Share News

పుష్కరాలకు ముందే పోలవరం

ABN , Publish Date - Jan 08 , 2026 | 01:06 AM

వీలైనంత త్వరగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తా. అంతర్జాతీయ పర్యాటకంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం.

పుష్కరాలకు ముందే పోలవరం
హిల్‌వ్యూ ప్రాంతంలో పనుల ప్రగతి తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. చిత్రంలో మంత్రులు నిమ్మల, పార్థసారఽథి, ఎంపీ మహేశ్‌

అంతర్జాతీయ పర్యాటకంగా తీర్చిదిద్దుతాం

పునరావాసం అమలుపై ప్రతీ నెల సమీక్ష

కుడి కాల్వ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు నీరు

లక్ష్యాలను నిర్ధేశించుకుని పనిచేయాలి

పోలవరం పర్యటనలో సీఎం చంద్రబాబు

ఏరియల్‌ వ్యూ ద్వారా పనుల పరిశీలన

అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష

ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును

వీలైనంత త్వరగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తా. అంతర్జాతీయ పర్యాటకంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ప్రాజెక్టు కోసం భూములిచ్చిన అర్హులైన నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పునరావాసం అందజేసే బాధ్యత నాది. ప్రతీ నెలా కాలనీల నిర్మాణం, పునరావాసం అమలుపై సమీక్ష జరుపుతున్నా. అధికారులంతా లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని పూర్తి చేసే దిశగా అడుగులు వేయాలి.

– పోలవరంలో సీఎం చంద్రబాబునాయుడు

ఏలూరు/పోలవరం, జనవరి 7(ఆంధ్రజ్యోతి):పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిశితంగా పరిశీలించారు. అనుకున్న సమయానికి పనులను పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టు సంస్థకు దిశా నిర్దేశం చేశారు. బుధవారం ఉదయం 11.30 నుంచి సాయంత్రం 3.58 గంటల వరకు సీఎం క్షణం తీరిక లేకుండా సమీక్షలు, పరిశీలనలతో గడిపారు. తొలుత హెలికాప్టర్‌లో వస్తూ.. ఏరియల్‌ వ్యూ ద్వారా పనులు పురోగతిని పరిశీలించారు. హెలిప్యాడ్‌ నుంచి ప్రత్యేక బస్సులో ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రాజెక్టులోని పలు విభాగాల్లో పనుల పురోగతిని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామా నాయుడు, ఆ శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు ఎస్‌ఈ రెడ్డి రామచంద్రరావులను అడిగి తెలుసుకున్నారు. అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ వద్ద, వైబ్రో కాంపాక్షన్‌ వద్ద, కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీలో ప్రధానమైన మామిడిగొంది దేవరగొంది జంట గుహల వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జి బిషన్‌లను పరిశీలించారు. అధికారుల పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌పై సీ ఎం సంతప్తి వ్యక్తం చేశారు. గ్యాప్‌–1, గ్యాప్‌–2 ఈసీఆర్‌ఎప్‌ (ఎర్త్‌కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌), డయా ఫ్రమ్‌ వాల్‌, కుడి ప్రధాన కాల్వ అనుసంధాన పనుల ను పరిశీలించారు. భోజన విరామానంతరం జల వనరుల శాఖ అధికారు లు, ప్రజా ప్రతినిధులు, నిర్మాణ సంస్థలతో సమీక్ష నిర్వహించారు.

పుష్కరాలకు ముందే పూర్తి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పోలవరం ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాలకు ముందుగానే పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా రూపొందించాలి. ప్రాజెక్టు అంతా నీటితో, అటవీ ప్రాంతంతో అద్భుతంగా తయారవుతుంది. ఇది పర్యాటకానికి ఎంతో అనువైన ప్రదేశం. రోడ్డు, రైల్‌ సౌకర్యాలు వున్నాయి. వీటితో పాటు విమానాశ్రయం దగ్గరలోనే ఉంది. ఐకానిక్‌ బ్రిడ్జితో పాటు వాటర్‌ స్పోర్ట్సు, బోటింగ్‌, వంటివి ఏర్పాటు చేయాలి. దీనికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలి’ అని సీఎం అధికారులను ఆదేశించారు.

