తవ్వేయ్..తరలించేయ్!
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:45 AM
ఏలూరు జిల్లా నూజివీడు, దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలవరం కాలువ గట్లను కొల్లగొట్టేస్తున్నారు. గోరంత అనుమతి పొంది కొండంత మట్టిని తరలిస్తు న్నారు.
పోలవరం కాల్వ గట్లపై మట్టికి రెక్కలు
నూజివీడు, దెందులూరు నియోజకవర్గాల్లో కొందరు తమ్ముళ్ల హవా
ధర, పరిధిపై గొడవ.. రాజీ చేసిన ప్రజా ప్రతినిధి
(నూజివీడు – ఆంధ్రజ్యోతి)
ఏలూరు జిల్లా నూజివీడు, దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలవరం కాలువ గట్లను కొల్లగొట్టేస్తున్నారు. గోరంత అనుమతి పొంది కొండంత మట్టిని తరలిస్తు న్నారు. ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన కొందరు తెలుగు తమ్ముళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని నూజివీడు ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రైవేటు కర్మాగారాలకు ఈ మట్టిని విక్రయిస్తున్నారు. 30 నుంచి 50 టన్నుల భారీ వాహనాలతో పగలు, రాత్రీ తేడా లేకుండా తరలిస్తున్నారు. వాస్తవానికి కాలువలోని మట్టిని దాని భవిష్యత్ అవసరాలకు గట్లపై ఉంచు తారు. కాని, ఈ నియోజకవర్గాల పరిధిలోని పల్లెర్లమూడి, సీతారాపురం, కొక్కిరపాడు, వేంపాడు గ్రామాల పరిధిలోని ఈ కాలువ గట్లపై వున్న మట్టిని మాయం చేస్తున్నారు. సీతారాంపురం సమీపంలో పోలవరం కాలువ ను, రామిలేరు కాలువ క్రాస్ చేసి కొల్లేరులోకి వెళుతుంది. 2015 ఆగస్టు 1వ తేదీన పడిన భారీ వర్షాలకు ఈ ప్రాంతంలో పోలవరం కాలు వకు భారీ గండిపడింది. దీనిని పూడ్చేందుకు నాడు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గండి పడిన ప్రాంతం వద్ద పది రోజులపాటు మకాం వేసి పనులను పర్యవేక్షించారు. గండి పూడ్చేందుకు నాడు పోల వరం గట్ల మీద వున్న మట్టే ఉపయోగపడిం ది. ఇప్పడు ఆ ప్రాంతం నుంచే మిగిలిన మట్టిని తమ్ముళ్లు పోటీ పడి మరీ అమ్ముకుంటు న్నారు.
తమ్ముళ్ల మధ్య తగాదా
ఈ రెండు నియోజకవర్గాల తమ్ముళ్లు ట్రిప్పు లు, ధర, నియోజకవర్గం పరిధి విషయంపై ఆదివారం గొడవ పడ్డారు. జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి కార్యాలయంలో దీనిపై పంచా యితీ జరిగింది. దీనికి ఈ నియోజవర్గాల మట్టి తోలకందారులు హాజరయ్యారు. అక్కడ పెద్దల సమక్షంలో రాజీ కుదిరింది. ఇది ఏలూరుతో పాటు, ఉమ్మడి కృష్ణా జిల్లాలోను చర్చనీయాంశ మైంది.