పోలవరం గరం గరం
ABN , Publish Date - Jul 04 , 2026 | 01:03 AM
పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోడ్డున పడ్డాయి. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు, సీనియర్ నేతలకు మధ్య పెరిగిన అంతరం.. తాజాగా పతాక స్థాయికి చేరింది.
జనసేనలో ఎమ్మెల్యే చిర్రి వర్సెస్ సీనియర్ నేతలు
పార్టీలో పెరుగుతున్న అంతరం.. బాలరాజుపై అధిష్ఠానానికి వరుస ఫిర్యాదులు
నెల క్రితం పిలిచి మాట్లాడిన అధినేత పవన్.. తీరు మార్చుకుంటానని హామీ
పార్టీ రఽథసారథుల ఎంపికపై దరఖాస్తుల స్వీకరణ తొలి సమావేశానికి గైర్హాజరు
ఏలూరు సమావేశానికి భారీగా కార్ల ర్యాలీ.. ఎమ్మెల్యేపై దాడికి యత్నం
తొలుత జంగారెడ్డిగూడెంలో ‘దొరల పాలన’పై వ్యాఖ్యలు.. సర్వత్రా చర్చ
(ఏలూరు/రూరల్–ఆంధ్రజ్యోతి):
పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోడ్డున పడ్డాయి. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు, సీనియర్ నేతలకు మధ్య పెరిగిన అంతరం.. తాజాగా పతాక స్థాయికి చేరింది. కొన్ని నెలలుగా పార్టీలో ఎవరూ కలిసి పనిచేయడం లేదు. ఎవరి దారి వారిదే అన్నట్టు సాగుతోంది. ఇంకోవైపు కూటమిలోని సహచర పార్టీలు బీజేపీ, టీడీపీలు కలుపుకుని వెళ్లడం లేదు. దీనిపై జనసైనికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏడాది క్రితం మాజీ మంత్రి దేవినేని ఉమా, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు మధ్య జరిగిన ఫోన్ సంభా షణలో ఎమ్మెల్యే బాలరాజు అవినీతి వ్యవహా రాలపై సాగిన చర్చ ఆడియో లీకై బయటకు రావడంతో కలకలం రేగింది. అప్పటి నుంచి రాంబాబు, బాలరాజు మధ్య సత్సంబంధాలు సరిగా లేవు. తర్వాత కాలంలో ఎమ్మెల్యే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూల్లో బాలరాజు సీనియర్లను కించపర్చేలా వ్యాఖ్యానించడంతో సీనియర్ నాయకులు, పార్టీ మండల అధ్యక్షు లతో అంతరం పెరుగుతూ వస్తోంది. ఈ క్రమం లో ఎమ్మెల్యే వ్యక్తిగత వ్యవహారాలపైన, పని తీరుపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాల రాజును పిలిపించి నెలరోజుల్లో పనితీరు మార్చు కోవాలని హెచ్చరించారు. వ్యక్తిగత పనుల వల్ల పార్టీ ప్రతిష్టకు మచ్చ తీసుకు వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. దీనిని సరిచేసుకుంటానని బాలరాజు హామీ ఇచ్చారు.
పార్టీ సమావేశానికి గైర్హాజరు
జనసేన పార్టీ రథసారథుల కమిటీల ఏర్పా టుకు కొయ్యలగూడెంలో బుధవారం సమావేశం జరిగింది. జిల్లా ఇన్‌చార్జి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావే శానికి నియోజకవర్గ ఏడు మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు హాజరై పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. కాని, ఈ సమావే శానికి ఎమ్మెల్యే బాలరాజు హాజరుకాకపోవడం పార్టీ వర్గ విభేదాలపై చర్చ సాగింది.
ఏలూరుకు ర్యాలీగా..
జనసేన పార్టీ ఏలూరు జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ నిర్మాణ సారథు లు ఎంపిక కమిటీ సమావేశానికి తన స్వగ్రా మం బర్రింకలపాడు నుంచి ఎమ్మెల్యే బాలరాజు భారీ కాన్వాయ్‌తో బయలుదేరి వచ్చారు. మరో నేత కరాటం సాయి అనుచరగణంతో హాజర య్యారు. రెండు వర్గాలుగా వున్న జనసేన నాయ కులు, కార్యకర్తలు తమ తమ దరఖాస్తులను విడివిడిగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు అందజేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఎమ్మెల్యే బాలరాజు మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కొయ్యలగూడెం సమావేశం సమాచారాన్ని తనకు ఇవ్వకుండా కొందరు పార్టీ నాయకులు నిర్వహించారని ఆరోపించారు. పార్టీలో కొందరు నాయకులు పెత్తందారీ ధోరణితో వ్యవహరిస్తూ తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్యేపై దాడికి యత్నం
ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతుండగా ఏలూరు జనసేన నాయకుడు బొత్స మధు ఆయనపై దాడికి యత్నించడం కలకలం రేపింది. సమస్యలు వుంటే అధిష్ఠానం వద్ద తేల్చుకోవాలని, పార్టీ కార్యాలయం వద్ద మాట్లాడొద్దంటూ దాడికి యత్నించి మైకు లాగే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు, ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
దొరల పాలన నుంచి నేడు పోలవరానికి విముక్తి : బాలరాజు
జంగారెడ్డిగూడెం, జూలై 3(ఆంధ్రజ్యోతి): ‘రెండేళ్లుగా మా నాయకులతో ఎన్నో ఇబ్బం దులుపడ్డా. పోలవరం నియోజకవర్గం ఈ రోజు నుంచి దొరల పాలన నుంచి విముక్తి పొందింది. నియోజకవర్గంలో జనసేన అంటే బాలరాజు, బాలరాజు అంటే జనసేన. నా కోసం నిలబడిన నాయకులకు అండగా ఉం టా. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను నిలబెట్టిన వ్యక్తులను భారీ మెజార్టీతో గెలి పించుకోకపోతే నా పేరు చిర్రి బాలరాజే కాదు’ అంటూ పోలవరం ఎమ్మెల్యే శుక్రవా రం జంగారెడ్డిగూడెంలో సవాల్ విసిరారు. ఏలూరులో శుక్రవారం జరిగిన పార్టీ సమా వేశానికి భారీగా కార్లతో ర్యాలీగా వెళ్లారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండు సమీపం లోకి వచ్చేసరికి సడన్‌గా ఎమ్మెల్యే కారు టాప్ ఎక్కి మాట్లాడడం చర్చకు దారితీశా యి. తన నియోజకవర్గం కాని జంగారెడ్డి గూడెంలో ఎమ్మెల్యే బహిరంగ సవాళ్లు విసర డంపై పార్టీలో విమర్శలు వ్యక్తమయ్యాయి.