ముంచేశారు !
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:30 AM
ప్రతీ ఒక్కరికీ సొంత ఇల్లు అనేది ఒక కల.. దాన్ని సాకారం చేసుకునేందుకు రూపాయి రూపాయి కూడ బెట్టుకుంటారు.
సొసైటీ పేరుతో విస్సాకోడేరులో ప్లాట్లు
ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కొనుగోలు
చెప్పిన సదుపాయాలేవీ కల్పించలేదు..
లబోదిబోమంటున్న బాధితులు.. పోలీసులకు ఫిర్యాదు
పాలకోడేరు, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరికీ సొంత ఇల్లు అనేది ఒక కల.. దాన్ని సాకారం చేసుకునేందుకు రూపాయి రూపాయి కూడ బెట్టుకుంటారు. విశ్రాంత ఉద్యోగు లైతే వారి పదవీ విరమణ అనంతరం వచ్చిన సొమ్ముతో ఇల్లు కట్టుకొని కాలక్షేపం చేద్దామనుకుంటారు.. కొంతమంది డవలపర్స్ వీరి కలలను ఆసరాగా తీసుకొని నిండా ముంచుతున్న సందర్భాలు లేకపోలేదు.. పాలకోడేరు మండలం విస్సాకోడేరు శివారులో మేక్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ద్వారా సుమారు 28 ఎక రాల్లో 280 ప్లాట్లు ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు అని 2020లో లేఅవుట్ వేశారు. ఈ లేఅవుట్ అన్ని హంగులతో ఉంటుందని నమ్మబలికారు. దీంతో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలో నివసిస్తే బాగుంటుందనే ఆశతో రెండు మూడు దపాల కింద 5 సెంట్లకు గాను ఒక్కొకరు 20 లక్షల రూపాయలను వెచ్చించారు. సొసైటీ ద్వారా లేఅవుట్ వేశారు.. అభివృద్ధి చేస్తామంటూ డవలప్‌మెంట్ చార్జీల కింద ఒక్కొ క్కరి నుంచి అదనంగా మూడు లక్షలు తీసుకున్నారు. చివరకు తమను ముంచేశారని లబోదిబోమంటున్నారు.
అధికారుల చుట్టూ బాధితులు
ఈ లేఅవుట్‌లో జిల్లావ్యాప్తంగా ఉన్న విశ్రాంత ఉద్యోగులు ప్లాట్లు కొనుగోలు చేశారు. ఈ లేఅవుట్ జిల్లాలోనే అతి పెద్దదని చెప్పారు. ఇడా అనుమతుల ప్రకారం నవంబరు 2025 నాటికి అభివృద్ధి చేసి అప్పగించాల్సి ఉంది. ముందుగా చెప్పినట్లుగా 60 అడుగుల ప్రధాన రహదారి లేదు. 40 అడుగుల వెడల్పుతో కూడిన సీసీ రోడ్లు లేవు. సెంట్రల్ లైటింగ్ లేదు.. 2.5 లక్షల లీటర్ల ఓవర్‌హెడ్ ట్యాంకు.. ఇలా చెప్పినవి ఏవీ ఇక్కడ లేవని ఆరోపిస్తున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయామంటూ కొంతమంది బాధితులు పాల కోడేరు ఎస్‌ఐ రవివర్మకు సోమవారం ఫిర్యాదు చేశారు. స్థలాలు కొనుగోలు చేసి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ తమ పరిస్థితి అయోమయంగా ఉందని తమకు న్యాయం చేయాలని ఆటూరి రామారావు, తోటకూర శ్రీనివాసవర్మ, గోవిందరాజులు, సూర్య నారాయణరాజు, రత్నం, జి.సత్యనారాయణ తది తరులు విన్నవించు కున్నారు. కలెక్టర్‌కు, డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజుకు తమ గోడు విన్న వించుకున్నామని బాధితులు తెలిపారు.