పరిహారం..పాట్లు!
ABN , Publish Date - May 19 , 2026 | 12:40 AM
ఏళ్ల తరబడి మాకు న్యాయం జరగడం లేదు. ఇక్కడే పుట్టి పెరిగిన మాకు పరిహారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు వాపోతున్నారు.
పోలవరం నిర్వాసితుల ఎదురుచూపులు
అర్హతలున్నా అందని సొమ్ములు
ఏళ్ల తరబడి కార్యాలయాలచుట్టూ ప్రదక్షిణలు
సీఎం చంద్రబాబు హామీతో చిగురించిన ఆశలు
కుక్కునూరు, మే 18(ఆంధ్రజ్యోతి):
ఏళ్ల తరబడి మాకు న్యాయం జరగడం లేదు. ఇక్కడే పుట్టి పెరిగిన మాకు పరిహారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు వాపోతున్నారు. ప్రాజెక్టు కోసం భూములిచ్చి గ్రామాలను కోల్పోతూ ఇళ్లు ఖాళీ చేసి తరలివెళ్లే నిర్వాసితులైన త్యాగ ధనులకు పరిహారం అందడం లేదన్న ఆవేదన కలగకుండా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల అమరావతిలో అధికారులకు సూచిం చారు. దీంతో ఇప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందని నిర్వాసితులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న గ్రామాల్లోన్ని నిర్వాసితులకు వ్యక్తిగత పునరావాస పరిహారం, కోల్పోతున్న ఇళ్లకు పరిహారం ఇచ్చి వారిని ఇక్కడ నుంచి తరలించాలి. వందలాది మంది నిర్వాసితు లకు పరిహారం మంజూరు కాగా పలు కారణాలతో పెండింగులో ఉంచారు. తమకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్న న్యాయం జరగడం లేదు. ఈ ఏడాది 41.15 కాంటూ రు లెవెల్‌లో ఉన్న గ్రామాల్లోని నిర్వాసితులను తరలించడానికి ఓవైపు సన్నాహాలు చేస్తుండగా పరిహారం అందని నిర్వాసితులు మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఆధారాలున్నా దక్కని పరిహారం
ముంపునకు గురవుతున్న గ్రామాల్లో 2017లో ప్రభుత్వం నిర్వాసితులను గుర్తించడానికి ఇంటింటి సర్వే చేసి జాబితాను విడుదల చేసింది. సర్వే సమ యంలో అనర్హులను జాబితాలో చేర్చారన్న ఆరోపణ లు వచ్చాయి. దీంతో అప్పటి అధికారులు వారి వివ రాలను వాట్సప్‌లో మెసేజ్‌లో తెలపాలని కోరారు. ఈ క్రమంలో జరిగిన తప్పిదాల కారణంగా స్థానికంగా ఉన్న కొందరి పేర్లు కూడా జాబితాలో గల్లంతయ్యాయి. స్థానికంగా అన్ని ఆధారాలు ఉన్న ప్పటికి ఉపాధి కోసం బయట ప్రాంతాలకు వెళ్లారనే ఆరోపణలు రావడంతో వారి పేర్లను జాబితా నుంచి తొలగించారు. అయితే 2014 నుంచి 2017 జూలై వరకు స్థానికంగా ఆధార్, రేషన్, ఓటు గుర్తింపు, ఉపాధి హామీ కార్డులు ఉంటే వారిని పునరావాస పరిహారానికి అర్హులుగా పరిగణించాలనే నిబంధన ఉంది. కానీ వాట్సప్ మెసేజ్‌ల ద్వారా జరిగిన తప్పి దాలతో వందలాది మంది నిర్వాసితుల పేర్లు జాబితాల్లో గల్లంతయ్యాయి. ఇక అప్పటి నుంచి తమను పరిహారం జాబితాలో చేర్చాలని వారంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో కుక్కునూరుకు చెందిన పలువురు నిర్వా సితులు ఆధారాలతో పరిహారం అందించాలని కోర్టుకు వెళ్లారు. కోర్టు సైతం వారికి పరిహారం అందించాలని తీర్పు ఇచ్చింది. అయినప్పటికి వారికి పరిహారం అందడం లేదు.
300 పైగా ఇళ్ల పేర్లు జాబితాలో గల్లంతు
41.15 కాంటూరు లేవిల్‌లో ఉన్న కుక్కునూరు, కివ్వాక గ్రామాలకు చెందిన దాదాపు 300 పైగా ఇళ్లకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల పేర్లు గల్లంతయ్యాయి. గత ఏడాది ఆ రెండు గ్రామాల్లోని వ్యక్తిగత పునరావాస పరిహారరం, ఇంటి విలువకు సంబంధించి పరిహారం చెల్లించే ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈ జాబితాలో గల్లంతైన 300 మంది ఇళ్లకు సంబంధించి పరిహారరం పెండింగులోనే ఉంది. వ్యక్తిగత పునరావాస పరిహారం చెల్లించిన మాకు ఇంటి పరిహారం చెల్లించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపితే వెంటనే పరిష్కారం జరిగేది. కాని అధికారుల నిర్లక్ష్య వైఖరితో నిర్వాసితులు ఏళ్ల తరబడి పరిహారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. సీఎం హామీతోనైనా నిర్వాసితులకు న్యాయం జరుగుతుందనే ఆశ నిర్వాసితుల్లో వ్యక్తమవుతోంది.
110 ఇళ్ల పేర్లు తొలగించారు
మా గ్రామంలో 110 ఇళ్ల పేర్లు జాబితాలో గల్లంతయ్యా యి. ఇళ్ల విలువకు సంబంధించి పరిహారం అందడం లేదు. అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. మాకు వ్యక్తిగత పునరావాస పరిహారం అందించిన ప్రభుత్వం ఇళ్ల పరిహారం కూడా చెల్లించాలని కోరుతున్నాం.
ఎం.వెంకటన్నబాబు, కివ్వాక గ్రామ నిర్వాసితుడు
ఏనాడు గ్రామాన్ని విడిచి వెళ్లలేదు..
మాది కుక్కునూరు ఏ–బ్లాక్, పరిహారం ప్రక్రియను ప్రభు త్వం పూర్తి చేస్తోంది. మేము ఏనాడు గ్రామాన్ని విడిచి వెళ్లలేదు. అయినా నా పేరు పెండింగ్‌లో ఉంది. అధికారుల చుట్టూ తొమ్మిదేళ్లుగా తిరుగుతూనే ఉన్నాను. నాకు న్యాయం జరగడం లేదు.
– కాకులమారి సుధాకర్, కుక్కునూరు, ఏ–బ్లాక్ నిర్వాసితుడు