతో నిర్మాణా న్ని మధ్యలో నిలిపివేసినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాంబాబు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పం దించి 30 పడకల ఆస్పత్రి నిర్మాణం సత్వరమే పూర్త య్యేలా చర్యలు తీసుకోవాలని మండలవాసులతో పాటు టీడీపీ మండల అధ్యక్షుడు మంగిన కొండ విజ్ఞప్తి చేస్తున్నారు.

పైసా పెరగలేదు..!

సీఎం ఆదేశించినా పట్టించుకోని కంపెనీలు

నేటికీ కేజీ ధర రూ.265 మాత్రమే

పొగాకు రైతుల్లో ఆందోళన

జంగారెడ్డిగూడెం రూరల్‌, జూలై 12(ఆంధ్రజ్యోతి): పొగాకు రైతులు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నా రు. వరుస సీజన్‌లలో లాభాలు వస్తున్నాయని రెట్టింపు ఉత్సాహంతో సాగుకు దిగారు. పెట్టుబడులు పెరిగినా ఖర్చుకు వెనకడుగు వేయలేదు. తీరా పండించిన పంట ను అమ్మకానికి పెడితే కనీసం ఖర్చులు రాని ధరలకు కంపెనీలు కొంటున్నాయి. ఒక్కొ కేజీకి రూ.100ల వరకు నష్టం వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా ట్రేడర్స్‌, బోర్డు అధికారు లతో సమీక్షించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆదేశించినా మార్కెట్‌లో చలనం లేకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. గతంతో పోలిస్తే పెట్టుబడులు మూడు రెట్లు పెరి గాయి. తీరా అమ్మేందుకు బోర్డుకు పంటను తీసుకెళ్తే ఐదేళ్ల క్రితం ధరలకు కొనుగోలు చేస్తుండడంతో రైతుల కళ్లల్లో కన్నీరే మిగిలింది. దీంతో రైతుల ఆవేదన కాస్తా ఆందోళన బాట పట్టింది. ధర్నాలు చేశారు. అధికారులను కలిసారు. చివరకు కూటమి నాయకుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దృష్టికి విషయం వెళ్లింది. పొగాకు పరిస్థితిపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గత బుధవారం బోర్డు అధి కారులు, ట్రేడర్స్‌తో సమీక్ష నిర్వ హించారు. పొగాకు పంట పండించిన రైతుకు మద్దతు ధర ఇవ్వాల్సిందేనంటూ సీఎం స్పష్టం చేశారు. 28 కంపెనీల ఇండెంట్‌ వివరా లను, ప్రస్తుత కొనుగోలు శాతంను పరిశీలించి నెమ్మదిగా కొనుగోలు జరగడానికి గల కారణాలను ఆరా తీశారు. కర్ణాటకలో బాగానే కొనుగోలు జరిగినప్పుడు ఇక్కడెందుకు ఇబ్బందులు వచ్చాయంటూ బోర్డు అధికారులను, ట్రేడర్స్‌ ను ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో రైతుకు అన్యా యం జరిగితే సహించేది లేదని అది ట్రేడర్స్‌కే నష్టం జరుగుతుందని సీఎం హెచ్చరించారు. దీంతో రైతుల గుండెల్లో కాస్త భారం తగ్గింది. అయితే సీఎం ఆదేశించినా మార్కెట్‌ ధరల్లో ఎటువంటి పెరుగుదల లేదు. ఇప్పటికీ కేజీ రూ.265 దాటకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సరాసరి కేజీ పొగాకు రూ.248లోపే..

ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లు ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సరాసరి కేజీ పొగాకు ధర రూ.248లోపే నమోదైంది. సాగుకు పెట్టిబడిన పెట్టుబడుల ఆధారంగా కేజీ సరాసరి ధర రూ.300ల ఉంటేనే గట్టెక్కుతామని రైతులు చెబుతున్నారు. గతేడాది కేజీ పొగాకు గరిష్ఠంగా రూ.454లు, సరాసరి కేజీ రూ.328 ఉండగా దానికి ఇప్పుడు సరాసరిన ఒక కేజీకి రూ.100 తగ్గడంతో కనీస పెట్టుబడులు రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నేడు సీఎం పోలవరం రాక

క్షేత్రస్థాయిలో పనుల ప్రగతి పరిశీలన

అధికారులతో సమీక్ష

భారీ భద్రతా ఏర్పాట్లు

పోలవరం/ఏలూరు క్రైం, జూలై 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తారు. ఇరిగేషన్‌ అధికా రులతో సమీక్షించి దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు రానున్న నేపథ్యంలో ఎస్పీ ప్రతాప్‌ శివకిశోర్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. ప్రాజెక్టుకు 10 కిలోమీటర్ల దూరం వరకు ఐదు అంచెల భద్రతా చర్యలను చేపట్టారు. ఆదివారం నాటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి పోలీసులు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌, ప్రత్యేక పోలీసు బలగాలు ప్రాజెక్టులో సీఎం పర్యటించ నున్న ప్రాంతాలను నిశితంగా పరిశీలన చేశారు. ఇద్దరు ఏఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 30 మంది సీఐలు, 60 మంది ఎస్‌ఐలు, 700 మంది పోలీస్‌ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.

సీఎం టూర్‌ షెడ్యూల్‌..

ఉదయం 10.25 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 11 గంటలకు చేరుకుంటారు.

11 నుంచి 11.10 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు

1.25 నుంచి 11.40 వరకు ధవళేశ్వరం సర్‌ ఆర్దర్‌ కాటన్‌ బ్యారేజి గేట్‌ 1 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు.

11.45 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు ఆత్రేయపురం మండలం పిచ్చుకలంకలో రైతులతో సమావేశం

మధ్యాహ్నం 1.20 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు రాక ఏరియల్‌ సర్వే

మధ్యాహ్నం 1.50 గంటలకు ప్రజల నుంచి అర్జీల స్వీకరణ

మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రాజెక్టులో ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం గ్యాప్‌–2, జలవిద్యుత్‌ కేంద్రం పనులు నిర్మాణపు పనులకు సంబంధించి నిర్మాణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ల పరిశీలన

అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టు అఽధికారులు ఇతర శాఖల అధికారులతో సమీక్ష

5.25 గంటలకు తిరిగి హెలికాప్టర్‌లో ఉండవల్లి బయల్దేరి వెళ్లతారు.

Updated Date - Jul 13 , 2026 | 12:39 AM