కొల్లేరుకు గోదావరి నీళ్లు

‘పోలవరం కుడి కాల్వ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు నీరందిస్తాం. ఫిబ్రవరి 15 నాటికి డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం పూర్తి అయ్యేలా చూడాలి. 12 నెలల్లో ఆర్‌అండ్‌ఆర్‌ పనులు పూర్తి చేసేలా యాక్షన్‌ ప్లాన్‌ ఉండాలి. పట్టిసీమను అడ్డుకోవాలని చూశారు. విమర్శలు చేశారు. అయినా మొక్కవోని ధైర్యంతో ప్రాజెక్టు చేపట్టడం వలన కృష్ణా డెల్టాకు నీరు అందించడం సాధ్యమైంది. గోదావరి నీళ్లతో కృష్ణా డెల్టా సస్యశ్యామలం చేశాం. పోలవరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం నలుమూలలకు నీటిని అందించే ప్రణాళిక చేసుకోవచ్చు. కుడి, ఎడమ కాల్వలు, టన్నెళ్ల ద్వారా నీటిని అనుసంధానం చేస్తాం.. ఎడమ కాల్వ పనులు త్వరిగతిన పూర్తి చేసి తద్వారా విశాఖ వరకు పోలవరం నీళ్లను తీసుకెళ్లడానికి అన్ని చర్యలు చేపట్టాం. దీంతో విశాఖ, అనకాపల్లిలు సస్యశ్యామలం అవుతాయి. అలాగే పోలవరం కాల్వల ద్వారా పారే గోదావరి జలాలుతో దారి పొడవునా ఉన్న మైనర్‌ ఇరిగేషన్‌, చెక్‌ డ్యాంలను నింపుతూ వెళ్తాం’ అని సీఎం చెప్పారు.

ముఖ్యమంత్రికి స్వాగతం

ఉదయం 11.30 గంటలకు పోలవరం ప్రాజెక్టు హెలీప్యాడ్‌కు చేరుకున్న సీఎంకు మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్‌, ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, కామినేని శ్రీనివాస్‌, మద్దిపాటి వెంకట్రాజు, సొంగా రోషన్‌ కుమార్‌, బడేటి రాధాకృష్ణ, పత్సమట్ల ధర్మరాజు, పితాని సత్యనారాయణ, జడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పేరాబత్తుల రాజశేఖరం, ఏపీ ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం శ్రీనివాసులు, ఏలూరు, అల్లూరి జిల్లా కలెక్టర్లు వెట్రిసెల్వి, దినేష్‌ కుమార్‌, ఐజీ అశోక్‌కుమార్‌, ఎస్పీ ప్రతాప్‌ శివకిశోర్‌, ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ అభిషేక్‌గౌడ, కె.మేరీ ప్రశాంతి, ఇంజనీరింగ్‌ చీఫ్‌ ఎన్‌.నరసింహమూర్తి, గౌరవ సలహాదారులు ఎం.వెంకటేశ్వరరావు, మేఘా ప్రతినిధులు అంగర సతీష్‌, గంగాధర్‌, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి తదితరులు పూల బొకేలు అందజేసి స్వాగతం పలికారు.

ఎమ్మెల్యే బాలరాజుకు బర్త్‌ డే విషెస్‌

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేకు తినిపించారు. ప్రాజెక్టు వద్ద సమీక్ష పూర్తయిన తర్వాత గురువారం ఎమ్మెల్యే పుట్టినరోజు అని తెలియడంతో కేకు తెప్పించి కట్‌ చేయించారు. అడ్వాన్స్‌ హ్యాపీ బర్త్‌డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు. అక్కడే వున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు విషెస్‌ తెలిపారు. అనంతరం సాయంత్రం 3.58 గంటలకు తిరిగి హెలీకాఫ్టర్‌లో తాడేపల్లి బయలుదేరి వెళ్లారు.

Updated Date - Jan 08 , 2026 | 01:06 AM